Gandhi Talks Review: 'పుష్పక విమానం'ను గుర్తుకు తెచ్చే 'గాంధీ టాక్స్'
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:52 PM
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరీ కీలక పాత్రలు పోషించిన సినిమా 'గాంధీ టాక్స్'. మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా జనవరి 30న ఈ సినిమా దేశ వ్యాప్తంగా విడుదలైంది.
భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని కొన్ని సంఘటనలు గుర్తు చేస్తుంటాయి. ఎక్కడ మొదలయ్యామో అక్కడి చేరడాన్ని భూమితోనే పోల్చుతుంటారు. చిత్రంగా ఒక్కోసారి కొందరు తాము నడిచి వచ్చిన దారులను వెదుక్కుంటూ వెనక్కి వెళుతుంటారు. ఇవాళ్టి టాకీ యుగంలో మాటలు లేకుండా మూకీ సినిమా తీయడమనేది అలాంటిదే! మాటలు తూటాల్లా పేలుతున్న టైమ్ లో అసలు మాటలే లేకుండా మరాఠీ దర్శకుడు కిశోర్ పాండురంగ బేలేకర్ 'గాంధీ టాక్స్' (Gandhi Talks) పేరుతో ఓ సినిమా రూపొందించాడు. గతంలో కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) ఇలానే 'పుష్పక విమానం' (Pushpaka Vimanam) సినిమా తీశారు. మహాత్మగాంధీ వర్థంతి సందర్భంగా శుక్రవారం జనం ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీ 'గాంధీ టాక్స్' చూసినప్పుడు 'పుష్పక విమానం' గుర్తుకు రాకమానదు.
కథ విషయానికి వస్తే... ఇది ముంబైలో జరిగే కథ. మహాదేవ్ (విజయ్ సేతుపతి Vijay Sethupathi) నిరుద్యోగ యువకుడు. మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం వెళితే యాభై వేలు లంచం అడుగుతారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లితో ఎదుగు బొదుగు లేకుండా జీవితాన్ని సాగిస్తుంటారు. అతనుండే చాల్ ఎదుటి పోర్షన్ లోని గాయత్రి (అదితి రావ్ హైదరీ Aditi Rao Hydari)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలంటే... అతని నిరుద్యోగం పెద్ద ప్రతిబంధకంగా మారుతుంది. చివరకు చేతిలో ఉన్న డబ్బుల్నీ అయిపోవడంతో ఇంటి కరెంట్ కట్ అయిపోతుంది, డబ్బావాలా భోజనం ఇవ్వడానికి నిరాకరిస్తాడు. ఇంకో వైపు గాయత్రి పేరెంట్స్ ఆమెకు పెళ్ళి సంబంధాలు చూస్తుంటారు. ఈ కథ ఇలా ఉంటే... ముంబైలోని పేరు మోసిన బిల్డర్ మోహన్ బోస్మన్ (అరవింద స్వామి Arvind Swamy). అయితే భార్య, పిల్లలు విమాన ప్రమాదంలో మృతిచెందడంతో కుదేలైపోతాడు. అదే సమయంలో గుండెపోటుతో తల్లి కూడా కన్నుమూస్తుంది. ప్రకృతి పగబట్టినట్టు అతన్ని ఒంటరిని చేయడమే కాదు... నిండా అప్పుల్లో మునిగేట్టు చేస్తుంది. కళ్ల ముందు జీవితం తల్లకిందులైపోవడంతో ఏం చేయాలో పాలు పోదు. ఈ కష్టాల నుండి తప్పించుకోవడానికి అతనో ప్లాన్ చేస్తాడు. అలానే ఈతిబాధల్ని అధిగమించడానికి మహదేవ్ సైతం తెగువతో ఓ నిర్ణయానికి వస్తాడు. వీరిద్దరూ తీసుకున్న నిర్ణయాలు ఏమిటీ? వాటి పర్యవసానంగా వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు జరిగాయి? అన్నదే 'గాంధీ టాక్స్' మూవీ.
గతంలో వచ్చిన 'పుష్పక విమానం' సినిమాలో నేపథ్య సంగీతం, అప్పుడప్పుడూ రేడియోలో పాటలు మాత్రమే వినిపిస్తాయి. కానీ ఏ పాత్ర నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఈ సినిమా కూడా అంతే... అయితే సందర్భానుసారంగా దర్శకుడు మూడు నాలుగు నేపథ్య గీతాలను పెట్టాడు. 'పుష్పక విమానం'తో పోల్చితే ఇది మరింత క్లిష్టమైన కథ. ఓ కామన్ మ్యాన్, ఓ మల్టీ మిలియనీర్ జీవితాలలో జరిగిన ఊహించని సంఘటనలు తెలియచెప్పేది. కొన్ని చోట్ల దర్శకుడు కాస్తంత స్వేచ్ఛ తీసుకుని... కథను సెల్ ఫోన్ లో టెస్ట్ మెసేజ్ తో నడిపాడు. ఇందులో మాటలు లేకపోయినా... నటీనటుల హావభావాలతో కథంతా అర్థమైపోతుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ సంభాషణలు లేని లోటు ఎక్కడా కనిపించదు. మూకీ సినిమా చేయాలని తపించిన దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు.
'గాంధీ టాక్స్' మూవీని రెండు సంవత్సరాల క్రితమే గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. మూవీ నిర్మాణం వెనుక జీ స్టూడియస్, క్యోరియస్, మూవీ మిల్ వంటి సంస్థలు ఉన్నాయి. నటి మీరా చోప్రా సైతం ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి. అయినా ఈ సినిమా విడుదలలో విపరీతమైన జాప్యం జరిగింది.
నటీనటుల విషయానికి వస్తే విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీరావ్ హైదరీ తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. ఇతర ప్రధాన పాత్రలను సిద్దార్థ్ జాదవ్, గోవింద్ నామ్ దేవ్, మహేశ్ మంజ్రేకర్, జరీనా వాహబ్, ప్రియదర్శిని ఇందాల్కర్, వనితా కారత్, భగవతి పెరుమాళ్, రోహిణి హట్టంగడి తదితరులు చేశారు. అందరూ సహజ నటన ప్రదర్శించారు. మాటలు లేని ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచింది ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman) అందించిన నేపథ్య సంగీతం! అలానే పాటల బాణీలు ఒకటి రెండు బాగున్నాయి.
హోదాతో సంబంధం లేకుండా డబ్బు మనిషిని ఎలా ఆడిస్తుందనేది దర్శకుడు కిశోర్ పాండురంగ్ (Kishor Pandurang) ఈ సినిమాలో చూపించాడు. ఇవాళ గాంధీ వర్థంతి. ఆయన నడిచిన బాటకు, ఆయన చెప్పిన మాటలకు ఈ తరం చాలా దూరం వచ్చేసింది. వారికి గాంధీ అంటే కరెన్సీ నోటు మీద ఉండే ఓ మనిషి మాత్రమే. గాంధీ వర్థంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా... ఒక్కసారి గాంధీని గురించి తలుచుకునేలా చేస్తుంది. అయితే... ఇలాంటి సినిమాలను ఈ రోజుల్లో అంత ఓపికగా ఎవరు చూస్తారనే సందేహం కొందరికి రావడం సహజం. ఇది ప్రయోగాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం తీసిన సినిమాగా భావించాలి.
రేటింగ్ : 2.75/5
ట్యాగ్ లైన్: లగే రహో గాంధీ!