సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Itlu Arjuna Review: 'ఇట్లు అర్జున' ఎలా ఉందంటే

ABN, Publish Date - Nov 13 , 2026 | 06:42 AM

'శిరిడిసాయి', 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాల నిర్మాత ఎ.మహేశ్‌రెడ్డి తనయుడు అనీశ్‌ హీరోగా పరిచయమైన చిత్రం 'ఇట్లు అర్జున’. మలయాళ నటి అనశ్వర రాజన్‌ కథానాయిక. మహేశ్‌ ఉప్పల దర్శకుడు. అక్కినేని నాగార్జున సమర్పణలో దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా రివ్యూ: ఇట్లు అర్జున
విడుదల తేది: 13–11–2026


 'శిరిడిసాయి', 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాల నిర్మాత ఎ.మహేశ్‌రెడ్డి తనయుడు అనీశ్‌ హీరోగా పరిచయమైన చిత్రం 'ఇట్లు అర్జున’. మలయాళ నటి అనశ్వర రాజన్‌ కథానాయిక. మహేశ్‌ ఉప్పల దర్శకుడు. అక్కినేని నాగార్జున సమర్పణలో దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్‌ హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అఖిల్‌ ఈ సినిమాను ప్రమోట్‌ చేయడంతో బజ్‌ క్రియేట్‌ అయింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. హీరోగా పరిచయమైన అనీశ్‌కి ఈ సినిమా విజయం అందించిందా? ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పించింది అన్నది చూద్దాం.

కథ:

అర్జున్‌ (అనీశ్‌) చిన్నప్పటి నుంచి మూగవాడు. దొంగగా ఎదుగుతాడు. అనారోగ్యంతో తండ్రి మరణించడంతో అతనికి ఇచ్చిన మాట కోసం దొంగతనాలకు చెక్‌ పెడతాడు. తను ఉండే అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్న కీర్తి (అనశ్వర రాజన్‌) అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి ప్రేమ. కానీ ఆమెకు ఎప్పుడు ఎదురుపడడు. అనుకోకుండా ఓ రోజు కీర్తికి సాయం చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. అది ప్రేమగా మారుతుంది. కానీ ఒకరికొకరు ఎక్స్‌ప్రెస్‌ చేరుకోరు. ఇదిలా ఉంటే.. పెద్దన్న (ముఖేష్‌రిషి) హైదరాబాద్‌ సిటీలో పెద్ద డాన్‌. తన కొడుకు జైసల్మీర్‌లో రూ.1000 కోట్ల హవాలా మనీ డీల్‌కి సంబంధించిన పెన్‌ డ్రైవ్‌, పాస్‌వర్డ్‌ కోసం వెళ్లి మరణిస్తాడు. హెల్మెట్‌ ధరించిన ఓ యువకుడు అతన్ని హతమార్చుతాడు. దాంతో పెద్దన్న తన కొడుకుని ఎవరు చంపారో తెలుసుకుని పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఆ కేస్‌ ట్రేస్‌ చేస్తున్న సమయంలో పెద్దన్న అనుచరుడు గౌరి, పోలీస్‌ అధికారి ఇరానీలకు అర్జున్‌పై అనుమానంతో కలగడంతో అతని వెంటపడతారు. అసలు వెయ్యి కోట్ల హవాలా మనీ కథేంటి? ఆ హెల్మెట్‌ ధరించిన కుర్రాడు ఎవరు? అర్జున్‌కి దీనికి ఏమైనా సంబంధం ఉందా?  చివరికి అర్జున్‌, కీర్తి ఒకటయ్యారా? లేదా అన్నది కథ.

విశ్లేషణ:
వెయ్యి కోట్ల హవాలా మనీ, దానికి సంబంధించి పెన్‌డ్రైవ్‌ చుట్టూ తిరిగే కథ ఇది. అలాగే ఒక మూగవాడి ప్రేమకథకు కాస్త రొమాంటిక్‌ టచ్‌ ఇచ్చి యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఫస్టాఫ్‌ అంతా మూగవాడైన హీరోకు హీరోయిన్‌ పరిచయం తన ప్రేమను ప్రేయసికి వ్యక్తపరచడం.. తద్వారా పడే పాట్లతో సరదాగా సాగుతుంది. అయితే అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ప్రీ ఇంటర్వెల్‌ నుంచి కథ ఆసక్తిగా మారి సెకెండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ పెంచుతుంది. అక్కడి నుంచి కథ అంతా పెన్‌ డ్రైవ్‌ చుట్టూనే తిరుగుతుంది. ఆ తర్వాత హీరోకి ఎదురైన సవాళ్లతో కథ థ్రిల్లర్‌గా మారుతుంది. మూగవాడైన హీరోకి ఎదురైన సవాళ్లను ఎలా అఽధిగమించాడు? తన ప్రేయసిని సొంతం చేసుకోవడానికి ఏం చేశాడు అన్నది దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. ఫైనల్‌గా ఇచ్చిన ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. సెకెండాఫ్‌లో కాస్త స్లోగా అనిపించింది. ముగింపు సమయానికి కథంతా కీలకంగా తిరిగిన వెయ్యి కోట్ల సంగతి పక్కన పెట్టేసినట్లయింది. వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీ అక్కడక్కడా నవ్వులు పూయించారు. పెద్దన్న కోటలో సాగిన క్లైమాక్స్‌ 30 నిమిషాలు ఉత్కంఠగా సాగుతుంది.  

నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు..
హీరోగా అనీశ్‌కి తొలి చిత్రమిది. పరిచయ చిత్రానికి మూగవాడి పాత్రను ఎంచుకోవడం ఒక సవాల్‌. సాధారణంగా తొలి సినిమా అనగానే హీరోగా నిరూపించుకోవాలనుకుంటారు. కానీ మూగవాడి పాత్రతో అది సాధ్యం కావడం ఒక రకంగా కష్టమే! కానీ అనీశ్‌ దానిని సాధ్యం చేసి చూపించారు. అర్జున్‌ పాత్రకు మాటలు రాకపోయినా హవభావాలతో చక్కగా పాత్రను పండించాడు. డాన్స్‌, యాక్షన్‌ సీన్స్‌కు న్యాయం చేశారు. లవ్‌ సీన్స్‌లో అతని భావాలను సైగలతో ఎక్స్‌ప్రెస్‌ చేసిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్‌గా అనశ్వర తెలుగులో సైన్‌ చేసిన మొదటి చిత్రమిది. కానీ రెండో సినిమాగా విడుదలైంది. ఇందులో కీర్తి అనే అమ్మాయిగా చక్కని నటన కనబర్చింది. అయితే తన గత చిత్రంతో పోల్చితే ఈ సినిమాలో నటనకు అంత స్కోప్‌ దొరకలేదనిపించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. పెద్దన్న పాత్రలో ముఖేశ్‌ రిషి ఎప్పటిలాగే క్రూయల్‌గా మెప్పించారు. బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌ కాసేపు నవ్వించారు. గౌరి పాత్రధారి కలయరసన్‌ నటన బావుంది. మైమ్‌ గోపి తళుక్కుమన్నారు. మిగతా పాత్రధారులు అంతా తమ పరిధిమేరకు ఫర్వాలేదనిపించారు. సాంకేతిక విభాగానికి వస్తే.. కెమెరా వర్క్‌ నీట్‌గా ఉంది. మాటలు బాగానే రాశారు. హీరోకు మాటలు రాకపోయినా అతని భావాలు తెలియచెప్పడంతో నేపథ్య సంగీతం ఉపయోగపడింది. రెండు పాటలు బావున్నాయి. ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం సినిమాకు ఎసెట్‌. వెంకీ కుడుముల నిర్మాణ విలువలు బావున్నాయి. దర్శకుడికి ఇది తొలి చిత్రమే అయినా ఎక్కడా తడబాటు కనిపించలేదు. అయితే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించాయి. చిన్న లవ్‌స్టోరీకి, క్రైమ్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను జోడించి చెప్పిన విధానం బావుంది. సినిమా మొత్తం.. వెయ్యి కోట్ల హవాలా మనీ చుట్టూ తిరిగినా.. చివరికి దానిని ఓ పక్కన పెట్టేయడం వెనుక కారణమేంటనేది దర్శకుడికే తెలియాలి. బహుశా సీక్వెల్‌కి అది లీడ్‌ అనుకోవాలేమో. లవ్‌ క్రైమ్‌ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్‌లైన్‌: లవ్‌.. క్రైమ్‌ థ్రిల్లర్‌..
రేటింగ్‌:
2.75/5

Updated Date - Nov 13 , 2026 | 07:19 AM