418 Review: హారర్ థ్రిలర్ '418' మెప్పించిందా..
ABN, Publish Date - Oct 23 , 2026 | 10:15 AM
పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్ఫణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన '418’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది? మరీ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని భయపెట్టిందా? రివ్యూలో చూద్దాం.
సినిమా రివ్యూ: 418
విడుదల తేది: 23–10–2026
హారర్, థ్రిల్లర్ జానర్ మూవీస్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోపెట్టించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే కలెక్షన్లకు కొదవే ఉండదు. 'ఈ సినిమా చూసినవారు భయంతో బెంబేలెత్తిపోతారు.. హారర్ చిత్రాలంటే భయపడేవారు ఈ సినిమా చూడొద్దు’ అనే ప్రచారంతో జనం ముందుకు వచ్చిన చిత్రం '418’. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్ఫణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ముందు నుంచి మంచి క్రేజ్ ఏర్పడింది. డార్క్ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంతో కీర్తన్ నాదగౌడ దర్శకునిగా పరిచయం అయ్యారు. ట్రైలర్‌తో ఆకట్టుకున్న '418' శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది? మరీ ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల్ని భయపెట్టిందా? రివ్యూలో చూద్దాం.
కథ:
వివేక్ (సూర్యరాజ్) డాక్టర్ చదవాలనే కోరికతో కర్ణాటక వేలగిరిలోని పేరున్న మెడికల్ కాలేజ్‌లో చేరతాడు. కొంతకాలం మూసివేసి ఉన్న ఆ కాలేజ్ హాస్టల్‌కు మరమ్మతులు చేయించి మళ్లీ వాడుకలోకి తీసుకొస్తారు. మహిళలకు ఆ హాస్టల్ గేట్ దగ్గర అడుగుపెట్టడానికి కూడా అవకాశం ఉండదు. అందులో రూమ్ నంబర్ 417ను వివేక్, అతని మిత్రుడు రోహిత్ (చరణ్ లక్కరాజు)కు ఇస్తారు. ఆ పక్కనే ఉన్న 418 గది జోలికి మాత్రం వెళ్లొద్దని వార్డెన్ హెచ్చరిస్తాడు. ఆ గదిలో ఏముంది? అని కాస్త భయంతోనే ఆలోచిస్తాడు వివేక్. ఆ ఆలోచన మొదలైనప్పటి నుంచి రాత్రి పూట అతనికి భయంకర శబ్దాలు వినిపించడం, పీడ కలలు రావడం, ఎవరో వచ్చి చంపాలని చూడటం లాంటివి జరుగుతాయి. అప్పటి నుంచి ఆ గది నుంచి పారిపోయి బయట ఉంటాడు వివేక్. అసలు ఆ గది వెనకున్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా అదే ఊరిలో యక్షగాన కళ బాగా తెలిసిన దేవిక (చైత్ర ఆచార్)కు 418 గదికి సంబంధం ఉందని తెలుసుకుంటాడు. అసలు దేవిక ఎవరు? ఆమెకు ఆ గదికి.. ఆరుగురు మరణాలకు ఉన్న సంబంధం ఏమిటీ? యూకే నుంచి వచ్చిన సయేషా (ప్రీతి పగడాలి) ఆ గదిలోకి వెళ్లడానికి ప్రయత్నం చేస్తే ఏం జరిగింది? ఆ గది వెనకున్న మిస్టరీని వివేక్ ఎలా చేధించాడు? అన్నది కథ.
విశ్లేషణ:
విమ్స్ మెడికల్ కాలేజ్‌లో పాడుబడ్డ ఓ హాస్టల్ అది. 15 ఏళ్ల తర్వాత దాన్ని తెరవడం.. అందులోని ఓ గదిలో ఆత్మ.. దానికో కథ ఇది సింపుల్‌గా ఈ సినిమా స్టోరీ. ఆరుగురు మరణంతో మొదలైన కథ దానికి ముందు ఏం జరిగిందనే ఆసక్తి కలగజేస్తుంది. అక్కడి నుంచి కథ ఆ హాస్టల్‌కి వచ్చిన నలుగురు కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. 417 గదిలో వివేక్ కు ఎదురైన సంఘటనలు మరింత ఉత్కంఠకు గురిచేస్తాయి. అలా ఇంటర్‌వెల్ వరకూ వెళ్లిపోతుంది. విరామం తర్వాత యక్షగాన కళాకారిణి దేవిక తెరపైకి వస్తుంది. ఆమె కళను వదిలి పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనాలనుకోవడం వంటి సన్నివేశాలను హృద్యంగా తెరకెక్కించారు. అక్కడే సంఘర్షణ మొదలై అసలు కథలోకి వెళ్తుంది. దేవిక గతం, ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆమె కోరిక వెనకున్న సైకలాజికల్ ఎలిమెంట్స్ రక్తి కట్టిస్తాయి. ఆమె కథేంటో తెలుసుకోవడానికి వివేక్ చేసే ప్రయత్నం, ఇన్వెస్టిగేషన్‌ను ఇంకా డెప్త్‌గా చెప్పొచ్చు. కానీ సో సోగా టచ్ చేసి వదిలేశారు. దాంతో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడనే దానిలో క్లారిటీ మిస్ అయింది. హారర్ ఎలిమెంట్స్‌ను బాగా రాసుకున్నారు. కానీ.. మిగతా కథను తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడు. సినిమా ప్రారంభం నుంచి విరామం తర్వాత 20 నిమిషాల వరకూ ఒక ఫ్లోలో నడిచిన కథ.. 418 గది ఓపెన్ చేయాలనే ప్రయత్నం చేసే సమయానికి గజిబిజి అయిపోయింది. సీన్‌కి సీన్‌కి పొంతన లేకుండా పోయింది. ఏవేవో సీన్స్ వస్తాయి... కన్‌ఫ్యూజ్ చేస్తుంటాయి. డాక్టర్ పాటిల్ (రమేశ్ ఇందిర) సైకలాజికల్ రీజన్స్, రూమ్ నంబర్స్ మీద చర్చ అంతా కథను పక్కదారి పట్టిస్తాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణులు పనితీరు..
ఈ సినిమాలో నటించిన వివేక్, చరణ్ లక్కరాజు, ప్రీతి పడగాల ఇలా అందరూ తెరకు కొత్తవారు. వివేక్ పాత్రలో భయస్తుడిగా సూర్యరాజ్ బాగా చేశాడు. కన్నడ నటి చైత్ర ఆచార్ కథకు బలం. యక్షగాన కళాకారిణిగా, సగటు మహిళగా చక్కని నటన కనబర్చింది. ప్రీతి పగడాల కూడా తన మార్క్ చూపించింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది టెక్నికల్ అంశాలే. హారర్ చిత్రాలకు ఎప్పుడు సంగీతం ప్రధాన బలంగా నిలుస్తుంది. ఈ సినిమాకు వెంకీ జీజీ సంగీతం మెయిన్ ఎసెట్. తెరపై పాత్రలు భయపెట్టక పోయినా సౌండ్, లైటింగ్‌తో మాత్రం భయపెట్టగలిగారు. సౌండ్ డిజైన్ సినిమాకు హైలైట్. సినిమాటోగ్రాఫర్ దినేష్ దివాకరన్ హారర్ సినిమాకు కావలసిన లైటింగ్‌తో అద్భుతంగా చిత్రీకరించారు. సినిమా మొత్తం డార్క్ మోడ్‌లోనే నడుస్తుంది. కెమెరా రన్.. సౌండింగ్‌తో మనల్ని ఏదో వెంబడిస్తుంది అనే ఫీల్‌ను కలగచేశారు. సెకెండాఫ్‌లో ఒకట్రెండు చోట్ల కాస్త సాగదీతగా అనిపించాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. తక్కువ బడ్జెట్ లోనే సినిమాను క్వాలిటీగా తీశారు. హారర్ సినిమాల కథలు దాదాపుగా ఇదే యాంగిల్‌లో ఉంటాయి. దానిని తెరపై ఎంత ఉత్కంఠగా చూపించాం అన్నది ముఖ్యం. దర్శకుడు కీర్తన్ నాదగౌడ ప్రతి సీన్‌లోనూ ఉత్కంఠ క్రియేట్ చేశాడు. కానీ.. చెప్పాలనుకున్నది మాత్రం స్ట్రెయిట్‌గా చెప్పలేకపోయాడు. కన్‌ప్యూజ్ చేశాడు. మొత్తం మీద హారర్ సినిమాలను ఇష్టపడేవారికి ఓ మాదిరి నచ్చే ఆస్కారం ఉంది.
ట్యాగ్‌లైన్: వణుకు పుట్టించే గది!
రేటింగ్: 2.5/5