సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

DNK Review: మౌళి తనూజ్‌.. డీఎన్‌కే సినిమా రివ్యూ!

ABN, Publish Date - Nov 13 , 2026 | 11:35 AM

మౌళి తనూజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'దొంగ నా కొడుకు' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్విస్టులు, కామెడీతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది? మౌళి నటన ఆకట్టుకుందా? సినిమాలో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి? పూర్తి రివ్యూ చదవండి.

Donga Naa Koduku Telugu Movie Review

సినిమా రివ్యూ: 'దొంగ నా కొడుకు'

విడుదల తేది: 13–11–2026

'లిటిల్‌ హార్ట్స్‌’ చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్నాడు మౌళి తనూజ్‌. తాజాగా డీఎన్‌కే (దొంగ నా కొడుకు) చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. హీరోగా అతనికిది రెండో సినిమా. సుస్మితా శెట్టి కథానాయిక. అలీ, రఘుబాబు, రజిత, ప్రియ, బబ్లూ కీలక పాత్రధారులు. శ్రీను కంబాల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. టీజర్‌, ట్రైలర్‌లతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం మౌళిని ద్వితీయ విఘ్నం నుంచి గట్టెక్కించిందా? ఈ సినిమా ఎలా ఉంది అన్నది చూద్దాం.

కథ:

ఈశ్వర్‌(మౌళి) విశాఖపట్నంలో పదో తరగతి ఫెయిల్‌ అయిన మధ్య తరగతి కుర్రాడు. రూపాయి సంపాదన లేదు. కానీ.. అప్పులు, లోన్‌లు తీసుకుని బెట్టింగ్‌లు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లతో టైమ్‌ గడిపేస్తుంటాడు. దీని కోసం లవర్‌ దీపూ (సుస్మితాశెట్టి) ఉంగరాలను సైతం తాకట్టు పెట్టి బెట్టింగుల్లో పెడతాడు. ఈశ్వర్‌ చేసినబదానికి దీపూ పేరెంట్స్‌ ఇంటికొచ్చి గొడవ చేసి వాడిన మొత్తం చెల్లించాలని హెచ్చరిస్తారు. తనకున్న అప్పులను క్లియర్‌ చేయడానికి భారీ స్కామ్‌ చేయాలని భావించి, ఓ బంగారం షాపును దోపిడీ చేయడానికి స్నేహితుడు బబ్లూతో కలిసి ప్లాన్‌ చేస్తాడు.  ఆ దోపిడీ ఈశ్వర్‌ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? ఈ కథలో పుల్లయ్య (రఘుబాబు) చనిపోవడానికి కారణమేంటి? అసలు ఈ ప్లాన్‌ వెనకున్నది ఎవరు.. అన్నది కథ.

విశ్లేషణ:

విశాఖపట్టణంలో ఏ బాఽధ్యతగా లేకుండా అల్లరిచిల్లరిగా తిరిగే ఓ యువకుడి కథ ఇది. సినిమా కథేంటో దర్శకుడు ట్రైలర్‌లోనే చెప్పేశాడు. తను రాసుకున్న పాయింట్‌ బాగానే ఉన్నా... దానిని తెరకెక్కించిన విధానం మాత్రం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఫస్టాఫ్‌లో హీరో లవ్‌స్టోరీ, అతను చేసిన అప్పులు.. త్వరగా డబ్బు సంపాదించేయాలనే తపన మధ్య నడుస్తుంది. ఇంటర్‌వెల్‌లో ఓ ట్విస్ట్‌. ఆ తర్వాత ఆ ట్విస్ట్‌ను చేధించడం మీదే సాగుతుంది. ఈ తంతు అంతా సాగదీతలాగే ఉంటుంది. బంగారం బ్యాగ్‌ సీన్‌ అయితే నడుస్తూనే ఉంటుంది. నిమిషంలో తేల్చేయాల్సిన సన్నివేశాన్ని కూడా సాగదీశాడు. వరుసగా ట్విస్ట్‌లతో నింపేసి ఏదో మ్యాజిక్‌ చేసేయాలనుకున్నారు. కానీ.. అది వర్కవుట్‌ కాలేదు. పది ట్విస్టుల్లో ఓ రెండు మూడు అలరిస్తాయి. ప్రతి సీన్‌ మళ్లీ మళ్లీ రిపీట్‌ అయినట్లుగానే అనిపించింది. సోషల్‌ మీడియాలో మీమ్స్‌ను డైలాగ్‌లుగా రాసేశారు. నవ్వించే ప్రయత్నంలో కొన్ని బూతులు కూడా వాడేశారు. సమ్‌ థింగ్‌ ఈజ్‌ ఫిషీ ప్లేస్‌లో ఇంకో పదాన్ని సెన్సార్‌ బోర్డ్‌ ఎలా అంగీకరించిందో మరి! డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు ఎక్కువ వినిపించాయి. ముందు నుంచి బిల్డప్‌ ఇచ్చుకుంటూ వచ్చిన జయకృష్ణ పాత్ర ఏదో చేస్తుంది అనుకుంటే అది కూడా తేలిపోయింది. అక్కడక్కడా నవ్వులు పంచినా.. ఫైనల్‌గా విసుగు తెప్పిస్తుంది. కొన్ని సీన్లకు అయితే లాజిక్‌ అనేది ఉండదు. పోలీస్‌ స్టేషన్‌ సీన్స్‌ అయితే మరీ విసుగుగా అనిపిస్తాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..

మౌళి తనూజ్‌ టైమింగ్‌ ఉన్న ఆర్టిస్ట్‌ అని లిటిల్‌ హార్ట్స్‌ సినిమా నిరూపించింది. ఇందులో కూడా ఈశ్వర్‌ పాత్రను అలాగే చేశాడు. అయితే ఆ సినిమాలో ఉన్న ఈజ్‌ ఇందులో కనిపించలేదు. ఓవరాల్‌గా చూస్తే నటన ఓకే. హీరోయిన్‌ సుస్మితా శెట్టి చూడటానికి బావుంది. దీపు పాత్రలో నటనకు స్కోప్‌ లేదు. డబుల్‌ మీనింగ్‌లు, బూతు పదాలతో బబ్లూ నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోకి తల్లిదండ్రుల పాత్రల్లో అలీ, రజిని కనిపించారు. ఇద్దరి నటనలోనూ సహజత్వం మిస్‌ అయింది. రఘుబాబు, భద్రం ప్రియ, గుండు సుదర్శన్‌ ఇతర పాత్రధారులు ఫర్వాలేదనిపించారు. సూర్య బాలాజీ కెమెరా పనితనం బావుంది. సింజిత్‌ యర్రమిల్లి సంగీతం ఆకట్టుకుంది. టైటిల్‌ సాంగ్‌తోపాటు సెకెండాఫ్‌లో ఓ సాంగ్‌ అలరిస్తాయి. సీన్లు మళ్లీ మళ్లీ చూసినట్లు ఉన్నాయి కాబట్టి ఎడిటింగ్‌ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. సినిమాను సింపుల్‌ లొకేషన్స్‌లో చేసేశారు. నిర్మాణ విలువలు బావున్నాయి. దర్శకుడు రాసుకున్న పాయింట్‌ బాగానే ఉన్నా.. తెరకెక్కించడంలో లోపం ఉంది. యూత్‌ను ఆకట్టుకునే డైలాగ్‌ ఉన్నాయి.. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కోసం సిల్లీ కామెడీ, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు రాసి దర్శకుడి స్థాయిని తగ్గించుకున్నట్లు అనిపిస్తుంది. లాజిక్కులు పట్టించుకోకుండా సినిమా చూస్తే కాసేపు నవ్వుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ హోప్స్‌ పెట్టుకోనక్కర్లేదు.

ట్యాగ్‌లైన్‌: డీఎన్‌కే.. సిల్లీ కామెడీ

రేటింగ్‌: 2/5

Updated Date - Nov 13 , 2026 | 06:55 PM