సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Enna Vilai Review: సామాన్యుడి.. ఆత్మగౌరవానికి వెల కట్టగలరా?

ABN, Publish Date - Nov 15 , 2026 | 10:41 AM

సముద్రంలో దొరికిన బంగారాన్ని నిజాయితీగా అధికారులకు అప్పగించాలనుకున్న ఓ మత్స్యకారుడు.. చివరకు అదే కేసులో నిందితుడిగా మారితే?

Enna Vilai Movie Review

ఎన్న విలై (తమిళం)

నటీనటులు: కరుణాస్, నిమిషా సజయన్, మోహన్ రామన్

రచన, దర్శకత్వం: సజీవ్ పళూర్

నిడివి: 2 గంటల 4నిమిషాలు

ఒక సాధారణ వ్యక్తి ఆత్మగౌరవానికీ, రాజ్యాధికారానికీ చట్టానికీ మధ్య న్యాయ పోరాటంలా కనిపించే నైతిక పోరాటం ఎన్న విలై (Enna Vilai). సముద్రంలో దొరికిన బంగారానికి ధర ఉంటుంది. కానీ ఆ బంగారాన్ని నిజాయితీగా తిరిగి ఇవ్వాలనుకున్న మనిషి ఆత్మగౌరవం ధర ఎంత అనే ప్రశ్న చుట్టూ అల్లుకున్న కథ ఇది. నేరం ఎలా జరిగిందో కథలు కథలుగా చెప్పుకోవడం సులభమే. కానీ ఈ సినిమా ఒక అడుగు ముందుకేసి, అసలు నేరాన్ని ఎవరు సృష్టిస్తారు అని ప్రశ్నిస్తుంది. నేరం చేయని మనిషిని నేరస్థుడిగా మార్చడానికి ఒక వ్యవస్థకు ఎంత సమయం పడుతుంది? తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆ మనిషి జీవితంలో ఎంత భాగాన్ని కోల్పోవాలి? దర్శకుడు సజీవ్ పళూర్ (Sajeev Pazhoor) ఈ ప్రశ్నలతో ఒక సాధారణ మత్స్యకారుడి జీవితంలోకి వెళ్లి, సమాధానాలు వెతికే ప్రయత్నం చేశాడు. దర్శకుడిగా ఇది అతని తొలి చిత్రం.

'ఎన్న విలై' అంటే ఎంత ధర? అని అర్థం. టైటిలే ఒక తాత్విక కేంద్రం. ఆభరణానికి ధర నిర్ణయించొచ్చు. ఒక మనిషి జీవితంలో జరిగిన అవమానానికి ధర ఎలా నిర్ణయిస్తారు? అతడు అనుభవించిన భయానికి ఎవరు పరిహారం చెల్లించాలి? అతడి కుటుంబం ఎదుర్కొన్న అవమానాన్ని ఏ న్యాయస్థానం పూర్తిగా తుడిచి వేయగలదు? ఇక్కడ న్యాయం, పరిహారం రెండూ ఒకటి కావని చెపుతుందీ సినిమా. ఈ నేపథ్యంలో అనేక రాజకీయ, సామాజిక ప్రశ్నలను కూడా సంధిస్తుంది. ఒక పౌరుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి పోరాడాల్సి రావడం వ్యక్తిగత విషాదం. కానీ అలాంటి పోరాటం చేయలేని పౌరుల నిస్సహాయత ప్రజాస్వామిక విషాదం కదా అని కూడా ప్రశ్నిస్తుంది.

రామేశ్వరం సముద్రతీరంలో నివసించే తవసి నిరుపేద మత్స్యకారుడు. సముద్రంలో భక్తులు విసిరే నాణేలను ఏరుకుని పొట్ట పోసు కుంటుంటాడు. ఒకరోజు సముద్రంలో అతడికి విలువైన బంగారు ఆభరణం దొరుకుతుంది. దాన్ని తన దగ్గర ఉంచుకోకుండా నిజాయితీగా అధికారులకు అప్పగించాలనుకుంటాడు. కానీ ఆ నిజాయితీయే అతడికి శాపమవుతుంది. ఒక పోలీసు అధికారి తవసినే నేరంలో ఇరికిస్తాడు. దాంతో తవసికి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయవాది కాంచన అతడి తరపున పోరాడుతుంది. దొరికిన బంగారాన్ని దాచుకుంటే అతడు దొంగ అయ్యేవాడు. తిరిగి ఇవ్వాలనుకున్నందుకు నేరస్థుడిగా మారాడు. అంటే నేరం అనేది కేవలం మనిషి చేసే పని మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో వ్యవస్థ మనిషికి తగిలించే నైతికానైతిక టాగ్ కూడా.

నేరం చేయకపోవడం నిర్దోషిత్వం అని కీర్తించని సమాజంలో, నిజాయితీ కూడా ఒక ప్రమాదకరమైన సాహసమే. ఇదే ఈ సినిమాను భిన్నమైన సినిమాగా మార్చింది. ఈ భావనే సినిమా తాత్విక పునాది. తవసి ఎదుర్కొనే సమస్య కేవలం ఒక తప్పుడు కేసు కాదు. తన మాటను ఇతరులు నమ్మేలా చేసుకోవడం. తాను నిజం చెబుతున్నానని నిరూపించుకోవడం. తాను గౌరవానికి అర్హుడైన మనిషిననే గుర్తింపును తిరిగి సంపాదించుకోవడం. నిన్నటివరకు నిజాయితీపరుడిగా జీవించిన వ్యక్తి, ఒక్క ఆరోపణతో అనుమానాస్పదుడవుతాడు. ఆ అనుమానం నుంచి బయటపడటానికి కోర్టు తీర్పు సరిపోతుందా? ఈ ప్రశ్న సినిమాను సాధారణ న్యాయపోరాట కథ కంటే విస్తృతమైన సామాజిక చర్చలోకి తీసుకెళ్తుంది.

ఒక సామాన్యుడి నిస్సహాయతను గొప్పగా ప్రకటించిన కరుణాస్ (Karunas) నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. తవసి పాత్రలో అతడు ఒక హీరోలా కనిపించడానికి ప్రయత్నించడు. తనకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోవడానికే ఇబ్బందిపడే సామాన్యుడిగా కనిపిస్తాడు. పాత్ర బలహీనతే నటుడి బలం. న్యాయవ్యవస్థ గురించి పెద్దగా తెలియని మనిషి, అదే వ్యవస్థ ముందు తన నిజాయితీని నిరూపించుకోవాల్సి రావడం ఒక విషాదం. ఈ వ్యవహారంలో న్యాయానికి మానవీయ ముఖం కాంచన. తవసి నిస్సహాయతకు భిన్నంగా కాంచనకు చట్టం తెలుసు. వాదించడం తెలుసు. అధికారాన్ని ప్రశ్నించడం తెలుసు. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న పోలిక లాంటి తేడాయే కథనానికి అవసరమైన సంఘర్షణ. ఒకరికి నిజం తెలుసు. కానీ దాన్ని నిరూపించే భాష తెలియదు. మరొకరికి ఆ నిజాన్ని న్యాయస్థానం అంగీకరించే భాషలోకి అనువదించడం తెలుసు. ఈ అర్థంలో కాంచన పాత్రను ఒక న్యాయవాదిగా మాత్రమే కాకుండా, సామాన్యుడి అనుభవానికీ న్యాయవ్యవస్థకీ మధ్య అనుసంధానం. కాంచ‌న‌ పాత్ర‌లో విల‌క్ష‌ణ‌ మ‌ల‌యాళి న‌టి నిమిషా స‌జ‌య‌న్ (Nimisha Sajayan) ఒదిగిపోయింది.

సినిమా నేపథ్యంగా రామేశ్వరం సముద్ర తీరాన్ని ఎంచుకోవడం ఒక ప్రతీకాత్మక ప్రకటన. సముద్రం ఎవరి సొత్తూ కాదు. అయినా సరే సముద్రం ఇచ్చిన వస్తువుపై యాజమాన్య హక్కుల వివాదం మొదలవుతుంది. సముద్రం అడుగున దొరికిన ఆభరణం భూమి మీదికి వచ్చేసరికి నేరానికి కారణమవుతుంది. సముద్రానికి మనుషులు సృష్టించిన చట్టాలు తెలియవు. కానీ సముద్రం మీద ఆధారపడి బతికే మనిషి మాత్రం ఆ చట్టాల బంధనాల నుంచి తప్పించుకోలేడు. ఇక్కడ సముద్రాన్ని స్వేచ్ఛకు ప్రతీకగా, న్యాయ వ్యవస్థను నియంత్రణకు ప్రతీకగా మన ముందుంచాడు దర్శకుడు. బంగారం విలువను నిర్ణయించడానికి తూకం ఉంది. మనిషి గౌరవాన్ని తూచడానికి మాత్రం ఏ వ్యవస్థ దగ్గరా సరైన తరాజు లేదు. ఆ తరాజు కోసం వెతికే ప్రశ్నే 'ఎన్న విలై'. సమాధానం కన్నా ప్ర‌శ్నే ఎక్కువ కాలం వెంటాడే సినిమా ఇది. సెన్సార్ స‌ర్టిఫికెట్ విష‌యంలో కొద్ది స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్ప‌టికీ ప‌లు సినిమా అవార్డ్ ఈవెంట్ల‌లో ప్ర‌ద‌ర్శిత‌మై ప్ర‌శంస‌లు, అవార్డులు సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix ) ఓటీటీలో అందుబాటులో ఉండ‌గా నెల రోజులకు పైగా దేశ వ్యాప్తంగా ఇప్ప‌టికీ టాప్ టెన్‌లోనే కొన‌సాగుతుండడం విశేషం.

Updated Date - Nov 15 , 2026 | 11:54 AM