Haiku Review: సినిమా రివ్యూ: హైకూ
ABN , Publish Date - Oct 23 , 2026 | 08:58 AM
'కోర్ట్' ఫేం శ్రీదేవి, ఏగెన్, ఫెమినా జార్జ్ కీలక పాత్రధారులుగా తెరకెక్కిన తమిళ చిత్రం 'హైకూ’. దీనికి యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
సినిమా రివ్యూ: హైకూ (Haiku Review)
విడుదల తేది: 23–10–2026
'కోర్ట్' ఫేం శ్రీదేవి, ఏగెన్, ఫెమినా జార్జ్ కీలక పాత్రధారులుగా తెరకెక్కిన తమిళ చిత్రం 'హైకూ’. దీనికి యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహించారు. అరుళానందన్, మ్యాథ్యూ అరుళానందన్ నిర్మాతలు. శుక్రవారం ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
మనోహర్ (ఏగన్) ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. కో ఎడ్యుకేషన్ కాలేజ్‌లో చేరిన ఏకైక కుర్రాడు. తరచూ అమ్మాయిల చేత ర్యాగింగ్‌కు గురవుతుంటాడు. అదే సమయంలో కొడి (కోర్టు ఫేమ్ శ్రీదేవీ)తో పరిచయం ఏర్పడుతుంది. అది స్నేహంగా.. ఆపై ప్రేమగా మారుతుంది. అయితే కొడి ఇంటిలో కులం, అంతస్తు లాంటి పట్టింపులెక్కువ. అయినా ధైర్యం చేసి మనోహర్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మనోకి చదువు పూర్తి కావడంతో ఉద్యోగ ప్రయత్నాల కోసం కోయంబత్తురు నుంచి చెన్నైకి చేరతాడు. చిన్న చిన్న మాట పట్టింపులతో కొడి మనోకి దూరమవుతుంది? వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. ఇతను మాత్రం ఆమె జ్ఞాపకాలతోనే జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఇక ఎన్నో ప్రయత్నాల తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు మనో. అక్కడ అప్రెంటీస్ చేరిన నివేదా (ఫెమినా జార్జ్)తో పరిచయం పెరుగుతుంది. తెలియకుండానే ఇద్దరూ ప్రేమలో పడతారు. కొన్నాళ్లు ఇద్దరి మధ్య బంధం బలంగా ఉండి.. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో పాత కథ మాదిరిగానే మళ్లీ బ్రేకప్ వరకూ వస్తుంది. అప్పుడు కొడితో బ్రేకప్ కావడానికి.. ఇప్పుడు నివితో బ్రేకప్ కావడానికి ఒకటే కారణం.. అదేంటి? అసలు కొడి మనోని ఎందుకు వద్దనుకుంది? ఫైనల్‌గా మనో... నివేదా ఒకటయ్యారా లేదా అన్నది కథ.
విశ్లేషణ: (Haiku Review)
స్నేహితురాలిగా పరిచయమై, ప్రేయసిగా మారిన అమ్మాయితో బ్రేకప్.. మూవ్ ఆన్ అయ్యి మరో అమ్మాయితో ప్రేమ.. మరో పక్క మాజీ ప్రేయసి జ్ఞాపకాలతో సతమతమవుతున్న ఓ యువకుడి కథను తెరపై ఆవిష్కరించాలనుకున్నాడు దర్శకుడు. ఆయన కథలో కాన్‌ఫ్లిక్ట్ బావున్నా... ఎగ్జిక్యూషన్‌లో గజిబిజి చేసేశారు. ఫస్టాఫ్ అంతా మనో కాలేజ్‌లో చేరడం.. అక్కడ ర్యాగింగ్ పేరుతో ఇబ్బందులు ఎదుర్కోవడం, హీరోయిన్ పరిచయం.. తక్కువ టైమ్‌లో ప్రేమలో పడటం వంటి సన్నివేశాలు సరదాగా తీసుకెళ్లారు. కాలేజ్ సన్నివేశాల్లో కొంతమేర వినోదాన్ని పంచారు. లవ్ సీన్స్, మిస్ కమ్యూనికేషన్‌తో ఇద్దరి మధ్య చిరాకులు, పరాకులతో ఫస్టాఫ్‌కి ఎండ్ పడింది. కొడి పెళ్లి సీన్‌తో విరామం. అక్కడి వరకూ అంతా రొటీన్‌గానే సాగింది. పెళ్లి సీన్ తర్వాత హీరో కొత్త జీవితం స్టార్ట్ చేయడం.. కెరీర్ మీద దృష్టి పెట్టడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. రెండో ప్రేమకథ మొదలవ్వడంతో మళ్లీ కథ పాత ట్రాక్‌లోకే వెళ్లింది.. అవే సీన్స్ రిపీట్ అయిన భావన కలుగుతుంది. అయితే మనో, నివేదా పాత జ్ఞాపకాలకు స్వస్తి చెప్పి కొత్త జీవితానికి నాంది పలకాలనుకునే సమయంలో పాత జ్ఞాపకాలు ఎలా వెంటాడాయి అన్నది ఆసక్తికరంగా, భావోద్వేగంగా చూపించారు. కానీ ప్రేమ సన్నివేశాల్లో బలంగా చెప్పాల్సిన విషయాన్ని తేలిపోయినట్లు చేశారు. అది కొంత మైనస్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్‌ను డీల్ చేసిన విధానం కన్విన్స్ చేసేలా ఉంది. నటీనటుల నుంచి చక్కని నటనను మాత్రం తీసుకున్నాడు దర్శకుడు. లవ్‌స్టోరీగా చూస్తే ఇదేమీ కొత్త కథకాదు కానీ.. సీన్లుగా చూస్తే దర్శకుడు చూపించిన ప్రతిభ ఆకట్టుకుంటుంది. ఈ ప్రేమకథలో కులాల అంతరాలు గురించి చూపించి చిన్న సందేశం ఇచ్చారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
ఏగెన్ మనో పాత్రకు యాప్ట్‌గా నిలిచారు. బ్రేకప్‌తో నలిగిపోయిన ప్రేమికుడిగా చక్కని భావోద్వేగాలు పండించారు. తెలుగమ్మాయి శ్రీదేవి కొడి పాత్రలో ఆకట్టుకుంది. ఆ పాత్రలో ఎక్కడా ఓవర్ అనిపించకుండా మెచూర్డ్‌గా నటించింది. ఫెమినా జార్జ్ కూడా క్యూట్‌గా కనిపిస్తూనే నివి పాత్రకు న్యాయం చేసింది. సెకండాఫ్‌కి ఫెమినా జార్జ్ ఎంతో కీలకం. ఆమె చుట్టూనే కథ తిరుగుతుంది. ముగ్గురూ కూడా సినిమాకు మెయిన్ పిల్లర్స్‌గా నిలిచారు. ప్రతి సన్నివేశంలో ముగ్గురూ గుర్తుండిపోయేలా నటించారు. ఇతర పాత్రధారులు ఫర్వాలేదనిపించారు. లవ్‌స్టోరీకి కావలసిన సంగీతం అందించారు మ్యూజిక్ డైరెక్టర్ సిద్దూ కుమార్. మూడు పాటలు బావున్నాయి. పియూష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ బాగుంది. సెకెండాఫ్ కాస్త ల్యాగ్ అనిపించింది. నిర్మాణ విలువలు బావున్నాయి. కథ, కథనం రొటీన్‌గానే ఉన్నా.. యంగ్‌స్టర్స్ ఆ లోపాన్ని కొంతలో కొంత సరిదిద్దారు. అక్కడక్కడా ఫ్యామిలీ వాల్యూస్‌తో జెన్‌జీ బ్యాచ్‌కు నచ్చేలా ఈ సినిమా తీశారు. అయితే పూర్తిగా తమిళ వాసనతో ఉన్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి.
ట్యాగ్‌లైన్: అక్కడక్కడా ఓకే..
రేటింగ్: 2.5/5
ఇవి కూడా చదవండి:
నిజమైన హీరోలేనా.. లేక ‘డూప్’లా? ‘జైలర్ 2’తో మొదలైన కొత్త చర్చ
‘రామాయణ’ టికెట్ ధరలు.. దిల్ రాజు కీలక నిర్ణయం
స్టార్ హీరోతో ప్రభుదేవా సినిమా.. దర్శకుడిగా టాలీవుడ్ రీఎంట్రీ