Garividi Lakshmi Review: 'గరివిడి లక్ష్మి' జీవిత కథ ఎలా ఉందంటే
ABN, Publish Date - Oct 17 , 2026 | 11:19 AM
ఉత్తరాంధ్రలో బుర్రకథ కళాకారుల్లో పేరున్న వ్యక్తి గరివిడి లక్ష్మి. తన బుర్రకథలతో ఉత్తరాంధ్రను ఒక ఊపు ఊపింది. ఇప్పుడు ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'గరివిడి లక్ష్మి’. శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
సినిమా రివ్యూ: గరివిడి లక్ష్మి (Garividi Lakshmi Review)
విడుదల తేది: 17-10-2026
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో స్టేజ్ నాటకాలు, హరికథలు, బుర్ర కథలకు ఎంతో ప్రాచుర్యం ఉండేది. టీవీలు లేని సమయంలో జనాలకు ఇవే చక్కటి వినోదం పంచేవి. పండుగలు, తిరునాళ్లల్లో ఈ కార్యక్రమాలు పక్కాగా ఉండాల్సిందే. అయితే మారిన కాలానుగుణంగా ఈ కళలన్నీ మెల్లమెల్లగా అంతరించిపోయాయి. ఉత్తరాంధ్రాలో బుర్రకథ కళాకారుల్లో పేరున్న కళాకారిణి గరివిడి లక్ష్మి. తన బుర్రకథలతో ఉత్తరాంధ్రను ఒక ఊపు ఊపారామె. ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే 'గరివిడి లక్ష్మి’. తెలుగమ్మాయి ఆనంది టైటిల్ పాత్ర పోషించిన ఈ మూవీలో వీకే నరేష్, రాగ్ మయూర్ కీలక పాత్రధారులు. గౌరి నాయుడు జమ్ము డైరెక్ట్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వపరసాద్; కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ:
విజయనగరం జిల్లాలో గరివిడి గ్రామంలో సాగే కథ ఇది. అక్కడ దేవుడమ్మ (రాశి) సన్యాసం తీసుకుని భర్తకు వేరే పెళ్లి చేసి పంపేస్తుంది. కూతురు విజయలక్ష్మి(ఆనంది)ని మాత్రం తనతో ఉంచుకుంటుంది. నాన్నకు దూరమైన లక్ష్మీకి అతి చిన్న వయసులోనే పెళ్లి చేయడం, భర్త మరొకరితో వెళ్లిపోవడంతో లక్ష్మి ఒంటరి అవుతుంది. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన పాటే ఆమెను మామూలు మనిషిని చేస్తుంది. రాంబాబు (వీకే నరేశ్) ప్రోద్భలంతో సత్తిబాబు (రాగ్ మయూర్) సాయంతో పాటలు పాడుతూ… బుర్రకథలు చెబుతూ ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకుని గరివిడి లక్ష్మిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. పద్యాల ట్రెండ్ను పాటలకు మార్చి క్షణం తీరిక లేకుండా జీవితం సాగిస్తున్న సమయంలో ఆమె జీవితంలో చిన్న కుదుపు. అది ఏంటి? గరివిడి లక్ష్మీ అందరికీ దూరంగా అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఆమెకు జరిగిన మోసం ఏంటి!? దాని వెనకున్నది ఎవరు!? ఆమె జీవితాన్ని సినిమాగా తీసి ఆమె గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న తపనతో వచ్చిన రాజేష్ (అంకిత్ కొయ్య) ప్రయత్నం ఫలించిందా లేదా!? అన్నదే కథ.
విశ్లేషణ:
ఉత్తరాంధ్రలో జానపదాలకు కేరాఫ్ గా నిలిచి, ఎంతోమంది కళాకారులు ఉన్నప్పటికీ తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న రెడ్డి విజయలక్ష్మీ అలియాస్ గరివిడి లక్ష్మి కథను జనాలకు తెలియజేయాలి… ఆమె నుంచి లాక్కున్న గుర్తింపును తిరిగి ఆమెకు అందించాలనే ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. లక్ష్మి జీవితాన్ని జనాలకు చెప్పాలనే కోరికతో ఆమె ఊరి బాటపట్టిన ఇద్దరు ఔత్సాహిక దర్శకుల జర్నీతో కథ మొదలవుతుంది. ఫస్టాఫ్ అంతా లక్ష్మి బాల్యం, చిన్నతనంలో ఎదురైన దెబ్బలు.. తదుపరి పాటలు, బుర్రకథ చెప్పడం వైపు అడుగులు వేయడం.. తద్వారా ఎదురైన అవమానాలతో సాగుతుంది. ఓ జాతరలో ప్రఖ్యాత కళాకారుడు షణ్ముఖ నాగేశ్వరరావుకు దీటుగా పద్యాల దారిలో ఉన్న బుర్రకథను పాటల రూపంలోకి మార్చి చేసిన షోతో కథ టర్న్ అవుతుంది. అక్కడి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఇక సెకండాఫ్లో గరివిడి లక్ష్మీగా ఎదిగిన తీరు.. వరుస షోలతో బిజీ కావడం… ఆపై నమ్మినవారే మోసం చేయడం, ఆమె పేరుతో మరొకరు చెలామణీ అవడం, ఆమె గుర్తింపును వేరొకరు కొట్టేయడం వంటి భావోద్వేగాలతో నడుస్తుంది. ఆమె పాటల్ని క్యాసెట్లుగా చేసి వ్యాపారం చేసుకున్నవారి నుంచి, సినిమా వారు చేసిన మోసం, ఆమెకు వచ్చిన ప్రభుత్వ పురస్కారాన్ని ఆమె పేరుతో వేరొకరు తీసుకోవడం వంటి సీన్స్ కట్టిపడేస్తాయి. కళాకారిణిగా ఫామ్ లో ఉన్నప్పుడు లక్ష్మి జీవితాన్ని తెరపై ఎంత చక్కగా చూపించారో.. ఎదురు దెబ్బలు తగిలి కన్నీటి వ్యథలు ఎదురైనప్పుడు అంతే హృద్యంగా చూపించారు దర్శకుడు. సెకెండాఫ్ కొద్దిగా స్లో అయినా ఎమోషనల్ సీన్స్ ఆ ఆలోచన రానివ్వవు. క్లైమాక్స్ తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. తెరపై గరివిడి కథను చూస్తుంటే మహానటి సావిత్రి కథ గుర్తుకు రావటం ఖాయం.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
గరివిడి లక్ష్మి సినిమాకు మేజర్ ఎసెట్ ఆర్టిస్ట్ ల సెలక్షన్. ఇందులో టైటిల్ పాత్ర పోషించిన తెలుగమ్మాయి ఆనంది ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇప్పటి వరకూ ఆమె ఎన్నో చిత్రాల్లో నటించినా.. ఈ సినిమా మాత్రం కెరీర్లో మైల్ స్టోన్ అని చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర యాస, భాష, పాటలు పాడే తీరు.. మొండితనం ఇలా తెరపై కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ ఆనంది తన మార్క్ చూపించింది. పాటలతో అలరించింది.. భావోద్వేగాలతో కంట తడిపెట్టించింది. సరైన హిట్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాగ్ మయూర్ కి కూడా ఈ సినిమా ఓ మంచి అవకాశం అని చెప్పాలి. సత్తిబాబుగా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేసి మెప్పించాడు. లక్ష్మిలో మంచి కళాకారిణి ఉందని గమనించి ఆమెకు మంచి స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసే రాంబాబు పాత్రలో వీకే నరేశ్ చక్కని నటన కనబర్చారు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన బెస్ట్ క్యారెక్టర్ ఇదని చెప్పొచ్చు. తల్లిగా రాశి, యువ దర్శకుడిగా అంకిత్ కొయ్య, చిన్ననాటి స్నేహితురాలిగా శరణ్య ప్రదీప్, షకలక శంకర్, ఎల్బీ శ్రీరాం, వైవా రాఘవ, నితిన్ ప్రసన్న ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాకు కెమెరా వర్క్ కూడా బాగా కలిసొచ్చింది. 1970, 80ల వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ తో పాటు ఆర్ట్ డిపార్ట్మెంట్ వారు చక్కగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు ప్రధాన బలం చరణ్ అర్జున్ అందించిన సంగీతం. పాటలతోనే కాకుండా నేపథ్య సంగీతంలోనూ తన మార్క్ కనిపించింది. భావోద్వేగ సన్నివేశాల్లో నేపథ్య సంగీతానికి కంటతడి రాక మానదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణ విలువలు బావున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలతో వరుస ఫ్లాఫుల్లో ఉన్న ఈ సంస్థ నుంచి ఈ తరహా చిత్రం రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది! ఓ కళాకారిణి జీవితాన్ని జనాలకు తెలియజేయాలని సినిమా తీయడం మాత్రం మంచి ప్రయత్నం. ఈ బ్యానర్ హిట్ తోపాటు మంచి పేరును కూడా తెచ్చే సినిమా అవుతుంది. ఇక దర్శకుడి విషయానికొస్తే.. తను రాసుకున్న కథను ఎలాంటి కమర్షియల్ హంగులూ లేకుండా నిజాయతీగా తెరపై ఆవిష్కరించారు. అలాగే కళాకారిణి గరివిడి లక్ష్మి ఒకప్పుడు కోల్పోయిన గుర్తింపు ఈ సినిమా ద్వారా వచ్చే అవకాశం ఉంది.
ట్యాగ్లైన్: కదిలించే ‘గరివిడి లక్ష్మి’ కథ
రేటింగ్: 3/5