Ohh My Dog Review: మనిషి తప్పిపోయిన చోట.. విశ్వాసం వెదుకులాట!
ABN, Publish Date - Nov 01 , 2026 | 06:38 AM
ఇది రెండు అదృశ్యాల కథ, రెండు అన్వేషణల కథ. ఒక కథలో మనిషి జంతువును వెతుకుతుంటాడు. మరో కథలో జంతువు మనిషిని వెతుకుతుంటుంది. రెండు అన్వేషణల వెనుక ఉన్నది ఒకటే భావోద్వేగం.
ఓ మై డాగ్ (హిందీ)
నటీనటులు: పంకజ్ త్రిపాఠీ,పవన్ మల్హోత్రా, మాహీ రాయ్
దర్శకుడు: అమిత్ రాయ్
నిడివి: 2గంటల 21 నిముషాలు
మనిషి విశ్వాసానికి నిర్వచనాలు రాస్తాడు. కుక్కకు నిర్వచనాలు తెలియవు కానీ విశ్వాసం ప్రకటిస్తుంది. మనిషి ప్రేమిస్తున్నానని చెబుతాడు. కుక్క మనిషికంటే ఎక్కువ ప్రేమించి చూపుతుంది కానీ చెప్పలేదు. మనిషి తన అవసరాల కోసం సంబంధాలను అల్లుకుంటాడు. కుక్క సంబంధాన్నే తన అవసరంగా మార్చుకుంటుంది. ఈ చిన్న తాత్విక వైరుధ్యాన్ని భావోద్వేగభరితంగా చెప్పిన సినిమా ఓ మై డాగ్ (Ohh My Dog Review).
ఇది రెండు అదృశ్యాల కథ, రెండు అన్వేషణల కథ. ఒక కథలో మనిషి జంతువును వెతుకుతుంటాడు. మరో కథలో జంతువు మనిషిని వెతుకుతుంటుంది. రెండు అన్వేషణల వెనుక ఉన్నది ఒకటే భావోద్వేగం. ఈ రెండు సమాంతర కథల ద్వారా దర్శకుడు కుక్కల అక్రమ రవాణా, బాలకార్మిక వ్యవస్థ, అవయవాల అక్రమ వ్యాపారం, అవినీతి వంటి సమస్యలను కథలోకి తేవడంతో... భావోద్వేగాలతో కూడిన థ్రిల్లర్గా మారింది.
అపూ అనే పిల్లవాడికి మోమో అనే కుక్కపిల్ల అంటే ప్రాణం. మోమో అతనికి పెంపుడు జంతువు మాత్రమే కాదు. తన బాల్యంలోని ఆటపాటలకూ, ఒంటరితనానికీ, సంతోషానికీ సహచరి. ఒకరోజు మోమో కనిపించకుండా పోతుంది. దాన్ని వెతకడానికి అపూ బయలుదేరతాడు.
మరోవైపు భోపాల్లో ప్రిన్స్ అనే బాలకార్మికుడికి ఆస్కార్ అనే వీధికుక్కతో గాఢమైన అనుబంధం ఉంటుంది. ప్రిన్స్ హఠాత్తుగా అదృశ్యమవుతాడు. అతన్ని వెతుక్కుంటూ ఆస్కార్ ప్రయాణం ప్రారంభిస్తుంది. ఆ పిల్లవాడు కుక్కల స్మగ్లింగ్ గ్యాంగ్ నుంచి మోమోను కాపాడుకుంటాడు. అవయవ మాఫియా నుంచి ఆస్కార్ తన యజమానిని రక్షించుకుంటుంది. ఈ క్రమంలో జరిగే నాటకీయ పరిణామాలన్నీ సరదాగానూ ఉత్కంఠగానూ ఉంటాయి.
ఈ రెండు కథల్లో ఆకర్షణీయమైన అంశం మనిషికీ జంతువుకీ మధ్య ఉండే సంబంధాన్ని భావోద్వేగాల పరిధిలో చూపడం. మనుషుల మధ్య సంబంధాలు షరతులు వర్తిస్తాయి అని అనుక్షణం చెపుతుంటాయి. ఆర్థిక అవసరాలు, సామాజిక హోదా, వ్యక్తిగత ప్రయోజనాలు, అహంకారాలు వాటిని నిరంతరం ప్రభావితం చేస్తుంటాయి. కానీ జంతువుతో మనిషి ఏర్పరచుకునే అనుబంధంలో ఈ లెక్కలేవీ ఉండవు.
ఆస్కార్ మనిషిని వెతికె ప్రయాణాన్ని ఈ కోణంలో చూస్తే, అది కేవలం తప్పిపోయిన యజమాని కోసం కుక్క చేసే సాహసం కాదు. తన ప్రపంచం నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైన ఒక ఉనికిని తిరిగి సంపాదించుకునే ప్రయత్నం. మనిషి తప్పిపోయినప్పుడు అతని కోసం వెతికేవాళ్లు ఉండొచ్చు. కానీ తనను వెతికే ఒక మూగజీవి కూడా ఉందని తెలుసుకోవడం మనిషి జీవితానికి మరో అర్థాన్ని ఇస్తుంది. ఈ భావనే చిత్రానికి ప్రధానమైన మానవీయ బలం. రెండు కథలూ సమాంతరంగా నడిచినా.. చివరకు కూడా రెండు కథల మధ్య ఒక లింక్ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నించకపోవడం బాగుంది. రెండు కథలూ వేర్వేరుగా జరిగి వేర్వేరుగానే ముగుస్తాయి.
అయినా రెండింటిలో ఉన్న అనుభూతి ఒకటే. కుక్కల స్మగ్లింగ్, మానవ అవయవాల మాఫియా.. కథ లోపలి బలమైన వస్తువైనప్పటికీ.. మనిషికీ జంతువుకూ ఉండే అనుబంధమే సినిమా నిండా కనపడుతుంది. సాధారణంగా జంతువుల నేపథ్యంలో వచ్చే సినిమాల్లో మనిషి ప్రధాన పాత్రగా ఉంటాడు. కానీ ఇక్కడ జంతువే ఒక స్వతంత్ర కథానాయకుడిగా ఎదుగుతుంది. దానికి ఒక లక్ష్యం ఉంది. ప్రయాణం ఉంది. ఎదురయ్యే ప్రమాదాలున్నాయి. వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలున్నాయి.
పిల్లలకు సహకరించే టీచర్ పంకజ్ త్రిపాఠీ (Pankaj Tripathi) తన సహజ నటనతో మానవీయ స్పర్శను అందిస్తాడు. పవన్ మల్హోత్రా (Pawan Malhotra) బాధితులకు సహకరించే అధికారిగా ఓకే. బాలనటుడు మాహిరాయ్ (Maahi Rai) పాత్రలోని అమాయకత్వం కథకు ఉపయోగపడుతుంది. అయితే ఈ చిత్రంలో ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేది ఆస్కార్ పాత్ర పోషించిన కుక్కే. దర్శకుడు దాన్ని ఒక పెంపుడు జంతువుగా కాకుండా కథను ముందుకు నడిపించే ప్రధాన శక్తిగా మలిచాడు.
ఈ సినిమాలో అంతర్లీన అంశం అధికారానికీ నిస్సహాయతకీ మధ్య సంఘర్షణ. బాలకార్మికుడు, పేదవాడు, వీధికుక్క వీళ్లందరికీ ఒక సామాన్య లక్షణం ఉంది. సమాజంలో వీళ్లకు తమను తాము రక్షించుకునే శక్తి దాదాపుగా ఉండదు. వాళ్లకు తమ మీద జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి అవసరమైన సామాజిక, ఆర్థిక వనరులు కూడా ఉండవు. అయితే దర్శకుడు ఈ నిస్సహాయతను కేవలం జాలి కలిగించే వస్తువుగా మాత్రమే చూడకుండా, ప్రతిఘటనకు కారణమయ్యే అనుభవంగా చూపించడానికి ప్రయత్నించాడు.
మనిషి తనను తాను సృష్టిలో అత్యున్నత జీవిగా ప్రకటించుకున్నాడు. కానీ ప్రేమించడం, విశ్వసించడం, తోడుగా నిలవడం వంటి అత్యంత ప్రాథమిక జీవన విలువల్లో చాలాసార్లు ఒక మూగజీవి మనిషికన్నా గొప్పదిగా కనిపిస్తుంది. ఇందులో కుక్క మనిషిని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. కానీ అంతకంటే ముఖ్యంగా, మనిషిలో క్రమంగా కనుమరుగవుతున్న ఒక విలువను రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా. అనిపిస్తుంది. అది విశ్వాసం. మనిషి తప్పిపోయిన చోట విశ్వాసం వెతుక్కుంటూ వెళ్లడం ఒక బరువైన భావన! ప్రస్తుతం ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. - ప్రసేన్ 70133 58154