సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Agadha Review: ఎమ్మెస్‌ రాజు.. 'అగధ' మూవీ రివ్యూ! కామాక్షీ భాస్కర్ల.. డివైన్ మిస్టిక్ థ్రిల్ల‌ర్ ఎలా ఉందంటే

ABN, Publish Date - Aug 14 , 2026 | 07:44 AM

ఎమ్మెస్‌ రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన నూత‌న చిత్రం అగధ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చేసింది.

Agadha Movie Review

ఎమ్మెస్‌ రాజు.. 'అగధ' మూవీ రివ్యూ! Agadha Movie Review

ఎం.ఎస్.రాజు (M.S. Raju) సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. బ్లాక్ బస్టర్స్ తీసిన నిర్మాత. అయితే దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన చిత్రాలు మాత్రం ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేదు. నిర్మాతగా కంటే దర్శకుడిగా వైవిధ్యమైన చిత్రాలను అందించడానికి ఆసక్తి చూపించే ఎమ్మెస్ రాజు తాజాగా మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ గా 'అగధ' (Agadha) మూవీని రూపొందించారు. 'పొలిమేర'తో నటిగా చక్కని గుర్తింపు పొందిన కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) కీలక పాత్ర పోషించిన 'అగధ' ఎలా ఉందో తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో తెలుగులో స్పిరిట్‌, ఈవిల్ స్పిరిట్‌ సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకదానిని మించి మరొకటి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తున్నాయి. 'అగధ' కూడా అలాంటి మిస్టికల్‌ స్పిరిట్‌ రిలేటెడ్ మూవీనే. కాకపోతే దీని నేపథ్యం ఉత్తరాంధ్ర అవతల ఉన్న బస్తర్ సమీప గ్రామాలతో ముడిపెట్టింది. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు గ్రామంలో ఉండే మహాదేవి (కామాక్షి భాస్కర్ల) దెయ్యం పట్టిన వారిని మామూలు మనుషులను చేస్తుంటుంది. ఆమె గురించి తెలుసుకోవడానికి సిటీ నుంచి మానస (శ్రేయరాణి), సంజయ్‌ (రోషన్) వెళ్తారు. వాళ్ళకు తన గతాన్ని చెప్పిన మహాదేవి అదే సమయంలో తన కుటుంబం ఆపదలో ఉన్న విషయాన్ని గ్రహిస్తుంది. తన బాబాయ్ (భానుచందర్) కూతురు మహిమ (ఉల్కా గుప్తా) గర్భవతిగా ఉండి, ఆత్మహత్య చేసుకున్న విషయం మహాదేవికి తెలుస్తుంది. ఆ ఇంటిలో మరికొన్ని ఆత్మలు ఉన్నాయనే సంగతి ఆమెకు అక్కడికి వచ్చాక అర్థమౌతుంది. మహిమ ఆత్మహత్య వెనుక కలి నుంచి ఉద్భవించిన ఘోర క్షుద్రశక్తి 'అగధ' ఉందనే విషయం మహాదేవి గ్రహిస్తుంది. మహిమ ప్రియుడు సింహా (శ్రవణ్‌రెడ్డి) ఆచూకీ లేకపోవడానికి, వారి స్నేహితుడు బబ్లూ (వైవా రాఘవ) కిరాతక హత్యకు, తదనంతరం మహిమ ఆత్మహత్యకు 'అగధ' కారణమని మహాదేవి తెలుసుకుంటుంది. అసలు అగధ ఎవరు? ఎందుకు మహాదేవి కుటుంబ సభ్యులను అది హింసిస్తోంది? దైవిక శక్తులు ఉన్న మహాదేవి, అగధను ఎలా అడ్డుకోగలిగింది? అనేది మిగతా సినిమా.


ఈ తరహా చిత్రాలలో లాజిక్ జోలికి పోకుండా ఉంటేనే మంచిది. అప్పుడే సినిమాను ఎవరైనా ఎంజాయ్ చేయగలరు. మూవీ చూస్తుండగా, 'ఇది ఎలా సాధ్యం?' అనే ప్రశ్న ప్రేక్షకుడి మనసులో ఉదయించిందంటే, దర్శకుడు ఫెయిల్‌ అయినట్టే. ప్రేక్షకుడిని సరిగా ఎంగేజ్‌ చేయలేకపోయినట్టే. 'అగధ' సినిమా విషయంలో అలాంటి ప్రశ్నలు పెద్దగా ఎదురు కావు కానీ అదే సమయంలో ప్రేక్షకుడిని పూర్తి స్థాయిలో ఎంగేజ్ కూడా చేయలేకపోయింది. మహిమ ఓ పాపను రక్షించడానికి చేసే ప్రయత్నంతో మొదలైన ఈ సినిమా, ఆమె ఆత్మహత్యతో ఊపందుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంటుంది. మహాదేవి వచ్చిన తర్వాత ఆమె కుటుంబంలోని వారి అనుమానాస్పద ప్రవర్తన, మహిమ బోయ్ ఫ్రెండ్‌ సూర్య ఆత్మను ప్రవేశ పెట్టడం వంటివి ఆసక్తిని కలిగిస్తాయి. సూర్య గుహలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలుగుతుంది. అగధ గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత మొదలవుతుంది. అయితే... ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం చాలా పేలవంగా ఉంది. అగధ గురించి ఏవేవో ఊహించుకున్న వారు క్లయిమాక్స్ దగ్గరకు వచ్చే సరికీ నీరు కారిపోతారు. ఒక్క టైమ్ లాప్స్ సీన్ తప్పితే... మిగిలినవన్నీ పరమ రొటీన్ గా ఉన్నాయి. తన బలాన్ని పెంచుకోవడానికి క్షుద్ర శక్తి చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్న కారణంగా, దానికి కారకులైన వారి మీద అది పగ బట్టడం అనేది చాలా రొటీన్ థీమ్‌. కాకపోతే దాన్ని టెక్నికల్‌ సపోర్ట్ తో కొత్తగా చూపించే ప్రయత్నం ఎమ్మెస్ రాజు చేశారు. కొత్తదనం లేని కథను తీసుకుని, భిన్నంగా చెప్పే ప్రయత్నం చేసినా... రొటీన్ అండ్ రిపీటెడ్ సీన్స్ తో అది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అలా అని ఇది తీసి పారేసే సినిమా కాదు. కానీ ఏదో ఊహించుకుని వస్తే మాత్రం నిరాశకు గురికాక తప్పదు.

నటీనటుల విషయానికి వస్తే.. ఈ తరహా పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన కామాక్షి భాస్కర్ల మూవీని తన భుజస్కందాల మీద మోసింది. ప్రతి సన్నివేశంలో బెటర్ ఇవ్వడానికి ప్రయత్నించింది. 'ఆంధ్రాపోరి'తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఉల్కా గుప్తా మానస పాత్రలో మెప్పించింది. 'డర్టీ హరీ'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రవణ్‌ రెడ్డి ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలను సమర్థవంతంగా పోషించాడు. వనిత కుమార్తె జోవికా విజయ్‌ కుమార్ కు ఇదే మొదటి సినిమా. రియల్ లైఫ్ తల్లీ కూతుళ్ళు రీల్‌ లైఫ్ లోనూ అవే పాత్రలు పోషించారు. ఆత్మలు ఆవహించిన సన్నివేశాలలో జోవిక బాగానే యాక్ట్ చేసింది. మహాదేవి గురించి తెలుసుకునే జంటగా శ్రేయరాణి, రోషన్ కీలక పాత్రలు పోషించారు. హిమాలయ సాధువుగా సిజ్జు, మహారాణి బాబాయ్‌ గా భానుచందర్, ఆయన రెండో భార్య సుశీలగా వనిత (ఎమ్మెస్ రాజు నిర్మించిన 'దేవి'లోనూ ఆమె పాత్ర పేరు అదే. అందులోనూ భానుచందర్ భార్యే!) నటించారు. ఇతర ప్రధాన పాత్రలను వైవా రాఘవ, కనకవ్వ, ఆర్నా మూలర్ తదితరులు చేశారు. ఈ సినిమాను నిలబెట్టింది రాకేశ్‌ వెంకటాపురం నేపథ్య సంగీతం. నాని చమిడిశెట్టి విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో అందంగా, బాలెన్డ్స్ గా తీర్చి దిద్దారు. జునైద్‌ సిద్దిఖీ ఎడిటింగ్‌ మరింత క్రిస్ప్ గా ఉంటే బాగుండేది. సినిమా నిడివి రెండుప్పావు గంటలే అయినా... ద్వితీయార్థంకు వచ్చేసరికీ భారంగా సాగిన భావన కలుగుతుంది. నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు ఎక్కడా రాజీ పడలేదు. టెక్నికల్‌ ఇష్యూస్ మీద, నటీనటుల యాక్టింగ్‌ మీద ఎక్కువ దృష్టిపెట్టిన దర్శకుడు ఎమ్మెస్ రాజు... కథ విషయంలోనూ ఎక్కువ కసరత్తు చేసి ఉంటే అగధ మరో స్థాయిలో ఉండేది.

ట్యాగ్‌ లైన్: రొటీన్ మిస్టికల్‌ థ్రిల్లర్

రేటింగ్‌: 2.5/5

Updated Date - Aug 14 , 2026 | 07:44 AM