సినిమా రివ్యూ: పిఠాపురంలో.. అలా మొదలైంది..
ABN, Publish Date - Sep 18 , 2026 | 09:24 AM
చంద్రమహేశ్ తన పేరును మహేశ్ చంద్రగా మార్చుకుని కొంత గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టి తీసిన ‘పిఠాపురంలో అలా మొదలైంది’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం
సినిమా రివ్యూ: పిఠాపురంలో.. అలా మొదలైంది.. (Pithapuramlo Ala Modalaindi Review)
విడుదల తేది: 18-9-2026
చాలా ఏళ్ల క్రితం 'ప్రేయసి రావే', 'చెప్పాలని ఉంది', 'ఆలస్యం అమృతం'.. వంటి చిత్రాలు తీసిన చంద్రమహేశ్ తన పేరును మహేశ్ చంద్రగా మార్చుకుని కొంత గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టి తీసిన చిత్రం ‘పిఠాపురంలో అలా మొదలైంది’. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా కీలక పాత్రలు పోషించారు. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా బ్యానర్స్ పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మించారు. ‘పిఠాపురంలో’ అనగానే ఈ సినిమాకు పవన్‌కల్యాణ్‌కు లింక్ ఉంటుందని ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో ఏముంది? మహేశ్ చంద్ర ఈ సినిమాతో ఏం చెప్పబోయారు అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే!
కథ: (Pithapuramlo Ala Modalaindi Review)
పిఠాపురం సమీపంలో చిన్నగ్రామంలో నడిచే కథ ఇది. అక్కడ బాగా డబ్బున్న వ్యక్తి బంగారయ్య(పృథ్వీ), స్కూల్ టీచర్ విశ్వనాథం(కేదార్ శంకర్), ఆ ఊరి ప్రెసిడెంట్ వీర రాఘవ(రాజేంద్రప్రసాద్) ముగ్గురూ మంచి స్నేహితులు. అలాగే ఈ ముగ్గురి పిల్లలు అయిన గీత(రిహాన), కీర్తన(శ్రీలు), అంజని(ప్రత్యుష) కూడా మంచి స్నేహితులే! బంగారయ్య కూతురికి ఫుల్ ఫ్రీడమ్, డబ్బు ఇచ్చి పెంచుతాడు. స్కూల్ మాస్టర్ అయిన విశ్వనాథం కూతురికి స్వేచ్ఛ అనేది లేకుండా, వందకి 95 మార్కులు వచ్చినా తృప్తిపడకుండా ఉంటాడు. వీర రాఘవ మాత్రం కూతురితో స్నేహంగా ఉంటాడు. నచ్చినట్లు ఉండాలి.. హద్దులు మీరకూడదు అంటూ పెంచుతాడు. వీళ్ళు ముగ్గురు కూతుళ్లు స్కూల్ అయ్యాక పిఠాపురంలో కాలేజీలో ఇంటర్ జాయిన్ అవుతారు. ఆ తర్వాత డిగ్రీకి వెళ్తారు. కొత్త పరిచయాలకు ఎట్రాక్ట్ కావడంతో ముగ్గురు అమ్మాయిలు ముగ్గరిని ప్రేమిస్తారు. గీత ఓ అబ్బాయితో లేచిపోతుంది. కీర్తన ఐఏఎస్ చదవాలనుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తుంది. అది నచ్చని తండ్రి ఇంటికి బయటకు గెంటేయడంతో బయట కొత్త జీవితం ప్రారంభిస్తారు. ఈ రెండు సంఘటనలు చూశాక అంజని తన ప్రేమను తండ్రితో చెప్పాలా వద్దా.. అనే ఆలోచనలో పడుతుంది. అంజని ప్రేమించిన వ్యక్తిని సొంతం చేసుకుందా? చదువుకునే వయసులో తల్లిదండ్రుల మాట వినకపోతే ఏం జరుగుతుంది? వీరి జీవితాలు ఓ కొలిక్కి వచ్చాయా లేదా? అన్నది కథ.
విశ్లేషణ:(Pithapuramlo Ala Modalaindi Review)
పవన్‌కల్యాణ్‌కు, పిఠాపురానికి ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిందే! ఆ టైటిల్‌తో సినిమాను ప్రకటించగానే మంచి హైప్ క్రియేట్ అయింది. అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు.. పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్ గురించి ఏమన్నా చెప్పబోతున్నారా? అంటూ చర్చలు జరిగాయి. అయితే ఇందులో అదంతా ఏమీ ఉండదు. ఓ విలేజ్ సాగే చిన్న ఫ్యామిలీ స్టోరీ ఇది. బ్రహ్మానందం వాయిస్ ఓవర్‌తో రాజేంద్రప్రసాద్, పృథ్వీ, కేదార్ శంకర్ పాత్రలు వారి కుటుంబ నేపథ్యాల గురించి పరిచయం చేశారు. ఫస్టాప్ అంతా హీరోయిన్ల స్కూల్ డేస్, తర్వాత కాలేజ్ ప్రేమ, పెళ్లి ఒక అమ్మాయి లేచిపోయే సీన్స్‌తో నింపేశారు. కాలేజ్ పేరుతో విలేజ్ నుంచి టౌన్‌కి వెళ్లిన ముగ్గురు అమ్మాయిల్లో వచ్చిన మార్పును చూపించారు. ఈ మధ్యలో సాగే లవ్ ట్రాక్, ఇతర సన్నివేశాలన్ని రొటీన్‌గానే సాగుతాయి. కీర్తన పెళ్లి, గీత లేచిపోవడంతో విరామం. ఆ తర్వాత అయినా కాస్త కొత్తగా ఏమన్నా చూపిస్తారేమో అని చూస్తే.. అక్కడ కూడా అదే రొటీన్ డ్రామా. పెళ్లి తర్వాత కీర్తన కష్టాలు, లేచిపోయిన తర్వాత బాయ్‌ఫ్రెండ్ ద్వారా గీతకు ఎదురైన సమస్యలు చూపించారు. అవి కాస్త ఎమోషనల్‌గా బాగానే ఉన్నాయి. క్లైమాక్స్‌లో అంజని పెళ్లితో అందరూ ఒక దగ్గరికి చేరినట్లు చూపించారు. క్లైమాక్స్‌లో పెళ్లి తంతు, తండ్రీ కూతుళ్ల మధ్య భావోద్వేగాలు, రైతుల గురించి చర్చించిన సన్నివేశాలు సినిమాలో కాస్త ఊరట కలిగించే అంశాలు. ఫైనల్‌గా సినిమాకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు..
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇందులో ప్రెసిడెంట్‌గా నటించారు. ఆయన అనుభవం పాత్రకు ఉపయోగపడింది. కానీ కొన్ని సన్నివేశాలో ఓవర్‌గా రియాక్ట్ అయిన భావన కలుగుతుంది. స్ట్రిక్ట్ ఫాదర్ గా కేదార్ శంకర్ మెప్పించారు. డబ్బున్న తండ్రిగా పృథ్వీ అక్కడకడ్కగా నవ్వించే ప్రయత్నం చేశారు. రిహానా అందాలు ఆరబోసింది. నటన కూడా ఓకే. శ్రీలు కాస్త డీ గ్లామరైజ్ పాత్రలో ఫర్వాలేదనిపించింది. ఎక్స్‌ప్రెషన్స్ పెద్దగా పలకలేదు. ప్రత్యూష కూడా పర్వాలేదు అనిపిస్తుంది. జెడివి ప్రసాద్, అన్నపూర్ణమ్మ, మణిచందన మిగిలిన ఆర్టిస్ట్‌లు పరిధిమేరకు నటించారు. ముగ్గురు అబ్బాయిలుగా నటించిన సన్నీ అఖిల్, విరాట్, సాయి పణీత్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఇక సాంకేతిక అంశాల విషయానికొస్తే.. కెమెరా వర్క్ మాత్రం సినిమాకు ఎసెట్. జి.సి. క్రిష్ సంగీతం ఫర్వాలేదనపించింది. నేపథ్య సంగీతం అక్కడక్కడా బావుంది. ఎడిటర్ చాలా సన్నివేశాలకు కత్తెర వేయాల్సి ఉంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. కొన్ని పాత్రలకు డబ్బింగ్ లిప్ సింక్ కాలేదు. మేకప్ వర్క్ చాలా డల్‌గా ఉంది. గతంలో హిట్టు సినిమాలిచ్చిన దర్శకుడు కొన్నేళ్ల గ్యాప్ తర్వాత సినిమా చేస్తే ఎంతో అప్‌డేట్ అయుండాలి. కానీ మహేశ్ చంద్ర అలాంటి ప్రయత్నం చేయలేదని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇదే జానర్‌లో గతంలో చాలా సినిమాలొచ్చాయి. తండ్రీ కూతుళ్ల మధ్య సాగే కథంటే ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. ఆ దిశగా దర్శకుడు ప్రయత్నం చేయలేదు. కొన్ని సన్నివేశాలు మాత్రమే ఎమోషనల్‌గా మెప్పించాయి. ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటో కూడా తెలీదు. పిఠాపురం చదువుకోవడానికి వచ్చిన ఓ తెలంగాణ కుర్రాడితో పవన్‌కల్యాణ్ గెలుపు గురించి రెండు డైలాగులు చెప్పించి టైటిల్‌కి జస్టిఫికేషన్ ఇచ్చారు. ఆ సీన్ అతికినట్లు ఉంది. కానీ తెలిసీతెలియని వయసులో ప్రేమ పేరుతో మోసపోయి కష్టాలు పడే అమ్మాయిల గురించి మంచి పాయింట్ చెప్పారు. తండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు అని చక్కగా చెప్పారు. ఈ రెండు పాయింట్‌లు సినిమాకు ఎసెట్. ఓపికగా థియేటర్‌లో కూర్చుంటే ఈ రెండు ఎపిసోడ్స్ మెప్పిస్తాయి.
ట్యాగ్‌లైన్: రొటీన్ ఫ్యామిలీ డ్రామా
రేటింగ్: 2.25/5