Hanuman Ansh Review: హనుమాన్ అంశ్.. ఎలా ఉందంటే?
ABN, Publish Date - Oct 09 , 2026 | 02:01 PM
కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ చిత్రానికి లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని హోంబలే ఫిలిమ్స్ సంస్థ శుక్రవారం దీనిని తెలుగులో విడుదల చేసింది.
ఆధ్యాత్మిక గురువులు, బాబాల మీద సినిమాలు భారతదేశంలో కొత్తేమీ కాదు. అయితే అలాంటి చిత్రాలన్నీ ఆదరణ పొందుతాయని చెప్పలేం. తెలుగులోనూ షిర్డీ సాయిబాబా మీద పలు చిత్రాలు వచ్చాయి. విజయ చందర్ సాయిబాబాగా కె. వాసు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ ఘన విజయం సాధించి, చరిత్ర సృష్టించింది. ఆ స్థాయి విజయాన్ని సాయిబాబా మీద వచ్చిన మరే చిత్రమూ పొందలేదు. ఇక్కడ ఆధ్యాత్మికత కంటే కూడా ఆ కథను చెప్పిన విధానం ప్రధానం. తాజాగా ఉత్తర భారతానికి చెందిన ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబాపై వచ్చిన ‘హనుమాన్ అంశ్’ ఈ విషయంలో మెరుగైన ఫలితాన్ని పొందింది. ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh) 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ చిత్రానికి లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని హోంబలే ఫిలిమ్స్ సంస్థ శుక్రవారం దీనిని తెలుగులో విడుదల చేసింది. ఈ సినిమా పంపిణీ భాధ్యతలను మైత్రీ మూవీ మేకర్స్ స్వీకరించింది.
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి మూలం ‘డివైన్ డిటోర్: దట్ ఛేంజ్డ్ మై లైఫ్’ అనే పుస్తకం. 1900 సంవత్సరంలో లక్ష్మణ్ నారాయణ శర్మగా జన్మించి, ఆ పైన ఆధ్యాత్మిక బాట పట్టి, నీమ్ కరోలీ బాబాగా ప్రసిద్ధుడైన ఓ సాధువు కథ ఇది. పదకొండేళ్ళ వయసులో ఇల్లు వదిలి దేశాటన జరిపి, పలువురు బాబాలు, సాధుసంతులను దర్శించుకుని వారి ద్వారా ఆధ్యాత్మిక శిక్షణను పొందిన నీమ్ కరోలీ బాబా (Neem Karoli Baba) జీవిత గమనాన్ని ఈ సినిమాలో చూపించారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన లక్ష్మీనారాయణ, ఆమె దేవుడు దగ్గరకు వెళ్ళిందని భావిస్తాడు. తాను సీతారాములను ధ్యానించి, తల్లి దగ్గరకు చేరాలనుకుంటాడు. సీతారాముల పరమ భక్తుడైన హనుమంతుడిని పూజిస్తే తన కోరిక నెరవేరుతుందని నమ్ముతాడు. అందుకోసం దేశ సంచారం మొదలు పెడతాడు. భవబంధాలకు దూరం కావాలని అతను భావించినా, చిన్నప్పుడు చేసిన బాల్య వివాహం కారణంగా తిరిగి స్వగ్రామం రావాల్సి వస్తుంది. అయితే తన మనసులోని మాటను భార్యకు చెప్పి, ఆమె నుంచి సెలవు తీసుకుని తిరిగి నీమ్ కరోలికి చేరతాడు. అక్కడ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన బాబా.. స్థానిక వ్యక్తుల మధ్య వచ్చిన గొడవల కారణంగా ఆ ఊరు కూడా వదిలి మరింత ముందుకు సాగుతాడు. ఈ క్రమంలో ఆయన సాంగత్యంలోకి వచ్చిన వ్యక్తుల జీవితాల్లో జరిగిన మహిమలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు.
సినిమాలోని ఓ సన్నివేశంలో బాబా ధాన్యంలో ఉండగా పాములు చుట్టుకుని ఉన్న ఆయన్ని చూస్తే ‘పరమశివుడులా అనిపించారు’ అని ఓ శిష్యుడు చెబుతాడు. దానికి బాబా చిరునవ్వుతో ‘నీ మనసులో ఏమనుకుంటే అదే నీకు బయట కూడా కనిపిస్తుంది. అంతకు మించి ఇంకేమీలేదు’ అని సర్ది చెబుతాడు. ఇలాంటి భక్తి ప్రధాన చిత్రాలలోని మహత్యాలూ అలాంటివే. నమ్మేవారిని అవి పూర్తి స్థాయిలో మెస్మరైజ్ చేస్తాయి. వాటి పట్ల నమ్మకం లేని వారికి ఇదో సినిమాటిక్ సీన్ అనిపిస్తుంది. ఈ సినిమాలో చూపించిన అద్భుతాలన్నీ బాబా చేసినవిగా కాక, ఆయన భక్తులు భావించినట్టుగానే చూపించారు. బాబా స్వయంగా మహత్యాలను చేసినట్టుగా ఎక్కడా చూపించలేదు. భారతదేశంలోని సాధుసంతులకు ఉన్న శక్తులు, మహిమల గురించి అవగాహన ఉన్నవారు ఇందులోని సన్నివేశాలతో మమేకం అవుతారు. బహుశా ఉత్తర భారతంలో ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకోవడానికి కారణం అదే కావచ్చు. (Hanuman Ansh Review)
చిత్రం ఏమిటంటే.. ‘హనుమాన్ అంశ్’ విడుదలైనప్పుడు దీని ఉనికిని గుర్తించడానికి కూడా ఇష్టపడని సినిమా రంగానికి చెందిన ప్రముఖులు, ట్రేడ్ వర్గాల నిపుణులు ఇప్పుడు దీనిని ఉదహరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీనిని బాబా మహత్తు అనుకునే కంటే.. ఆయన్ని నమ్మిన భక్తుల విశ్వాస ఫలితం అనుకోవడం సబబుగా ఉంటుంది. అయితే ఉత్తరాదిలో జరిగిన మ్యాజిక్ దక్షిణాదిలోనూ జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి ‘అన్నమయ్య, శ్రీరామదాసు’ చిత్రాలతో ఉత్తరాది వారు ఎలాగైతే కనెక్ట్ కాలేదో.. నీమ్ కరోలీ బాబా జీవిత గాథను దక్షిణాది వారు ఓన్ చేసుకోవడం కూడా కొంత కష్టమే! ఏదైనా మ్యాజిక్ జరిగితే చెప్పలేం!
ఇక నటీనటుల విషయానికి వస్తే... నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినవ్ సత్య చక్కగా ఒదిగిపోయారు. ఇతర ప్రధాన పాత్రలను చందన్ కె ఆనంద్, నిఖిల్ దుబే, అనిల్ రాస్తోగీ, సుగంధా మల్హోత్రా, భగవాన్ దాస్ పటేల్, నేహా పరాంజపే తదితరులు పోషించారు. నటీనటుల సహజ నటనతో పాటు సాధు సుశీల్ తివారి తన నేపథ్య సంగీతంతో ఈ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. దర్శకుడు విశాల్ చతుర్వేది తన స్క్రీన్‌ప్లేతో సినిమాను ఆసక్తికరంగా మలిచారు. అయినా కొన్నిచోట్ల మాత్రం కథ నత్తనడకలో సాగడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అలానే సినిమా అర్థాంతరంగా ఆగిపోయిన భావన కూడా కలుగుతుంది. మేకర్స్ ఈ మూవీని మూడు భాగాలుగా నిర్మించాలని భావించటమే అందుకు కారణం కావచ్చు. మిగిలిన రెండు భాగాల కోసం ఇక్కడ కామా పెట్టారని అనుకోవాలి. ఉత్తర భారతీయులను అంతగా ఆకట్టుకున్న అంశాలు ఇందులో ఏమున్నాయనే భావనతో ‘హనుమాన్ అంశ్’ చిత్రం చూడటానికి వెళ్ళినవారు చాలా వరకూ నిరాశకు గురి కావచ్చేమో కానీ.. సాధుసంతుల జీవితాలలోని అద్భుతాల ఆవిష్కరణను చూడాలనుకుని థియేటర్లకు వెళ్ళేవారికి మాత్రం ‘హనుమాన్ అంశ్’ నచ్చుతుంది.
రేటింగ్: 2.5/5
ట్యాగ్‌లైన్: ఆధ్యాత్మిక మార్గంలో...