సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mana Shankara Vara Prasad Garu Review: మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రివ్యూ

ABN, Publish Date - Jan 12 , 2026 | 03:36 AM

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు'. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా జనం ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

Mana Shakara Vara Prasad Garu Movie

మెగాభిమానులకు సంక్రాంతి పండగ మూడు రోజులు ముందే వచ్చేసింది. 'భోళాశంకర్' పరాజయంతో కాస్తంత డీలా పడ్డ చిరంజీవి (Chiranjeevi) అభిమానుల్లో రెండున్నరేళ్ళ తర్వాత వచ్చిన 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) సరికొత్త జోష్ ను నింపింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) వరుసగా తన తొమ్మిదో చిత్రాన్ని సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కించి సరికొత్త రికార్డ్ ను నెలకొల్పాడు. విశేషం ఏమంటే... మెగాభిమానులే కాదు... దగ్గుబాటి అభిమానులనూ ఈ సినిమా ఆనందడోలికల్లో ముంచెత్తింది. వెరశి ఈ యేడాది తొలి విజయాన్ని నమోదు చేసుకున్న సినిమాగా 'మన శంకర వర ప్రసాద్ గారు' నిలిచింది.

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూవీ అనగానే అందరి అంచనాలు అంబారాన్ని తాకాయి. వాటిని వీరు అందుకోగలరా? లేదా? అనే సందేహం కొంతకాలంగా చాలా మంది మదిని తొలచి వేస్తోంది. మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవితో ఇప్పుడు కామెడీ చేయిస్తే జనం చూస్తారా? అనే సందేహాన్ని కూడా కొందరు వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమాలో మెగాభిమానులు కోరుకునే డాన్సులు, ఫైట్స్ కు అనిల్ రావిపూడి ప్రాధాన్యమిచ్చాడు. చిన్న పాయింట్ ను తీసుకుని రెండు గంటల నలభై నిమిషాల సేపు ఎక్కడా ల్యాంగ్ లేకుండా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా మూవీని నడిపించేశాడు. పాటలు, ఫైట్స్ తో పాటు ఫన్ కూ లోటు లేకపోవడంతో 'మన శంకర వర ప్రసాద్ గారు' అందరికీ నచ్చేశాడు.


ఇంతకూ కధేమిటంటే...

సెంట్రల్ మినిస్టర్ నితిన్ శర్మ (శరత్‌ సక్సేనా) పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా వర్క్ చేస్తుంటాడు శంకర వర ప్రసాద్ (చిరంజీవి). పైకి ఆనందంగా కనిపించే అతని జీవితంలో విషాదం ఉంటుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రసాద్, బిజినెస్ మాగ్నెట్ కూతురు శశిరేఖ (నయనతార Nayantara ) ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్ళి చేసుకుంటారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత శశిరేఖ తండ్రి జీవీఆర్ (సచిన్ ఖేడేకర్) పన్నాగం కారణంగా వారు విడాకులూ తీసుకుంటారు. దూరమైన తన భార్యకు దగ్గర కావడం కోసం వర ప్రసాద్ ఏం చేశాడు? తన మీద విషం నూరిపోసిన పిల్లల మనసుల్ని ఎలా గెలచుకున్నాడు? మావగారికి ఎలా బుద్ధి చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ.

నిజం చెప్పాలంటే... ఈ కథలో ఎలాంటి కొత్తదనం లేదు. ఇగో క్లాషెస్ తో విడిపోయిన భార్యభర్తలు తిరిగి కలవడం అనే పాయింట్ మీద బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ఇదీ ఆ కోవకు చెందిందే. అయితే ఈ పాత కథకే కొత్త అందాలను జత చేశాడు అనిల్ రావిపూడి. మెగాభిమానులు మెచ్చేలా చిరంజీవిని వింటేజ్ అవతార్ లో చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రథమార్దం అంతా సాంగ్స్ అండ్ ఫన్ తో సాగిపోతే... ద్వితీయార్థంలో మావగారి కోటలో పాగా వేసిన అల్లుడు.. ఎలా తన ఛాలెంజ్ ను నిలబెట్టుకున్నాడనేది చూపించారు. ఇక వెంకటేశ్‌ ఎంట్రీ తర్వాత మూవీ గ్రాఫ్ పీక్స్ కు వెళ్ళిపోయింది. ఈ ఇద్దరి సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ జుగల్బందీ థియేటర్ లో ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా ఉంది.

భార్యాభర్తలు విడిపోవడానికి బలమైన కారణాలు చూపనట్టే, వారు తిరిగి కలుసుకోవడానికి కూడా పెద్దంత డ్రామానేమీ అనిల్ రావిపూడి చూపించలేదు. హీరో తల్లి పాత్రలో భార్యభర్తల బంధం గురించి నాలుగు మంచి మాటలు చెప్పించారు. అయినా వాటిని మనసులోకి తీసుకోని హీరోయిన్ ఆ తర్వాత పరిణామాలతో భర్త వైపు మళ్ళినట్టు చూపించారు. అక్కడ మరింత బలమైన సన్నివేశం ఏదైనా రాసుకుని ఉండాల్సింది. అయితే... అనిల్ రావిపూడి దృష్టి మొత్తం మెగాభిమానుల్ని సంతృప్తిపర్చడం మీదనే ఉంటడంతో ఈ భావోద్వేగాల జోలుకు పెద్దంతగా పోలేదు. బలమైన విలన్ లేకపోవడం కూడా ఈ సినిమాకు సంబంధించి చిన్న లోటు.


చిరంజీవికి ఇలాంటి పాత్రలు చేయడమన్నది కేక్ వాక్. ఆయనలో సరికొత్త జోష్ ను నింపి... పాతికేళ్ళ క్రితం నాటి చిరంజీవిని అనిల్ రావిపూడి వెలికి తీసుకొచ్చాడు. తన మీద తనే జోకులు వేసుకుంటూ, అప్పడప్పుడూ అతి తెలివిని ప్రదర్శిస్తూ సహజమైన నటనతో చిరంజీవి ఆకట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో చాలా బరువైన పాత్రలు చేసిన ఆయనకు ఇది ఓ ఆటవిడుపు. బహుశా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ పాత్రను ఆయన చేసి ఉంటారు. ఇప్పటికే చిరంజీవితో రెండు సినిమాలు చేసిన నయనతార ఇందులో బిజినెస్ మాగ్నెట్ కూతురుగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ను ఇచ్చింది. చిరంజీవి టీమ్ మెంబర్స్ గా హర్షవర్థన్, కేథరిన్ థెస్రా, అభినవం గోమటం వినోదాన్ని పంచారు. శరత్ సక్సెనా, సచిన్ ఖేడేకర్, సుదేవ్ నాయర్ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. మొన్న వచ్చిన 'ది రాజా సాబ్'లో ప్రభాస్ బామ్మగా నటించిన జరీనా వాహెబ్ ఇందులో చిరంజీవి తల్లి పాత్రను చక్కగా పోషించింది. వెంకీ గౌడగా వెంకటేశ్ ఇరగదీశాడు. ఇతర ప్రధాన పాత్రలను వీటీవీ గణేశ్‌, రఘుబాబు, శ్రీనివాస రెడ్డి, హరీశ్‌ పేరడి, నాగ మహేశ్‌, వడ్లమాని సాయి శ్రీనివాస్, వైవా హర్ష తదితరులు పోషించారు. గత యేడాది వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం'తో అందరి మనసుల్ని దోచుకున్న మాస్టర్ రేవంత్ పవన్ సాయి ఇందులోనూ కామెడీని పండించాడు. ఎప్పటిలానే దర్శకుడు అనిల్ రావిపూడి... చిరు, వెంకీ డాన్స్ నంబర్ లో మెరుపులా మెరిశాడు.

సినిమా విడుదలకు ముందే పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వంద మిలియన్లకు పైగా వ్యూస్ ను అందుకున్న 'మీసాల పిల్ల' పాట కంటే 'హుక్ సాంగ్' చిత్రీకరణ రీత్యా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. అలానే చిరంజీవి, వెంకీపై చిత్రీకరించిన ప్రీ క్లయిమాక్స్ సాంగ్ కూడా ఫుల్ ఎనర్జీతో సాగింది. భీమ్స్ అందించిన నేపథ్య సంగీతమూ బాగుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ పర్ ఫెక్ట్ గా ఉన్నాయి. ఇప్పటికే అనిల్ రావిపూడితో 'భగవంత్ కేసరి' మూవీని నిర్మించిన సాహు గారపాటి ఈ సినిమానూ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాడు. దీనికి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సైతం మరో నిర్మాత కావడం విశేషం. ఇందులో వెంకటేశ్ అతిథి పాత్ర చేయడంతో మూవీ రేంజ్ పెరిగింది. ఇది ఖచ్చితంగా కలెక్షన్స్ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇక సంక్రాంతికి రాబోతున్న మిగిలిన మూడు చిత్రాలు ఎంత బాగున్నా కూడా... 'మన శంకర్ వర ప్రసాద్' రేంజ్ ను అవి అందుకోవడం కష్టమే. పండగకు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేలా ఈ సినిమాను రూపొందించిన దర్శకుడు అనిల్ రావిపూడిని ప్రత్యేకంగా అభినందించాలి.

రేటింగ్: 3.25/5

ట్యాగ్ లైన్: మన శంకర వర ప్రసాద్ గారు నచ్చేశారు!

Updated Date - Jan 12 , 2026 | 06:54 AM