పవన్ కళ్యాణ్.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ
ABN, Publish Date - Mar 19 , 2026 | 01:09 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాకముందు మొదలెట్టిన సినిమాల్లో చివరిదైన ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా విడుదలైంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉప ముఖ్యమంత్రి కాకముందు మొదలెట్టిన సినిమాల్లో చివరిదైన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) ఉగాది కానుకగా విడుదలైంది. దీనికి ముందు వచ్చిన 'హరిహర వీరమల్లు, ఓజీ' చిత్రాలు రెండు భిన్నమైన జానర్స్ కు చెందినవి కాగా తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఈ రెండు సినిమాల ఛాయలూ కనిపిస్తున్నాయి. 'హరి హర వీరమల్లు'లోని హిందుత్వాన్ని, 'ఓజీ'లో యాక్షన్ ను మిక్స్ చేసి దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) 'ఉస్తాద్ భగత్ సింగ్'ను రూపొందించిన భావన కలుగుతోంది. శ్రీలీల (Sreeleela), రాశీ ఖన్నా (Raashii Khanna) హీరోయిన్లుగా రూపుదిద్దుకున్న 'ఉస్తాద్..' ఎలా ఉందో చూద్దాం.
దాదాపు 14 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో 'గబ్బర్ సింగ్' వచ్చింది. మళ్ళీ ఇంతకాలానికి వీరిద్దరి కాంబో సెట్ అయ్యింది. అందులో పొగరుబోతు పోలీస్‌గా నటించిన పవన్ ఇందులోనూ అలాంటి పాత్రే చేశాడు. అయితే ఇది ఓ తండా నుండి నగరానికి వచ్చిన పోలీస్ కథ. పిల్లలు పనికి కాదు బడికి వెళ్ళాలని కోరుకుంటాడు ఉత్తమ ఉపాధ్యాయుడైన చంద్రశేఖరరావు (కె.ఎస్. రవికుమార్). అన్యాయాన్ని సహించని గూడెం పిల్లాడు ఉస్తాద్ భగత్ సింగ్‌ను ఆయనే చేరదీసి, సరైన మార్గంలో పెడతాడు. చదువు చెప్పిస్తాడు.
అప్పటి సీ.ఎం. కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చిన చంద్రశేఖరరావు ఆ తర్వాత సీఎం అవుతాడు. ఆయన శిష్యుడైన భగత్ సింగ్ ఎ.సి.పి. అవుతాడు. అయితే సీఎం కుర్చీపై కన్నేసిన చదలమర్రి నల్ల నాగప్ప (పార్తీబన్) ఎలాగైనా ఆ పదవిని చేపట్టాలని చూస్తాడు. ముఖ్యమంత్రి మీద హత్యాయత్నానికి ఒడిగడతాడు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని ఏకంగా చంపేస్తాడు. చివరకు తాను సీఎం అవుతాడు. అయితే ఈ క్రమంలో అతను దేశ వ్యతిరేక శక్తులతో, టెర్రరిస్టులతోనూ చేతులు కలుపుతాడు. పదవి పిచ్చి పట్టిన నల్ల నాగప్ప మదాన్ని ఉస్తాద్ ఎలా అణిచాడు? తన గురువు చంద్రశేఖర్‌ను తిరిగి సీఎం పీఠం మీద ఎలా కూర్చో పెట్టాడు అనేది సినిమా కథ.
నిజం చెప్పాలంటే రెండున్నర గంటల పాటు పవన్ కళ్యాణ్‌ను తెర మీద చూపించిన శ్రద్థ వేరే దేనిమీద దర్శకుడు హరీశ్ శంకర్ చూపించలేదు. ముందు అనుకున్న కథ వేరని, ఆ తర్వాత కథ మారిందని చెప్పాడు హరీశ్ శంకర్. నిజానికి రెండోసారి చిత్ర బృందం అసలు కథే రాసుకున్నట్టు కనిపించలేదు. సమయానుకూలంగా సన్నివేశాలను రాసుకుని, సమయం దొరికినప్పుడు చిత్రీకరణ జరిపి సినిమా ముగించినట్లుంది. దాంతో ప్రథమార్థంలో ఓ హీరోయిన్, ద్వితీయార్థంలో మరో హీరోయిన్ తెర మీద కొచ్చారు. సినిమాటోగ్రాఫర్స్ కూడా ఇద్దరు పనిచేశారు. అలానే సంగీత దర్శకులూనూ! ఈ సినిమాలో స్వరాలను దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చగా, తమన్ నేపథ్య సంగీతం అందించాడు.
తనను తీర్చిదిద్దిన సీఎంను రక్షించడం కోసం ఓ పోలీస్ అధికారి ఏం చేశాడు? ఎలాంటి మూల్యం చెల్లించాడనేదే ఇందులో కోర్ పాయింట్. ఇంత బలహీనమైన, అతి సాధారణమైన కథకు ఉగ్రవాదం, జాతీయవాదాన్ని జత చేసి హరీశ్ శంకర్ ఇటు హిందుత్వ వాదులను, అటు పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అది ఉడికీ ఉడకని కిచిడీగా మారింది. ప్రతి సన్నివేశాన్ని కలర్ ఫుల్ గా, జోష్ తో నింపే ప్రయత్నం దర్శకుడు చేశాడు. కానీ అది ప్రేక్షకుల హృదయాన్ని తాకలేకపోయింది. సినిమా అలా సాగుతూ... పోతుందంతే! అయితే సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ హరీశ్ శంకర్ తనదైన పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు.
అలానే పాత పాటలతో అక్కడక్కడా మెరుపులు మెరిపించాడు. ప్రథమార్థంలో వచ్చే రాశీఖన్నా పాట, ద్వితీయార్థంలో వచ్చే 'దేఖ్ లేంగే సాలా' సాంగ్స్ బాగానే ఉన్నాయి. కానీ అనుకున్న స్థాయిలో కిక్ ఇవ్వలేకపోయాయి. వాటికంటే... 'తొలిప్రేమ'లోని 'నా మనస్సే...' పాట వినడానికి, చూడటానికి హాయిగా ఉంది. అలానే సీతారామశాస్త్రి 'రుద్రవీణ'కోసం రాసిన పాట పల్లవినీ సందర్భానుసారంగా వాడేశారు. ప్రథమార్ధంలో స్టార్ హీరోలు ఇద్దరు ముగ్గురి డాన్సింగ్ స్టైల్ ను పవన్ కళ్యాణ్ అనుకరించడం సరదా ఉంది. బలమైన కథలేని కారణంగా... ఏదో సినిమాను అలా అలా నడిపేశాడు హరీశ్ శంకర్.
పవన్ కళ్యాణ్ తెర మీద బాగానే ఉన్నాడు. 'హరిహర వీరమల్లు' లో మాదిరి డల్ గా లేడు. అలానే 'ఓజీ'లో కనిపించినంత క్రేజీగానూ లేడు. డైలాగ్స్ డెలివరీలో మాత్రం తనదైన రిథమ్ చూపించాడు. రాశీ ఖన్నా, శ్రీలీల తెర మీద ఉన్నారంటే ఉన్నారంతే! ద్వితీయార్థంలో వచ్చినా శ్రీలీల కాస్త బెటర్. అయితే ఆమె హైపర్ యాక్టివ్ నెస్ ను తగ్గించి ఉండాల్సింది. 'ఓజీ'లోని హీరోయిన్ పాత్ర, ఇందులో హీరోయిన్ పాత్ర ముగింపు ఒకేలా ఉన్నాయి. తమిళ నట దర్శకులు పార్తీబన్, కె.ఎస్. రవికుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించడం విశేషం. ఒకరిది పాజిటివ్ క్యారెక్టర్ అయితే, మరొకరిది నెగెటివ్ క్యారెక్టర్. ఈ సినిమా తర్వాత పార్తీబన్ కు తెలుగులో అవకాశాలు క్యూ కడతాయి. గౌతమి, రావు రమేశ్, మురళీమోహన్, ఎల్.బి. శ్రీరామ్, ప్రసాద్ బాబు, ఆనంద్, గుండు సుదర్శన్, సత్యం రాజేశ్, ప్రవీణ్, కమల్ కామరాజ్, టెంపర్ శివ, వంశీ చాగంటి ఇతర పాత్రల్లో కనిపిస్తారు.
తమన్ నేపథ్య సంగీతం రోజు రోజుకు లౌడ్ గా తయారవుతోంది. సున్నితమైన సన్నివేశాల్లోనూ అతిగా దరువేసేస్తున్నాడు. ఆ శబ్ద కాలుష్యాన్ని భరించడం ఆడియన్స్ కు కష్టమే. ఈ సినిమాకున్న మైనస్ పాయింట్స్ థమన్ నేపథ్య సంగీతం బాదుడు కూడా ఒకటి అవుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో పద్నాలుగేళ్ళ తర్వాత వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్'.... 'గబ్బర్ సింగ్' మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయిందనే చెప్పాలి. అయితే హరీశ్ డైలాగ్స్ తో పాటు హీరో సర్దుబాటు చేసిన అతి తక్కువ కాల్షీట్స్ లో సినిమా అంతటా తనని ప్రజెంట్ చేసిన విధానానికి హేట్సాప్ చెప్పాలి. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించింది. ఏది ఏమైనా అటు అభిమానుల్లో కొందరిని, ఆడియన్స్ ను ‘ఉస్తాద్’ సంతృప్తి పరచలేక పోయాడన్నది వాస్తవం.
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: ఫ్యాన్స్ కోసమే!