సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dorothy Review: కీర్తి సురేష్ డోరతీ ఎలా ఉందంటే..

ABN, Publish Date - Oct 02 , 2026 | 08:11 AM

ఇటీవల తమిళనాట వార్తల్లో నిలిచిన చిత్రం ుడోరతి’. కార్తిక్‌ సబ్బురాజు దర్శకత్వం వహించారు. కీర్తి సురేశ్‌, సనంత్‌, రిషికాంత్‌ కీలక పాత్రలు పోషించారు. గునీత్‌ మోంగా, జ్యోతి దేశ్‌పాండే, అచిన్‌ జైన్‌ నిర్మించారు. విడుదలకు ముందు పలు వివాదాలకు కారణమైన ఈ చిత్రాన్ని తెలుగులో రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా ద్వారా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరీ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

Dorothy Telugu Review

సినిమా రివ్యూ: డోరతీ

విడుదల తేది: 2–10–2026

ఇటీవల తమిళనాట వార్తల్లో నిలిచిన చిత్రం 'డోరతీ' (Dorothy) కార్తిక్‌ సుబ్బరాజు (Karthik Subbaraj) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ (Keerthy Suresh), సనంత్ (Sananth), రిషికాంత్ (Rishikanth) కీలక పాత్రలు పోషించారు. గునీత్‌ మోంగా, జ్యోతి దేశ్‌పాండే, అచిన్‌ జైన్‌ నిర్మించారు. విడుదలకు ముందు పలు వివాదాలకు కారణమైన ఈ చిత్రాన్ని తెలుగులో రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా ద్వారా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరీ 'డోరతీ' ఎలా ఉందో చూద్దాం.

 కథ  

తమిళనాడులోని  ఓ పల్లెలో సాగే కథ ఇది. సుబ్బు (సనంత్‌), కార్తీ (రిషికాంత్‌) స్నేహితులు. చిన్నతనంలోనే సుబ్బు తల్లి, అక్క మరణించడంతో ఇంట్లో ఆడ నీడే కనిపించదు. చిన్ననాటి నుంచి గొడవలకు అలవాటు పడిన వీరిద్దరూ ఎదిగిన క్రమంలోనూ అదే తీరులో వ్యవహరిస్తుంటారు. సుబ్బుది కాస్త పేరున్న కుటుంబం. అతని తండ్రి విజిల్‌ వీరయ్యకు కులం, పరువు, ప్రతిష్ట వంటి పట్టింపులు ఎక్కువ. ఇంట్లో ఆడగాలి తగిలితే గిట్టని ఫ్యామిలీ అది. చిన్నతనం నుంచి రఫ్‌గా ఉండే సుబ్బులో స్త్రీ లక్షణాలు ఉన్నాయని తెలుసుకుంటాడు. అది బయటకు వస్తే పురుషాధిక్య సమాజంలో నెట్టుకురావడం కష్టమని ఆ విషయాన్ని బయట పెట్టకుండా పౌరుషంగా ఉన్నట్టే ముందుకెళ్తుంటాడు. సుబ్బు అన్నయ్య డోరతీ (కీర్తి సురేశ్‌) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొస్తాడు. ఆడ గాలే తెలియని ఆ ఇంట్లో సుబ్బు డోరతికి ఆకర్షితుడవుతాడు. ఆమెతో కలిసి మెలసి ఉంటాడు. డోరతి సడెన్‌గా చనిపోతుంది. కారణం ఏంటనేది తెలీదు. పలుకుబడి ఉన్న విజిల్‌ వీరయ్య ఉరి వేసుకొని చనిపోయిందని కేసు క్లోజ్‌ చేయిస్తాడు. సుబ్బు మాత్రం అన్న, తండ్రి కలిసి చంపేశారని నమ్ముతాడు. డోరతి మరణం అతన్ని మరింత ఒంటరిని చేస్తుంది. అదే సమయంలో సుబ్బుకి వశీకర్‌తో గొడవ జరుగుతుంది. సుబ్బుని రక్షించుకోవడం కోసం కార్తీ అతన్ని చంపేస్తాడు. తన కుటుంబం తీరు భరించలేని సుబ్బు తనొక ట్రాన్స్‌జెండర్‌ అనే విషయాన్ని బయటపెట్టి ఇంటి నుంచి పారిపోతాడు. పరువే ముఖ్యంగా భావించే విజిల్‌ వీరయ్య సుబ్బుని చంపేయాలని ప్లాన్‌ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? డోరతి ఎలా చనిపోయింది? బెస్ట్‌ ఫ్రెండ్‌ సుబ్బు అలా మారడాన్ని చూసి కార్తీ ఏం చేస్తాడు? అన్నది కథ.  

విశ్లేషణ..

సమాజంలో అంతరాలను తెరపై చూపించడంలో తమిళ దర్శకులు కొందరు ముందుంటారు. అందులో కార్తిక్‌ సుబ్బరాజు ఒకరు. ఆయన సినిమాలో ఇలాంటి అంశాలతోపాటు చక్కని సందేశం ఉంటుంది. ఇది కూడా ఆ తరహా కథే. ఇందులో కుల, లింగ వివక్షత గురించి చర్చించారు. ఇద్దరు స్నేహితుల్లో ఒకరు హిజ్రాగా మారితే ఏం జరిగింది అన్నది సింపుల్‌గా ఈ సినిమా కథ. ప్రథమార్థం అంతా సుబ్బు, కార్తీ చిన్నతనం.. వారు ఎదిగిన తీరు.. ప్రేమలు, ఊళ్లో గొడవలు, కుటుంబం విధానం ఇలా సింపుల్‌గా సాగింది. వేరే రాష్ట్రం అమ్మాయి అయిన డోరతి ఎంట్రీతో కథ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఆమె రాకతో చిన్నప్పటి నుంచి రఫ్‌గా ఉండే సుబ్బులో మార్పు వస్తుంది, సున్నితంగా మారిపోతాడు. అలా ఎందుకు జరిగిందనే ఆసక్తి ప్రేక్షకుడిలో కలుగుతుంది. తదుపరి డోరతి మరణం.. దాంతో ఇంటర్‌వెల్‌. డోరతి మరణానికి కారణం ఏంటనే లైన్‌లో సెకెండాఫ్‌ నడుస్తుందేమో అనిపిస్తుంది. కానీ అలా జరగదు. సుబ్బు అమ్మయిగా మారడం, హిజ్రాని అని చెప్పడంతో ఇంట్లో నెలకొన్న పరిస్థితులు, అతన్ని చంపడానికి కూడా వెనకాడని తండ్రి, ఎక్కడో దూరంగా బతుకుతున్న కార్తీని మళ్లీ తెరపైకి తీసుకురావడంతో సాగదీతగా సాగుతుంది. హిజ్రాల లైఫ్‌ స్టైల్‌, వారికి జరిగే ఉత్సవాలు ఇవన్నీ సెకెండాఫ్‌లో కాస్త ఎక్కువే చూపించారు. సుబ్బు హిజ్రాగా మారిన తర్వాత కార్తీతో చేసిన జర్నీ, వినోదాన్ని భావోద్వేగాన్ని పంచుతుంది. ప్రాణ స్నేహితుడైన సుబ్బుని చంపడానికి కార్తి తీసుకున్న ప్లాన్‌ ఆకట్టుకుంటుంది. దాంతో క్లైమాక్స్‌ ఏమవుతుందోనని ఆసక్తి పెరుగుతుంది. అయితే డోరతి ఎలా చనిపోయిందనేది క్లారిటీ ఇవ్వలేదు. ఫస్టాఫ్‌లో కామెడీ వర్కవుట్‌ అయినట్లు, సెకెండాఫ్‌లో ఎమోషన్స్‌ కొంతమేర వర్కవుట్‌ అయ్యాయి. కానీ స్క్రీన్‌ ప్లే ప్రేక్షకుడిని కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..

ఇటీవల వచ్చిన 'మొద రాత్రి'లో హీరోగా నటించిన రిషి కాంత్‌ ఇందులో కార్తిగా రా అండ్‌ రగ్డ్‌ పాత్రలో ఎమోషన్స్‌ బాగా పండించాడు. అతని పాత్రకు దీటుగా సుబ్బు పాత్రలో సనంత్‌ నటించారు. అతను హిజ్రాగా మారిన తర్వాత మరింత ఆకట్టుకున్నాడు. ఎక్స్‌ప్రెషన్స్‌, మేనరిజంతో అతనిలోని మరో యాంగిల్‌ చూపించాడు. సెకెండాఫ్‌ ఆల్మోస్ట్‌ అతని మీదే నడిచింది. సుబ్బు, కార్తిల మధ్య బాండింగ్‌, వారి జర్నీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కీర్తి సురేశ్‌ది నిడివి తక్కువ వున్న పాత్రే అయినా కథకు కీలకమైనది. డోరతిగా క్యూట్‌గా కనిపించి మెప్పించింది. విజిల్‌ వీరయ్య పాత్రలో ముత్తుకుమార్‌ చక్కని నటన కనబర్చారు. రామచంద్రన్‌ దొరైరాజుతో పాటు మిగిలిన తమిళ నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకు మెయిన్‌ ఎసెట్‌ సినిమాటోగ్రఫీ. తిరునావుక్కురసి కెమెరా పనితనం తొంభైల ప్రాంతంలోకి తీసుకెళ్లింది. తమిళ నేటివిటీని బాగా ఎలివేట్‌ చేశారు. నేచురల్‌ విజువల్స్‌తో మెప్పించారు. ఇళయరాజా సంగీతం కూడా సినిమాకు కలిసొచ్చింది. ఎడిటర్‌ సెకెండాఫ్‌ను కాస్తంత ట్రిమ్‌ చేసి ఉంటే బోర్‌ ఫీలింగ్‌ కలిగేది కాదు. నిర్మాణ పరంగా పేరు పెట్టక్కర్లేదు. లింగ వివక్ష, కులం, వర్ణంతో పాటు పితృస్వామ్య భావజాలం వరకు సమాజంలోని అనేక అసమానతలను గురించి దర్శకుడు ప్రశ్నించాడు. అలాగే సమాజం ట్రాన్స్‌జెండర్స్‌ ఎదుర్కొంటున్న అవమానాలు, వారి లోలోపలి సంఘర్షణలను సున్నితంగా తెరపై చూపించారు. లైన్‌ మంచిదే అయినా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడంలో కాస్త వెనకడుగులో ఉన్నట్లే అనిపిస్తుంది. దర్శకుడి ప్రయత్నం మెచ్చుకోతగ్గదే! అయితే ఇలాంటి కథాంశాలతో తెరకెక్కే చిత్రాలు అందరికీ నచ్చే ఆస్కారం లేదు.

ట్యాగ్‌లైన్‌: వివక్షలపై సూటి ప్రశ్న  

రేటింగ్‌:2.5/5

Updated Date - Oct 02 , 2026 | 09:36 AM