సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Honey Review: నవీన్ చంద్ర థ్రిల్లర్ సినిమా 'హనీ' ఎలా ఉందంటే

ABN, Publish Date - Feb 06 , 2026 | 05:19 PM

దర్శకుడు కరుణ కుమార్‌ తెరకెక్కించిన సైకలాజికల్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘హనీ’. నవీన్‌ చంద్ర, దివ్యా పిళ్ళై, రాజా రవీంద్ర, దివి, బేబీ జయత్రి కీలక పాత్రధారులు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఏ మేరకు థ్రిల్‌ పంచిందో చూద్దాం.  

హనీ మూవీ రివ్యూ

‘పలాస 1978’ వంటి రా అండ్‌ రస్టిక్‌ చిత్రంతోపాటు 'శ్రీదేవి సోడా సెంటర్', ‘మట్కా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు కరుణ కుమార్‌(karuna Kumar). తాజాగా ఆయన తెరకెక్కించిన సైకలాజికల్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘హనీ’ (Honey) శుక్రవారం విడుదలైంది. నవీన్‌ చంద్ర, దివ్యా పిళ్ళై, రాజా రవీంద్ర, దివి, బేబీ జయత్రి కీలక పాత్రధారులు. మరి 'హనీ' సినిమా ఏ మేరకు థ్రిల్‌ పంచిందో చూద్దాం.

కథ: (Honey movie Review)
ఆనంద్‌ (నవీన్‌ చంద్ర) ఓ మధ్య తరగతి వ్యక్తి. ఏ పని చేయకుండా ఈజీ మనీ కోసం ఆరాటపడుతుంటాడు. అతనికి భార్య లలిత (దివ్యా పిళ్ళై), కూతురు మీరా (జయత్రి) ఉంటారు. భార్య స్కూల్‌లో టీచర్‌గా పని చేసి ఇంటిని పోషిస్తుంటుంది. ఆర్థిక ఇబ్బందులతో ఆనంద్‌ మూఢ నమ్మకాలకు, తంత్ర పూజలకు ఆకర్షితుడవుతాడు. అత్యాశ, అజ్ఞానం అతన్ని క్షుద్రపూజలు చేసేలా ప్రేరేపిస్తాయి. ఈ క్రమంలో తన భార్య, బిడ్డలను కూడా పణంగా పెడతాడు. తంత్ర ప్రయోగాలు అతన్ని ఏ తీరానికి చేర్చాయి? అతని మూఢ నమ్మకాల వల్ల భార్య, బిడ్డ ఎలాంటి నరకాన్ని అనుభవించారు? చివరకు ఈ కుటుంబం ఆ చీకటి కోణం నుంచి బయటపడిందా? క్షుద్రపూజలను నమ్ముకున్న ఆనంద్‌ పరిస్ధితి ఏంటి అన్నదే ఈ చిత్ర కథ.


విశ్లేషణ:
వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ ఇది. కొండ గుహలో ఓ తెగ క్షుద్ర దేవతను పూజించే సీన్‌తో కథ మొదలవుతుంది. తన ఆఫీస్‌లో అలాంటి పూజలే చేశాడన్న కారణంతో ఆనంద్‌ను తోటి ఉద్యోగులు తగిన బుద్ధి చెప్పి బయటకు గెంటేస్తారు. అక్కడి నుంచి మూఢ నమ్మకాలతో అతను భార్య, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ప్రేక్షకుడి మనసును కదిలిస్తుంది. భార్య, బిడ్డకు లేని ఆశలు కలిగించి సారంగపాణి ఇంట్లోకి దించడంతో అసలు కథ మొదలవుతుంది. అయితే పాత్రల పరిచయం, అసలు కథలోకి వెళ్లడానికి తీసుకున్న సమయం కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. దాదాపు ఇంటర్వెల్‌ వరకూ పదేళ్ల పాప, పిల్లి, దాని కాన్పు, మాయ సేకరణ ఇదే తెరపై కనిపిస్తుంది. దీని అంతటికి డబ్బు సంపాదనే కారణమని తెలిసినా.. ఎక్కడా కూడా దీని వల్ల ఏం సాధించారనేది చెప్పలేదు. దెయ్యాలు, భూతాలు అని రొటీన్‌ ఫార్మెట్‌ కాకుండా తంత్ర పూజలు ఎంత భయానకంగా ఉంటాయో చూపించి భయపెట్టారు. పిల్లి మాయ కాన్సెప్ట్‌, దాంతో ఏం చేయొచ్చు అనేది కొత్తగానే ఉన్నా దానిని థ్రిల్‌ కలిగించేలా దర్శకుడు తెరపై చూపించలేకపోయాడు. ఒకానొక దశలో చూపించిన సన్నివేశాలే చూపించి, బోర్‌ ఫీల్‌ అయ్యేలా చేశాడు. ఇలాంటి సినిమాల్లో ఉత్కంఠభరితమైన మలుపులు, మెరుపులు కోరుకుంటారు ప్రేక్షకులు. అయితే అవేవీ ఇందులో లేవు.  క్లైమాక్స్‌ లో ఏం జరుగుతుందో ప్రేక్షకుడి ఊహకు తెలిసిపోతుంది. సినిమా ముగింపు సైతం పేలవంగా ఉంది.
 
నటీనటుల పనితీరు...
నవీన్‌ చంద్ర ఈ మధ్యన చేసిన పాత్రలన్నీ మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ చిత్రంలో ఆనంద్‌ పాత్ర కూడా అంతే. ఈజీగా డబ్బు సంపాదించాలని, అందుకు సులభమైన మార్గం క్షుద్ర పూజలని నమ్మే వ్యక్తిగా ఆనంద్‌ పాత్రలో చక్కగా ఇమిడిపోయారు. నిరుద్యోగిగా మొదలై, పిచ్చి నమ్మకాలతో వింతగా ప్రవర్తించే సైకోగా మారుతూ చూపిన వేరియేషన్స్‌ బాగున్నాయి. లలిత పాత్రకు దివ్య పిళ్లై పూర్తి న్యాయం చేసింది. క్లైమాక్స్‌లో ఆమె నటన కట్టిపడేస్తుంది. సినిమాలో కీలకమైన పాత్ర బేబీ జయత్రి ది. రాజా రవీంద్ర, దివి కూడా ఫర్వాలేదనిపించారు. కళ్యాణీ మాలిక్‌ అతిథి పాత్రలో మెరిశారు. ఇతర పాత్రధారులు పరిధి మేరకు నటించారు. కథానుగుణంగా నగేష్‌ బన్నెల్‌ చక్కని సినిమాటోగ్రఫీ అందించారు. నైట్‌ సీన్స్‌ను మరింత ఎఫెక్టివ్‌గా చూపించారు. హారర్‌ సినిమాకు కావలసిన అవుట్‌పుట్‌ ఇచ్చారు. సంగీత దర్శకుడు అజయ్‌ అరసాడ నేపథ్య సంగీతానికి మంచి క్రేజ్‌ ఉంది. ఆయన చిత్రానికి చక్కని పాటలతో పాటు చక్కని నేపథ్య సంగీతం అందించారు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ ఓకే. ప్రథమార్ధాన్ని కాస్త కుదించి ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి. దర్శకుడు కరుణ కుమార్‌ తన ప్రతి చిత్రం ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటాడు. ఈసారి కూడా గతంలో చేసిన జానర్‌ కాకుండా కాస్త కొత్తగా హారర్‌ రూట్‌కి మారి ఈ సినిమా తీశాడు. ప్రపంచం అంతా సైన్స్‌ వైపు పరుగులు తీస్తుంటే.. కొందరు మాత్రం మూఢ నమ్మకాలతో.. క్షుద్రపూజలు అంటూ ఎక్కడో ఆగిపోయారనే విషయాన్ని, మనిషిలో ఉన్న మూఢ నమ్మకం, అత్యాశ అతన్ని ఎంత వరకూ తీసుకు వెళ్తుంది అన్నది ఈ చిత్రంలో చూపించారు. ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్‌ ఆసక్తికరంగా ఉన్నా.. ఎగ్జిక్యూట్‌ చేయడంలో ఎక్కడో మిస్‌ ఫైర్‌ అయిన భావన కలుగుతుంది. ఓవరాల్‌గా ఈ సినిమా అక్కడక్కడా థ్రిల్ కు గురిచేస్తుంది.


రేటింగ్‌: 2.75/ 5


ట్యాగ్‌లైన్‌:
అక్కడక్కడా థ్రిల్‌!

Updated Date - Feb 07 , 2026 | 10:41 AM