Korean Kanakaraju: వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు రివ్యూ
ABN, Publish Date - Aug 07 , 2026 | 11:44 AM
వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందంటే...
మెగాఫ్యామిలీ హీరోలకు పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా నుంచి రోజులు బాగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ యేడాది జనవరిలో చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు', ఆ తర్వాత రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలు విజయం సాధించడంతో వరుణ్ తేజ్ సైతం 'కొరియన్ కనకరాజు'తో హిట్ కొట్టేస్తాడనే ధీమాను మెగాభిమానులు వ్యక్తం చేశారు. మరి మేర్లపాక గాంధీ తెరకెక్కించిన 'కొరియన్ కనకరాజు' హిట్టు బాట పట్టాడో లేదో తెలుసుకుందాం.
తెలుగులో హారర్ కామెడీలకు కొదవలేదు. అందులో పీక్స్ కు వెళ్ళిన సినిమా 'ప్రేమకథా చిత్రమ్'. హీరోతో సైతం కామెడీ చేయించిన ఆ మూవీ... ఓ రకంగా ఈ జానర్ సినిమాలకు ల్యాండ్ మార్క్. అప్పటి నుంచి అదే బాటలో బోలెడన్ని హారర్ కామెడీస్ వచ్చాయి. అయితే అందులో కొన్ని విజయం సాధించాయి. మరికొన్ని రోటీన్ కథ కారణంగా పరాజయం పాలయ్యాయి. ఆ కోవలో తెరకెక్కిందే 'కొరియన్ కనకరాజు' కూడా.
ఇది అనంతపురం జిల్లా పెనుగొండలో జరిగే కథ. చెక్కభజన బృందానికి నాయకత్వం వహించే కనకరాజు (వరుణ్ తేజ్)కు కోపం జాస్తి. ఆ కారణంగా తరచూ గొడవల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. అతని స్నేహితుడైన కిష్టప్ప (సత్య) అతన్ని గట్టెక్కిస్తూ ఉంటాడు. కనకరాజు అన్నయ్య పృథ్వీరాజ్ (అవసరాల శ్రీనివాస్) తండ్రి (చిన్నా)తో పది లక్షలు అప్పు చేయించి, సింగపూర్ లో బిజినెస్ చేస్తానని వెళ్ళి పత్తా ఉండడు. అన్నయ్య అక్కడ కష్టాల్లో ఉన్నాడని తెలిసి కనకరాజు చెక్కభజన ద్వారా తాను సంపాదించిందంతా అతనికే పంపిస్తుంటాడు. తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేదని చెంగారెడ్డి (సునీల్) మనుషులు కనకరాజు కుటుంబాన్ని చులకన చేస్తుంటారు. ఇదే సమయంలో అతనికి తమ ఊరికే చెందిన చైత్ర (రుతిక నాయక్) పరిచయం అవుతుంది. కియా కంపెనీలో పనిచేసే చైత్ర కొరియాకు వెళ్ళి, అక్కడే ఓ మంచి అందమైన కుర్రాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. చైత్రకు తన ప్రేమను ఎలా చెప్పాలో తెలియక కనకరాజు సతమతమౌతుండగా, ఓ రోజు బార్ లోని పాత్రలో ఉన్న బూడిదలో మందు కలుపుకుని పొరపాటున తాగేస్తాడు. దాంతో అందులోని కొరియన్ ఆత్మ కనకరాజును ఆవహిస్తుంది. ఆ క్షణం నుంచి అతనికి కొరియన్ భాషతో పాటు విపరీతమైన బలమూ వస్తుంది. తనను చంపడానికి వచ్చిన కర్రి శ్రీను (టెంపర్ వంశీ)ని చంపేయడమే కాకుండా అతని మేనమావ చెంగారెడ్డిని చితకొట్టేస్తాడు కనకరాజు. అతనికి పట్టిన ఆ కొరియన్ దెయ్యాన్ని ఎలా వదించారు? కొరియా వెళ్ళాలనుకున్న చైత్ర కనకరాజుతో కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? సింగపూర్ అని వెళ్ళిన కనకరాజు అన్నయ్య కొరియాకు ఎందుకొచ్చాడు? అసలు కనకరాజును పట్టుకున్న ఆ కొరియా దెయ్యం ఎవరిది? అనేది మిగతా సినిమా.
మనుషులను ఆత్మలు ఆవహించడం, వారు విచిత్రంగా ప్రవర్తించడం, దాంతో పక్కన వక్తులు భయానికి లోనుకావడం చాలా సినిమాల్లో చూసిందే. అలానే మనిషిని ఆవహించిన ఆత్మ అతని ద్వారా పగని తీర్చుకునే కథలూ చూశాం. కానీ కొరియా నుంచి ఓ ఆత్మ ఇండియాకు రావడం ఇక్కడ పెనుగొండలోని ఓ వ్యక్తిని ఆవహించడం, ఆ తర్వాత కథ కొరియాకు వెళ్ళడం మాత్రం కొత్తగా ఉంది. పైగా ఈ మధ్య తెలుగువారికి కొరియా మేనియా బాగా పట్టుకుంది. దాంతో ఈ కథ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో కొరియా నేపథ్యంలో ఈ హారర్ కామెడీ డ్రామాను మేర్లపాక గాంధీ రాసుకున్నట్టున్నారు. నిజానికి కథ పాతదే అయినా... ట్రీట్ మెంట్, కొరియా నేపథ్యంతో కొత్తగా అనిపిస్తుంది. కనకరాజు శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించిన తర్వాతే సినిమా కొత్తపుంతలు తొక్కింది. సెకండ్ హాఫ్‌లో కొరియాలోని సన్నివేశాలు కొంత రొటీన్ గా ఉన్నా... దైవాంశను మిక్స్ చేసి దర్శకుడు సినిమాను దర్శకుడు రక్తికట్టించాడు.
ఇలాంటి హారర్ కామెడీస్ చూసేప్పుడు లాజిక్కుల జోలికి పోకూడదు. ఎందుకంటే... కియా కంపెనీలోనే పనిచేసే చైత్ర వీసా రెండు సార్లు రిజక్ట్ అయినట్టు చెబుతారు. అదే కొరియాకు హీరో బృందం, కిట్టప్ప తండ్రి ఎర్ర బస్సు ఎక్కి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తారు. హీరో అన్నయ్యకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్, కాలభైరవుని కటాక్షంతో హీరో తిరిగి ప్రాణాలు పోసుకోవడం ఏమంత కన్వెన్సింగ్ లేవు. ద్వితీయార్థంలో వీటీవీ గణేశ్, మాస్టర్ రేవంత్ పై చిత్రీకరించిన కామెడీ ట్రాక్ కూడా అప్ టు ద మార్క్ లేదు. అయితే... సగటు ప్రేక్షకుడు అంత డీటేల్స్ లోకి వెళ్ళే ఆస్కారం లేకుండా దర్శకుడు డైలాగ్ అండ్ సిట్యుయేషనల్ కామెడీతో రక్తి కట్టించాడు. దాంతో ఇందులోని లోపాలన్నీ గాలికి కొట్టుకుపోయాయి.
నటీనటుల విషయానికి వస్తే వరుణ్ తేజ్ చాలా ఈజ్ తో ఈ పాత్రను చేశాడు. ఆత్మ ఆవహించిన తర్వాత నటన కాస్తంత శ్రమతో కూడుకున్నదే అయినా... బాగానే కష్టపడ్డాడు. కథలో కీలకమైన చైత్ర పాత్ర ద్వితీయార్థంలో సైడ్ క్యారెక్టర్ అయిపోయింది. ఆ పాత్రను రితికా నాయక్ బాగానే చేసింది. తనదైన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా నటించి, ఈ సినిమానునిలబెట్టింది మాత్రం సత్యనే! అతని తండ్రిగా మురళీధర్ గౌడ్ కూడా బాగా చేశాడు. కాకపోతే ఈ తాంత్రికుడి పాత్రను కాస్త సీరియస్ గా మలిచి ఉండాల్సింది. ఇతర ప్రధాన పాత్రలను అవసరాల శ్రీనివాస్, సునీల్, టెంపర్ వంశీ, చిన్నా, తులసి, వీటీవీ గణేశ్, రంగస్థలం మహేశ్, మిర్చి కిరణ్, మాస్టర్ రేవంత్ తదితరులు పోషించారు. దీక్షా నగార్కర్ పై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ ను ప్రారంభంలోనే పెట్టేశారు. వరుణ్ తేజ్ హైట్ కు దీక్షా ఏ మాత్రం మ్యాచ్ కాలేదు!
తమన్ స్వరపర్చిన పాటలు, నేపథ్య సంగీతం పెద్దంతగా లేవు. ఆర్.ఆర్. అయితే... ప్రమోషన్స్ లో చెప్పినట్టే 'ఓజీ' ట్రాక్ ను ఉపయోగించేసినట్టుగా అనిపించింది. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి తో కలిసి యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం. క్లయిమాక్స్ లో వి.ఎఫ్.ఎక్స్. కూడా బాగున్నాయి. మొత్తం మీద ఈ హారర్ కామెడీతో ఇటు వరుణ్ తేజ్, అటు మేర్లపాక గాంధీ ఖాతాలో హిట్ మూవీ పడిందనుకోవచ్చు.
రేటింగ్: 3/5
ట్యాగ్ లైన్: ఫన్ రైడ్!