సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Killer Review: కిల్లర్ మూవీ ఎలా ఉందంటే..

ABN, Publish Date - Oct 30 , 2026 | 07:20 PM

జ్యోతి పూర్వజ్‌ ప్రధాన పాత్ర పోషించిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కిల్లర్‌'. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం.

సినిమా రివ్యూ: కిల్లర్‌ (Killer Movie)

విడుదల తేది: 30-10-2026

జ్యోతి పూర్వజ్‌ ప్రధాన పాత్ర పోషించిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కిల్లర్‌’. మనీష్‌ గిలాడ, చంద్రకాంత్‌, అయినాబత్తిన దశరథ మాధవ్‌, విశాల్‌ రాజ్‌, అర్చన అనంత్‌, గౌతమ్‌ చక్రధర్‌ కొప్పిశెట్టి కీలక పాత్రధారులు. పూర్వజ్‌ దర్శకత్వం వహించడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. జ్యోతి పూర్వజ్‌ హాట్‌హాట్‌ ఫొటో షూట్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో సినిమాను ప్రమోట్‌ చేసి బజ్‌ క్రియేట్‌ చేశారు. ఇంటర్‌వెల్‌ వరకూ సినిమా చూసి సినిమాలో మేజర్‌ ట్విస్ట్‌ ఏంటో కనిపెట్టిన వారికి రూ. కోటి బహుమతి అని ప్రకటించగానే జనాలు ఈ సినిమాపై కాస్త ఆసక్తి చూపించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

రానియా (జ్యోతి పూర్వజ్‌) సినిమా రైటర్‌. ఓ ప్రమాదం వల్ల కోమాలోకి వెళ్లిపోతుంది. ఆమెను మామూలు మనిషిని చేయాలని ఆమె తమ్ముడు కార్తీక్‌ (చందు) తాపత్రయపడుతుంటాడు. ట్రీట్‌మెంట్‌ పేరుతో ఎంత చేసినా ఫలితం దక్కదు. సైంటిస్ట్‌ డాక్టర్‌ పూర్వజ్‌ దగ్గరకు తీసుకెళ్తే ఏదన్నా పరిష్కారం దొరుకుతుందని తెలుసుకుని కార్తీక్‌ అతని దగ్గరకు తీసుకెళతాడు. ఆమెకి మళ్లీ లైఫ్‌ ఇస్తానంటాడు సైంటిస్ట్‌ పూర్వజ్‌. అతను చేసే ప్రయోగం సక్సెస్‌ అయితే ఆమె దేవతలా మారిపోతుందని చెబుతాడు. పూర్వాజ్‌ కనిపెట్టిన రూట్‌ ఏఐ చిప్‌ను వ్యక్తి మెదడులో అమర్చి ఆ మనిషిని అసాధారణ వ్యక్తిగా మార్చే ప్రయత్నం చేస్తుంటాడు. దీనికి సంబంధించి ఓ అడవిలో సీక్రెట్‌ ల్యాబ్‌ నిర్మించి ప్రయోగాలు చేస్తుంటాడు. అయితే అతని ప్రయోగాలను ప్రభుత్వం ఆమోదించకపోగా.. ఆ ల్యాబ్‌ను బ్యాన్‌ చేస్తుంది. అయినా పూర్వజ్‌ దానిని రహస్యంగా నిర్వహిస్తుంటాడు. ఆకాశం నుంచి పడిన ఉల్కలాంటి ఓ పదార్థం పూర్వజ్‌ కు దొరుకుతుంది. దానిపై అతను ప్రయోగాలు చేస్తుంటాడు. దానిని, రానియాని, ఏఐని మిక్స్‌ చేసి ఏదో సాధించాలనుకుంటాడు. ఇదిలా ఉండగా రానియాకు సంబంధించిన ఓ కేసును పోలీసులు విచారిస్తుంటారు. ఆమెని చూసిన ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. ఆమె ఒక రచయిత, టెర్రరిస్ట్‌, స్పై, యాక్ట్రస్‌, వాంపైర్‌ అని అంటుంటారు. ఇంతకీ రచయితగా పరిచయమైన రానియా ఇన్ని రకాలుగా ఎందుకు కనిపించింది.. ఆమె మళ్లీ మామూలు మనిషి అయిందా? పూర్వజ్‌ ప్రయోగాలు ఫలించాయా? లేదా? అన్నది కథ.


విశ్లేషణ:

న్యూరాలింక్‌ పేరుతో మెదడులో చిప్స్‌ అమర్చడం, మనిషి మెదడుపై ప్రయోగాలు చేయడం వంటి అంశాలను ప్రేరణగా తీసుకొని ఈ సినిమా రూపొందించారు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా వరుసగా వివిధ క్యారెక్టర్లు రావడం.. ఒక్కొక్కరినీ చంపేయడం, అలాగే పూర్వజ్‌ ఎంక్వయిరీ, మహిళా రైటర్‌ను బతికించడం కోసం చేసే ప్రయత్నాలు వంటి సన్నివేశాలతో ముగుస్తుంది. విరామ సమయానికి బలమైన ట్విస్ట్‌ ఏదన్నా వస్తుందనే ఆసక్తి కలిగించినప్పటికీ, ఆ ఉత్కంఠను పూరిస్థాయిలో దర్శకుడు నిలబెట్టలేకపోయాడు. హీరోయిన్‌ వరుసగా డిఫరెంట్‌ యాంగిల్స్‌లో కనిపించడం కాస్త కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది. ఈ సన్నివేశాలన్నీ ప్రేక్షకుడిని కుంపటి మీద కూర్చోబెట్టినట్టే ఉంటుంది. ఇక ద్వితీయార్థంలో ఒక్కొక్క ట్విస్ట్‌ రివీల్‌ చేయడంతో సినిమాపై కాస్త ఆసక్తి కలుగుతుంది. అక్కడక్కడా థ్రిల్లింగ్‌ అంశాలు కూడా కనిపిస్తాయి. క్లైమాక్స్‌ మాత్రం కాస్త ఆసక్తికరంగా అర్థవంతంగా తెరకెక్కించారు. పార్ట్‌ 2కి లీడ్‌ ఇచ్చారు.

నటీనటులు.. సాంకేతిక నిపుణుల పనితీరు..

జ్యోతి నటిగా ఆకట్టుకున్నారు. రచయిత, స్పై, వాంపైర్‌, టెర్రరిస్ట్‌... ఇలా వరుసగా పాత్రలు రావడం కాస్త గజిబిజికి గురిచేసినా నటిగా మాత్రం మెప్పించారు. దర్శకుడు పూర్వజ్‌ సైంటిస్ట్‌గా కాస్త అతి చేసిన భావన కలుగుతుంది. చందు, దశరధ్‌ మాధవ్‌ పాత్రల పరిధి మేరకు నటించారు. జగదీష్‌ బొమ్మిశెట్టి కెమెరా వర్క్‌ బావుంది. ఆశీర్వాద్‌, సుమన్‌ జీవా సంగీతం సినిమాకు ప్రధాన బలం. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఆర్ట్‌ వర్క్‌ ఫర్వాలేదు. ఎడిటింగ్‌ క్రిస్ప్‌గా లేదు. నిర్మాణ పరంగా, టెక్నికల్‌గా సినిమా బావుంది. సైన్స్‌ ఫిక్షన్‌ పాయింట్‌కు థ్రిల్లర్‌ అంశాలు జోడించి కథ రాయడం మంచి ఆసక్తికర ఆలోచనే. కానీ దానిని అంతే థ్రిల్లింగ్‌గా తెరపై కూడా చూపించగలగాలి. ఆ విషయంలో దర్శకుడు విఫలం అయ్యాడు. బహుశా దర్శకుడే ఇందులో సైంటిస్ట్‌గా కీలక పాత్ర పోషించడంతో ఇటు దర్శకత్వం.. అటు నటన.. నిర్మాణం ఇవన్నీ ఒత్తిడిని కలిగించినట్లు ఉన్నాయి. అందుకే దర్శకుడు రాసుకున్న సీన్లు బావున్నా.. తెరపై వాటిని ఆసక్తికరంగా మలచలేకపోయారు. సైంటిఫిక్‌ థ్రిల్లర్స్‌ ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చవచ్చు కానీ.. ప్రయోగాలతో సాగిన ఈ కథ మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించడం కష్టమే!

ట్యాగ్‌లైన్‌: థ్రిల్‌ లేని కిల్లర్‌..

రేటింగ్‌: 2/5

Updated Date - Oct 30 , 2026 | 07:46 PM