I Am Game Review: దుల్కర్ సల్మాన్ 'ఐమ్ గేమ్’ ఎలా ఉందంటే
ABN, Publish Date - Sep 04 , 2026 | 04:58 PM
దుల్కర్ సల్మాన్ నటించి, జోమ్ వర్గీస్‌తో కలిసి నిర్మించిన చిత్రం 'ఐమ్ గేమ్’. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి నహాస్ హిదయత్ దర్శకత్వం వహించారు. కయాదు లోహర్ కథానాయిక. మిస్కిన్, అంటోని వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ ఫోర్ట్ కీలక పాత్రధారులు. ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
సినిమా రివ్యూ: ఐమ్ గేమ్ ( I Am Game Review)
విడుదల తేది: 04–09–2026
దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. దుల్కర్ మలయాళంలో నటించిన ప్రతీ సినిమా తెలుగులోనూ అనువాదమవుతోంది. తాజాగా ఆయన నటించి, జోమ్ వర్గీస్ తో కలసి నిర్మించిన చిత్రం ‘ఐమ్ గేమ్’. ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి నహాస్ హిదయత్ దర్శకత్వం వహించారు. కయాదు లోహర్ కథానాయిక. మిస్కిన్, అంటోని వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ ఫోర్ట్ కీలక పాత్రధారులు. గురువారం రిలీజ్ కావాల్సిన ఈమూవీ సాంకేతిక కారణాలతో ఆలస్యంగా ఫస్ట్ షో నుంచి తెలుగువారికి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటోందో చూద్దాం.
కథ:
హైదరాబాద్‌లో .. ఓ మిలయనీర్ వారసుడైన డ్యాన్ (దుల్కర్ సల్మాన్) తన తండ్రి సాయం లేకుండా డబ్బులు సంపాదించి తన కాళ్ల మీద తాను నిలబడాలని అనుకుంటుంటాడు. కానీ వ్యాపారంలో పీకల్లోతూ అప్పుల్లో మునిగిపోతాడు. అప్పుల వాళ్ల నుంచి నిత్యం బెదిరింపులు రావడమే గాక ఓ మారు ఆఫీసుకే వచ్చి డ్యాన్‌పై అందరి ముందే దాడి చేస్తారు. దాంతో తండ్రి సైతం మందలిస్తాడు. ఈ క్రమంలో ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని అమ్మ ఇచ్చిన డబ్బును బెట్టింగ్‌లో పెట్టి నష్టపోతాడు. అది జీర్ణించుకోలేని డ్యాన్ నిర్వాహకులను భయపెట్టి తన డబ్బుతో తప్పించుకునే క్రమంలో ఓ తీవ్ర ప్రమాదానికి గురై తన చేతిని కోల్పోతాడు. అదే సమయంలో డోనర్ దొరకడంతో చేతిని ఆపరేషన్ చేసి డ్యాన్‌కు అతికిస్తారు. ఆ క్రమంలో అతనికి ఫిజియోథెరపీ చేయడానికి వచ్చిన ఇషా (కయాదులోహర్)తో ఏర్పడిన పరిచయం, ఆమె సాయంతో త్వరగా కోలుకుంటాడు. అయితే అప్పుడే కథ మరో మలుపు తిరుగుతుంది. తనకు అతికించిన చేయితో కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. అది డ్యాన్ ఆధీనంలో ఉండకుండా విపరీతంగా ప్రయత్నిస్తుంటుంది. డ్యాన్ దానిని అదుపులో పెట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కంట్రోల్‌లోకి రాదు. ఓ రోజు డ్యాన్ బెట్టింగ్ కోసం వెళ్లగా అక్కడ అతని ప్రమేయం లేకుండానే డేవిడ్ అనే పెద్ద బిజినెస్ మ్యాన్‌ను చంపేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు అతికించిన చేయి ఎందుకు అలా చేసింది, దాని వెనక దాగి ఉన్న కథేంటి చివరకు ఏ స్థాయి వరకు ఈ సమస్య వెళ్లింది.. దానికి పరిష్కారం దొరికిందా లేదా అనేదే కథ.
విశ్లేషణ:
మనం ఇప్పటివరకు చనిపోయిన ఓ మనిషి ఆత్మ వచ్చి ఒకరి సాయంతో తన పగ తీర్చుకోవడం నేపథ్యంలో వందల సినిమాలు దశాబ్దాలుగా చూశాం.. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఇటీవల తెలుగులో వచ్చిన చెన్నై లవ్‌స్టోరి సైతం ఈ తరహా జానర్‌కు చెందిందే. అయితే.. ఈమూవీలో కాస్త భిన్నంగా ప్రయత్నించారు. కుక్క పిల్ల, సబ్బు బిళ్ల , అగ్గిపుల్ల కాదేదీ కవిత కనర్హం అన్న తరహాలో రాను రాను ఆత్మ ప్రవేశాలకు కూడా కాదేది అడ్డంకి.. కారు, స్కూటర్, వాటరు అని అనుకోవడం తప్పేలా లేదు. సరిగ్గా ఆ కోవలోనే ఈ సినిమా రూపొందింది. ఇన్నాళ్లు మనిషి ఆత్మలు వచ్చి పగలు, కోరికలు తీర్చుకోగా ఇందులో మాత్రం చనిపోయిన వ్యక్తి చేయి రివేంజ్ తీసుకోవడం కొత్త నేపథ్యంగా తీసుకున్నారు. ఇప్పటికే వెడ్నస్ డే అనే హాలీవుడ్ సిరీస్‌లో ఎంతో పాపులర్ అయిన థింగ్ క్యారెక్టర్‌ను ప్రేరణగా తీసుకున్నట్లు అర్థమవుతుంది. అతికించిన చేయి తన అధీనంలో లేదని తెలిసినప్పటి నుంచి దానిని తన కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు డ్యాన్ చేసే ప్రయత్నాలు అందుకు ఆ చేయి తీవ్రంగా ప్రతి ఘటించే సన్నివేశాలలో దుల్కర్ నటన ఆకట్టుకుంటుంది. ఓ సందర్భంలో అపరిచితుడులో విక్రమ్‌ను కూడా గుర్తుకు చేస్తాడు. కానీ ఫస్టాఫ్ అంతా ఎక్కడా బోర్ లేకుండా రేసిగా, రసవత్తరంగా సాగిన సినిమా సెకండాఫ్‌లో నెమ్మదిస్తుంది. ఫ్లాష్‌బాక్ ఎపిసోడ్ చాలా సమయం తినేస్తుంది. అదీగాక అంత ఇంపార్టెంట్ రోల్‌లో ఎవరికీ తెలియని (ఆంటోనీ వర్గీస్) నటుడిని తీసుకోవడం ఆశ్చర్యమేస్తుంది. ఆ ఫ్లేస్‌లో కాస్త గుర్తింపు ఉన్న యంగ్ హీరో ఎవరినైనా పెట్టి ఉంటే సినిమాకు ఇంకా అదనపు బలం చేకూరేది. అంతేగాక సెకండాఫ్ దుల్కర్ స్క్రీన్ టైం తక్కువ ఉండడం ఆయన ఫ్యాన్స్‌కు అంతగా రుచించదు. కాగా సినిమా ఆసాంతం హైదరాబాద్ నేపథ్యంలోనే సాగడంతో పాటు ఎక్కువగా దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి, ఉప్పల్ స్టేడియం సన్నివేశాలు కనిపిస్తూ ప్రేక్షకులకు ఓ డబ్బింగ్ సినిమా చూస్తున్నామనే భావన ఏ కోశాన రాదు. అంతేగాక తెలుగు నటులైన కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి చిన్న క్యామియోలో దర్శన మివ్వగా, కాలకేయ ప్రభాకర్ అప్పు ఇచ్చిన డాన్‌గా ఆకట్టుకున్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
డ్యాన్ పాత్రలో దుల్కర్ చక్కగా ఒదిగిపోయాడు. కుడి చేతికి అతనికి మధ్య సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. ఇషా పాత్రలో కయాదు లోహర్ పర్వాలేదనిపించింది. ఆంటోనీ వర్గీస్ క్రికెటర్గా బాగా చేశారు. మిస్కిన్ కు రొటీన్ పాత్రే ఇది. సంయుక్త విశ్వనాథన్ పరిధి ఓకె. మెర్సీ పాత్రలో జయసుధ తన మార్క్ చూపించారు. టెక్నికల్ విషయాలకొస్తే… జేక్స్ బిజోయ్ సంగీతం సినిమాకు ఎంతో ప్లస్ అయింది. చాలా చోట్ల సన్నివేశాలను ఎలివేట్ చేసింది. సెకెండాఫ్ నిడివి ఎక్కువై కాస్త బోర్ కొడుతుంది. కెమెరా వర్క్ బాగుంది. సినిమా అంతా రిచ్ గా ఉంది. ఆత్మ ఆవహించడం పాత పాయింటే అయినా చెయ్యి పగ తీర్చుకోవడమనే పాయింట్, దానిని తెరకెక్కించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి కథలను తెరపై ఎంత వైవిధ్యంగా చెప్పామనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. ఫస్టాఫ్ ను ఎంగేజింగ్గా తెరకెక్కించిన దర్శకుడు సెకెండాఫ్లో దారితప్పాడు. రొటీన్ రివేంజ్ డ్రామా అయినా పలు చోట్ల ఆకట్టుకుంటుంది. సినిమాకు ప్రచారం లేకపోవడం, లేట్ గా రిలీజ్ కావటం పెద్ద మైనస్. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి విషయాల్లో కేర్ ఫుల్ గా ఉండాలి. లేకుంటే బాగుందనే టాక్ వచ్చినా ఈ సినిమాలాగే మిస్ ఫైర్ అవటం ఖాయం.
ట్యాగ్లైన్: రొటీన్ గేమ్
రేటింగ్: 2.75/5