Anaganaga Oka Raju Review: అనగనగా ఒక రాజు రివ్యూ
ABN, Publish Date - Jan 14 , 2026 | 01:16 PM
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సినిమా 'అనగనగా ఒక రాజు'. మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ విడుదలై రెండేళ్ళు దాటిపోయింది. ఆ తర్వాత మొదలైన 'అనగనగా ఒక రాజు మూవీ యాక్సిడెంట్ తో పాటు అదర్ రీజన్స్ తో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు సంక్రాంతి బరిలోకి 'అనగనగా ఒక రాజు' దిగింది. మరి ఈ పందెం కోడి ఎలాంటి పోరు చేసిందో తెలుసుకుందాం.
కొందరికి భలే సుడి ఉంటుంది. అందులో నవీన్ పోలిశెట్టి కూడా ఒకడు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'కు ముందు చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన నవీన్ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'జాతిరత్నాలు'తో గ్రాండ్ విక్టరీని దక్కించుకున్నాడు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఆ స్థాయి విజయాన్ని అందుకోకపోయినా... ఫర్వాలేదనిపించుకుంది. కానీ ఆ తర్వాత సినిమా రిలీజ్ కావడానికి ఏకంగా రెండేళ్ళు పట్టింది. ఈ మధ్యలో దర్శకుడే కాదు హీరోయిన్ కూడా మారిపోయింది. అయితే... ఈ ఆలస్యాన్ని పట్టించుకోని అభిమానులు నవీన్ పోలిశెట్టి మళ్ళీ 'అనగనగా ఒక రాజు'తో మెస్మరైజ్ చేస్తాడని, మంచి విజయాన్ని అందుకుంటాడని నమ్మారు.
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే... గౌరవపురం జమీందారు గోపరాజు మనవడు రాజు (నవీన్ పోలిశెట్టి). 'మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి' అనే పరిస్థితి అతనిది. లేనిపోని ఆడంబరాలు, అలవాట్ల కారణంగా తాతయ్య ఆస్తులన్నీ అమ్మేయడంతో రాజు పగటి కలలు కంటూ బతికేస్తుంటాడు. ఓ పెళ్ళిలో జరిగిన అవమానంతో... 'అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు గుర్తుంచుకునేలా తన పెళ్ళి జరుగుతుంద'ని బంధువుల ముందు ఛాలెంజ్ చేస్తాడు. అందుకోసం పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసి పక్క ఊరిలో బాగా డబ్బున్న భూపతి రాజు (రావు రమేశ్ Rao Ramesh) కూతురు చారులత (మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary) ను లైన్ లో పెడతాడు. అతను అనుకున్నట్టుగానే చారులతతో పెళ్ళి కూడా జరిగిపోతుంది. ఆ తర్వాత రాజు కు అసలు కష్టాలు మొదలవుతాయి. అతని భార్య, మావగారు ఇచ్చిన షాక్ ఏమిటీ? దాని నుండి అతను ఎలా తేరుకున్నాడు? తన కుటుంబం కోసం, ఊరి కోసం ఏం చేశాడన్నదే మిగతా కథ.
నవీన్ పోలిశెట్టి అనగానే వినోదాల విందుకు లోటు ఉండదని అంతా భావిస్తారు. అదే విధంగా ఈ సినిమాలో ప్రతి సీన్ లో పంచ్ డైలాగ్స్ ను పెట్టేశాడు దర్శకుడు మారి. అతనికి ఇది మొదటి సినిమానే అయినా... అలాంటి ఫీలింగ్ ఎక్కడా మనకు రాదు. సందర్భానుసారంగా సంభాషణలను ఫన్ తో నింపేశారు. దాంతో థియేటర్ లోని ప్రేక్షకులు తెగ నవ్వుకుంటారు. కానీ వచ్చిన చిక్కేమిటంటే... ఈ కథలో ఇసుమంత కూడా కొత్తదనం లేదు. ఆస్తిపరుడని భావించిన మావగారు నిండా అప్పుల్లో మునిగిపోవడం ఒక ట్విస్ట్ అయితే... జమీందారు మనవడిని చేసుకుంటున్నామని భూపతిరాజు భావిస్తే... అతను బికారి వాడు కావడం మరో ట్విస్ట్. చివరకు ఇద్దరి పరిస్థితీ జోగీ జోగీ రాసుకుంటూ బూడిద రాలినట్టు అవుతుంది. నిజానికి ఇది ఇంట్రస్టింగ్ పాయింటే! అయితే ఈ కష్టాల నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారనే విషయంలో దర్శకుడు పూర్తిగా తప్పటడుగులు వేసేశాడు. కథ అటూ ఇటూ తిరిగి చివరకు పొలిటికల్ డ్రామా వైపు మళ్ళింది. క్లయిమాక్స్ లో చిన్న ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులలో కాస్తంత ఉత్సుకత రేకెత్తించాడు కానీ లేకపోతే సినిమా ఫలితం మరింత దారుణంగా ఉండేది.
నవీన్ పోలిశెట్టి తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశాడు. పంచ్ డైలాగ్స్ రాసుకుని థియేటర్ లో నవ్వుల పువ్వులు పూయించే ప్రయత్నం చేశాడు. కానీ బలహీనమైన కథ, కథనం కారణంగా సన్నివేశాలు తేలిపోయాయి. మీనాక్షి చౌదరి తన పాత్రను బాగానే చేసింది. ఫస్ట్ హాఫ్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఓకే కానీ సెకండ్ హాఫ్ లో అస్సలు కెమిస్ట్రీనే లేదు. చాలా చాలా సాదా సీదాగా వాళ్ళ మధ్య సీన్స్ సాగాయి. అలానే విలన్ కాని విలన్ పాత్రలో తారక్ పొన్నప్ప (Tharak Ponnappa) నటించాడు. ఇతర పాత్రలను రావు రమేశ్, ఝాన్సీ, ఛమ్మక్ చంద్ర, మహేశ్ ఆచంట, భద్రం, గోపరాజు రమణ, మధుసూదన్ రావు, అనంత్, రమణ భార్గవ, సత్యశ్రీ , రోహిణి, ప్రియ, తదితరులు పోషించారు. 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్ మాస్టర్ రేవంత్ మొన్న వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు'లోనే కాదు ఇందులోనూ ఎంటర్ టైన్ మెంట్ ను అందించాడు. అలానే 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా అతిథి పాత్రలో మెరిసింది. శాన్వీ మేఘన (Saanve Megghana) ఐటమ్ సాంగ్ లో నర్తించింది.
మిక్కీ జే మేయర్ (Mickey J. Meyer) అందించిన రెండు మూడు ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీని కాస్తంత నిలబెట్టాయి. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించాడు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య రాజీ పడకుండానే దీన్ని తీసినా... ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను 'అనగనగా ఒక రాజు' అందుకోలేకపోయాడు.
రేటింగ్ : 2.5/ 5
ట్యాగ్ లైన్: అనగనగా ఒక రొటీన్ రాజు