సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

M4M Movie Review: జో శర్మ నటించిన M4M మూవీ రివ్యూ

ABN, Publish Date - May 07 , 2026 | 08:24 PM

హైదరాబాద్‌లో పుట్టి మహారాష్ట్రలో పెరిగిన జో శర్మ హీరోయిన్‌గా.. టాలీవుడ్‌లో ‘మల్లెపూవు’, ‘మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ వంటి సినిమాలను నిర్మించిన నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘M4M’ మూవీ రివ్యూ.

M4M Movie Review

మూవీ పేరు: M4M (మోటివ్ ఫర్ మర్డర్)

న‌టీన‌టులు: జో శర్మ, సంబీత్ ఆచార్య, శుభలేఖ సుధాకర్, ఎంఆర్‌సి వడ్లపట్ల, రాజేష్ మాత్రే, గీతా భాస్కర్ త‌దిత‌రులు.

విడుదల తేదీ: 08, మే 2026

బ్యానర్‌: మోహన్ మీడియా క్రియేషన్స్

సంగీతం: వసంత్‌ ఇసైపెట్టై

సినిమాటోగ్రఫీ: సంతోష్‌ షణ్మోని

దర్శకత్వం, నిర్మాణం: మోహన్ వడ్లపట్ల

M4M Movie Review: హైదరాబాద్‌లో పుట్టి మహారాష్ట్రలో పెరిగిన జో శర్మ (Jo Sharma) ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. నటన మీద మక్కువతో ఒకటి రెండు తెలుగు సినిమాల్లో నటించే ప్రయత్నం చేశారు. అది సఫలం కాలేదు. ఈ సమయంలో నిర్మాత మోహన్ వడ్లపట్ల (Mohan Vadlapatla) ఆమెతో ‘ఎం4ఎం’ మూవీని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానున్న ఈ ‘ఎం4ఎం’ ఎలా ఉందో చూద్దాం (M4M Movie Review).

కథ (M4M Movie Story):

ఎ.సి.పి. కృష్ణ (సంబీత్‌ ఆచార్య), ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్ రాధ (జో శర్మ) భార్యాభర్తలు. హైదరాబాద్‌లో ఓ స్టార్ హీరో హత్య జరుగుతుంది. శవాన్ని హంతకుడు జీన్ సైమన్ వేసిన ‘డెత్‌ ఆఫ్‌ గ్లాడియేటర్‌’ పెయింటింగ్‌ పొజిషన్‌లో పెడతాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్‌ చేసే పనిని ఏసీపీ కృష్ణకు ప్రభుత్వం అప్పగిస్తుంది. అతని పరిశోధనలో అలాంటి హత్యలు గడిచిన ఐదు సంవత్సరాలలో ఇరవై వరకూ జరిగాయని తేలుతుంది. భార్య రాధ సహాయంతో కృష్ణ సీరియల్‌ కిల్లర్ అయిన సైకోను ఎలా పట్టుకున్నాడు? ఈ హత్యల వెనుక హంతకుడి మోటివ్‌ ఏమిటి? అతనికి ఎవరు సహకరించారు? అనేది మిగతా కథ.


విశ్లేషణ:

ఎం4ఎం (మోటో ఫర్ మర్డర్) అనే పుస్తకాన్ని రచయిత, జర్నలిస్ట్ వాసుదేవ్‌ (ఎం.ఆర్.సి. వడ్లపట్ల) రాస్తాడు. ఆ పుస్తకాన్ని కోర్టు బ్యాన్‌ చేస్తుంది. ఐదు సంవత్సరాల తర్వాత ఆ పుస్తకంలో రాసినట్టుగానే ఈ హత్యలు జరుగుతాయి. దాంతో ఆ పుస్తక రచయతను కలిసి రాధ ఇన్వెస్టిగేషన్‌ స్టార్ట్ చేస్తుంది. హంతకుడి నుండి తప్పించుకుని గతాన్ని కోల్పోయిన ఫాల్గుణ (శుభలేఖ సుధాకర్‌) అనే దర్శకుడిని కలిసిన తర్వాత ఆమెకు ఓ క్లూ దొరుకుతుంది. అక్కడ నుండి కథ రకరకాల మలుపులు తిరిగి హంతకుడ్ని పట్టుకోవడంతో ముగుస్తుంది.

సీరియల్‌ కిల్లింగ్స్, వాటిని పోలీసు అధికారులు ఛేదించడం మీద చాలానే సినిమాలు, వెబ్ సీరిస్‌లు వచ్చాయి. ఓ పుస్తకంలోని సంఘటనల తరహాలో హత్యలు జరగడం అనేది కూడా కొత్త పాయింటేమీ కాదు. కాకపోతే హంతకుడు శవాలను పాపులర్ పెయింటింగ్స్ తరహాలో పెట్టడం, దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది కాస్తంత కొత్తగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఎక్కడా బోర్‌ కొట్టదు. పైగా తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత కొనసాగుతూ ఉంటుంది. అయితే పరిమితమైన బడ్జెట్‌లో సినిమా తీశారు. ఆ లోపం కనిపిస్తోంది.


ఎవరెలా చేశారంటే?

లీడ్‌ క్యారెక్టర్ చేసిన జో శర్మకు ఇది తొలి చిత్రం. అయినా అనుభవం ఉన్న నటిలానే ఈ పాత్రను పోషించింది. ఆమె ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కూడా. అలానే హీరో సంబీత్‌ ఆచార్యకూ ఇదే మొదటి సినిమా. ఇతర ప్రధాన పాత్రలను శుభలేఖ సుధాకర్, ఎంఆర్‌సి వడ్లపట్ల, రాజేష్ మాత్రే, గీతా భాస్కర్ తదితరులు పోషించారు. వసంత్‌ ఇసైపెట్టై సంగీతం, సంతోష్‌ షణ్మోని సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి. గతంలో ‘మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో’ సినిమాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల ఈ సినిమాతో దర్శకుడయ్యాడు. మొదటి ప్రయత్నం బాగానే ఉంది. కాకపోతే ఈ తరహా ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్స్ ఓటీటీలో బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. అదే తరహా క్రైమ్ డ్రామా కోసం జనాలు పని కట్టుకుని థియేటర్‌కు ఎంతవరకూ వెళతారనేది చూడాలి. సైకలాజికల్‌ థ్రిల్లర్స్‌ను, మర్డర్ ఇన్వెస్టిగేటివ్‌ డ్రామాలను ఇష్టపడేవారికి ఓ మాదిరి నచ్చే ఆస్కారం ఉంది.

రేటింగ్‌: 2.5/5

ట్యాగ్‌లైన్‌: ఆర్టిస్టిక్‌ మర్డర్స్!

Updated Date - May 07 , 2026 | 08:26 PM