‘నా వైఫ్ మిస్సింగ్’.. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ మూవీ ఎలా ఉందంటే?

ABN , Publish Date - Oct 23 , 2026 | 02:27 AM

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన ‘నా వైఫ్ మిస్సింగ్’ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. స్వాతి ప్రకాశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్సింగ్ మిస్టరీ ఎలా ఉంది? కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్, ప్లస్ అండ్ మైనస్‌లతో మూవీ రివ్యూ.

Naa Wife Missing Movie

ఈ మధ్య కాలంలో వరుణ్‌ సందేశ్‌ ఓటీటీ కంటెంట్‌ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. అతనితో 'నయనం' వెబ్ సీరిస్ ను తెరకెక్కించిన దర్శకురాలు స్వాతి ప్రకాశ్‌ మంత్రిప్రగడ ఇప్పుడు 'నా వైఫ్ మిస్సింగ్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. వరుణ్ సందేశ్‌ సరసన 'కొత్త బంగారు లోకం' ఫేమ్‌ శ్వేత ప్రసాద్‌ నటించింది. శివ కంఠమనేని, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మించిన 'నా వైఫ్‌ మిస్సింగ్‌' మూవీ శుక్రవారం నుంచి ఆహాలో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అవుతోంది. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.

అమలాపురం లోని గ్రామీణ బ్యాంక్‌ లో పనిచేసే బాలు (వరుణ్‌ సందేశ్‌) స్వప్న (శ్వేత బసు ప్రసాద్‌)తో పెళ్ళి చూపులకు వెళతాడు. ఆమెతో పెళ్ళికి బాలు సుముఖత వ్యక్తం చేసిన మరు క్షణం... అతన్ని పక్కకు తీసుకెళ్ళి 'తాను వర్జిన్‌ కాద'ని స్వప్న చెబుతుంది. అయినా ఆమె పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్న బాలు... స్వప్నను పెళ్ళి చేసుకుంటాడు. మొదటిరాత్రి తాను అబాన్ (మోహిత్‌ పెద్దాడ) అనే కుర్రాడిని ప్రేమించానని, అతన్నే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని చెబుతుంది. భార్య మాటను గౌరవించి, ఆమెకు దూరంగా ఉంటాడు బాలు. ఈ క్రమంలో కొద్ది రోజులకే గుడికి వెళ్దామని బాలుతో కలిసి వెళ్ళిన స్వప్న మిస్ అవుతుంది. ఆమె అబాన్ దగ్గరకు వెళ్ళిందని బాలు భావిస్తాడు. కానీ అబాన్ తన దగ్గరకు ఆమె రాలేదని చెబుతాడు. స్వప్న ఇన్ని తప్పులు చేసినా... బాలు ఆమె పట్ల ఎందుకంత కన్సర్న్ గా ఉన్నాడు? పెళ్ళిచూపుల్లో తాను వర్జిన్‌ కాదని స్వప్న ఎందుకు అబద్దం చెప్పింది? పెద్దమనసుతో బాలు... స్వప్నను అబాన్ తో వెళ్ళిపోమని చెప్పినా... ఆమె ఎందుకు మనసు మార్చుకుంది? అసలు స్వప్న ఏమైపోయింది? పోలీస్‌ స్టేషన్‌లో తన భార్య మిస్ అయ్యిందని కంప్లైంట్‌ ఇచ్చిన బాలుకు ఎలాంటి అనుభవం ఎదురైంది? ఈ మొత్తం వ్యవహారంలో ఎస్.ఐ. రవి (ప్రవీణ్‌) ప్రమేయం ఏమిటీ? ఈ కేసును సాల్వ్ చేసే క్రమంలో బాలుకు కానిస్టేబుల్ కుమారి (జబర్దస్త్‌ సత్యశ్రీ) ఎలాంటి సాయం చేసింది? అనేది మిగతా కథ.


జీవితం పట్ల సరైన అవగాహన లేని సమయంలో యువతి యువకులు ప్రేమించుకోవడం సహజం. ఒక్కోసారి వీరు హద్దులు మీరుతున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కథను నడిపి, చేసిన తప్పును సరిచేసుకునే యువతిగా స్వప్న పాత్రను మలిచారు కథా రచయత్రి అనురాధ ఉమర్జీ. అంతేకాకుండా సమాజంలో మూఢ నమ్మకాలతో చదువుకున్న వ్యక్తులు సైతం ఎలా స్వార్థపరులుగా మారిపోతారో చెప్పే ప్రయత్నం చేశారు. దానిని అర్థవంతంగా తెరకెక్కించారు దర్శకురాలి స్వాతి ప్రకాశ్‌. స్వప్న మిస్‌ అయిన విషయాన్ని రెండు మూడు వర్షన్స్ గా చూపించడంతో తొలుత వ్యూవర్స్ ఏది నిజం? ఏది అబద్దం అనే విషయంలో కన్ ఫ్యూజన్‌ కు గురౌతారు. అయితే ద్వితీయార్థంలో విడమర్చి చూపించి అలరించేలా చేశారు. కథ ఊహించని మలుపులు తిరగడం కుతూహలాన్ని కలిగించేదే అయినా... స్లో నెరేషన్ తో అక్కడక్కడ బోర్‌ కొడుతుంది. పైగా పాటలతో ప్రమేయం లేకుండా కూడా కథను నడపొచ్చు. కానీ మాటేంజ్‌ సాంగ్స్ వల్ల కథనంలో వేగం తగ్గిపోయింది.


ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ వరుణ్‌ సందేశ్‌, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించడం. 'కొత్త బంగారు లోకం'లోని వారి పేర్లనే ఈ సినిమాలోనూ పెట్టేశారు. అక్కడ ప్రేమికులుగా నటించిన వీరిద్దరూ 18 సంవత్సరాల తర్వాత ఇందులో భార్యభర్తలుగా యాక్ట్ చేశారు. ఇద్దరూ పాత్రలను చక్కగా పోషించారు. ఇతర ప్రధానమైన పాత్రలను ప్రవీణ్‌, జబర్దస్త్ సత్యశ్రీ, దుర్గాజీ, కనక చేశారు. మరో కీలక పాత్ర పోషించిన మోహిత్‌ పెద్దాడ నటించిన '321' మూవీ కూడా శుక్రవారమే విడుదల కావడం విశేషం. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బేసికల్‌గా నటుడైన నిర్మాత శివ కంఠమనేని ఈ సినిమాలో నటించనే లేదు. శ్రీనివాస్‌ మండల స్క్రీన్ ప్లే సమకూర్చగా, ఆదిత్య భార్గవ్ మాటలు రాశారు. అవి సహజంగా ఉన్నాయి. సాయికార్తిక్ నేపధ్య సంగీతం బాగుంది. నిర్మాతలు కథకు తగ్గ ఖర్చు పెట్టారు. మరీ భారీతనానికి పోకుండా పరిమితమైన బడ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేశారు. థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడేవారు ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడొచ్చు!

రేటింగ్‌: 2.5/5

ట్యాగ్‌ లైన్‌: మిస్సింగ్‌ మిస్టరీ!

ఇవి కూడా చదవండి:

నిజమైన హీరోలేనా.. లేక ‘డూప్’లా? ‘జైలర్ 2’తో మొదలైన కొత్త చర్చ

‘రామాయణ’ టికెట్ ధరలు.. దిల్ రాజు కీలక నిర్ణయం

స్టార్ హీరోతో ప్రభుదేవా సినిమా.. దర్శకుడిగా టాలీవుడ్‌ రీఎంట్రీ

Updated Date - Oct 23 , 2026 | 02:29 AM