సినిమా రివ్యూ 'గాయపడ్డ సింహం'
ABN, Publish Date - May 01 , 2026 | 04:56 PM
తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గాయపడ్డ సింహం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం
సినిమా రివ్యూ: గాయపడ్డ సింహం
విడుదల తేది: 1-5-2025
‘పెళ్లి చూపులు’ చిత్రం సక్సెస్‌తో దర్శకుడిగా గుర్తింపు పొందారు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత దర్శకుడిగా కొనసాగుతూనే నటుడిగా కెరీర్ ప్రారంభించారు. అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ కూడా చేస్తున్నారు. తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. కల్యాణ్ చక్రవర్తి, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేశ్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమాతో కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. శుక్రవారం జనం ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
దరహాస్ దాస్యం (తరుణ్ భాస్కర్) ఎథికల్ హ్యాకింగ్‌లో నిష్ణాతుడు. చిన్ను (మాసన చౌదరి)తో ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లి జరగాలంటే అమెరికాలో సెటిలై ఉండాలి, డబ్బు బాగా సంపాదించాలని తండ్రి షరతులు పెడతాడు. దాంతో దరహాస్ ఆ అమ్మాయిని దక్కించుకోవడం కోసం అమెరికా వెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. తీరా అక్కడికి వెళ్లాక దరహాస్‌తో పాటు కొందరిని ట్రంప్ ప్రభుత్వం డిపోర్ట్ చేస్తుంది. ఇండియాకు వచ్చిన దరహాస్‌కు చిన్ను గుడ్‌బై చెప్పేస్తుంది. అమెరికా లైఫ్, గర్ల్ ఫ్రెండ్‌ను మిస్ కావడంతో రగిలిపోయిన దరహాస్.. ట్రంప్‌పై పగ తీర్చుకోవాలనుకుంటాడు. భైరవ్ (శ్రీవిష్ణు)తో కలిసి ఓ పన్నాగం పన్నుతాడు. ఈ కథలో శాలిని (ఫరియా అబ్దుల్లా) ఎవరు? ఆమె తండ్రి ఐజీ విజయ్‌కాంత్ (శుభలేఖ సుధాకర్)కు దరహాస్ కు ఉన్న సంబంధం ఏమిటి? బ్రూటల్ ధర్మ (జె.డి చక్రవర్తి) చేసే దందా ఏమిటీ? అన్నది మిగతా సినిమా.
విశ్లేషణ:
2024లో జరిగే కథ ఇది. అమెరికా నుంచి వెనక్కి వచ్చేసిన ఓ యువకుడు ఆ దేశాధ్యక్షుడిపై క్షక్ష తీర్చుకోవాలన్న నేపథ్యానికి కాస్త వినోదాన్ని జోడించి తెరకెక్కించారు. దరహాస్, శాలిని వివాహ చర్చలు, ఆమె తండ్రి విజయ్‌కాంత్‌తో ముందు నుంచే ఉన్న పరిచయంతో హీరో ఫ్లాష్‌బ్యాక్ చెప్పడంతో కథ మొదలవుతుంది. అమెరికా వెళ్లడం కోసం దరహాస్ చేసిన ప్రయత్నాలు, సత్య లాజిస్టిక్స్ పేరుతో బ్రూటల్ ధర్మ (జె.డి) చేసే దందాను పట్టుకోవడం కోసం పోలీసులు చేసే ప్రయత్నాలు, ట్రంప్‌పై కక్ష తీర్చుకోవడానికి శ్రీవిష్ణుతో చేతబడి చేయించాలనుకోవడం వంటి సన్నివేశాలతో ప్రథమార్థం ముగుస్తుంది. ఈ సన్నివేశాలన్ని నవ్వులు పూయించినా సీట్‌లో కూర్చున ఎక్కువ మందికి ఏదో భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక సెకెండాఫ్ అంతా దరహాస్‌ను విచారణ చేయడం, బ్రూటల్ ధర్మ గ్యాంగ్‌ను పట్టుకోవడం వంటి సన్నివేశాలతో నింపేశారు. డోనాల్ట్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆయన నిర్ణయాలతో జనాలు ఎలా ఇబ్బంది పడ్డారు అన్ని అంశాలను ఇందులో చూపించారు. జోశ్యుల సూర్యప్రకాశ్ అందించిన కథ బాగానే ఉంది. అయితే దర్శకుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. 'కేజీఎఫ్' స్టైల్ లో ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొంటూ పోవడం, బొమ్మరిల్లు సీన్, పోకిరిలో కొన్ని సీన్స్ స్పూఫ్స్ గా చూపించడం నవ్వులు పూయిస్తుంది. అసలు హీరో టార్గెట్ అమెరికా అధ్యక్షుడిపై కక్ష తీర్చుకోవడమే అయితే దానికి బలమైన నేపథ్యాన్ని తీసుకుంటే బావుండేది. కేవలం చేతబడితో దెబ్బకొట్టాలనుకోవడం సిల్లీగా అనిపిస్తుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
దరహాస్‌గా తరుణ్ భాస్కర్ నటన మెప్పించింది. కామెడీ టైమింగ్ బాగుంది. దర్శకుడు ఎలా డిజైన్ చేశాడో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఫరియా అబ్దుల్లా కూడా శాలిని పాత్రకు న్యాయం చేసింది. అక్కడక్కడా కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది. మానస చౌదరి కనిపించింది రెండు సీన్లలోనే అయినా మెప్పించింది. శుభలేఖ సుధాకర్, హర్షవర్ధన్, ఝాన్సీ, ప్రదీప్ రావత్ తదితరులు పాత్రల మేరకు బాగానే చేశారు. సినిమాకు ఎంతో కీలకమైన పాత్రగా చెప్పుకొన్న జెడి చక్రవర్తి పాత్ర డిజైన్ బాగానే ఉంది. కానీ ప్రమోషన్స్‌లో ఆయన చెప్పినంతగా ఆ పాత్రలో ఏమీ లేదు. కమల్‌హాసన్ ఆశ్చర్యపోయే వేరియేషన్స్ బ్రూటల్ ధర్మ పాత్రలో లేవు. ఇచ్చిన పాత్రకు న్యాయం చేసారంతే. కామ్నా జెఠ్మలానీ చిన్న సీన్ లో మెరిసింది. దర్శకుడు కూడా ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. యాక్టింగ్‌లోనూ డైలాగ్ డెలివరీలోనూ ఆయనకు పేరు పెట్టక్కర్లేదు. భైరవ్‌గా శ్రీవిష్ణు ఓ తాంత్రికుడిగా కనిపించారు. ఆ పాత్రకు న్యాయం చేశారు. విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ బావుంది. నేపథ్య సంగీతం అలరించింది. కానీ పాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ఎడిటర్ విప్లవ్ నైషదం ఒకే అనిపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే వినోదాన్ని కోరుకునే వారికి మాత్రం ఈ సినిమా కాస్త ఊరటను ఇస్తుంది. అంతకుమించి ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఈ సినిమాలో ఏమీ లేదు. ఇందులో శ్రీవిష్ణు పోషించిన పాత్రను కంటిన్యూ చేస్తూ 'పోరాడే సింహం' టైటిల్‌తో సీక్వెల్ ప్లాన్ చేసినట్లు లీడ్ ఇచ్చారు. కానీ ఆ అవకాశం దర్శక నిర్మాతలకు ప్రేక్షకులు ఇవ్వకపోవచ్చు.
ట్యాగ్‌లైన్: గాయపడ్డ ప్రేక్షకుడు!
రేటింగ్: 2.25/5