Drishyam 3: దృశ్యం 3 మూవీ రివ్యూ
ABN, Publish Date - May 21 , 2026 | 03:45 PM
'దృశ్యం', 'దృశ్యం 2' చిత్రాలు తెలుగులో రీమేక్ కాగా మూడో భాగం మాత్రం మలయాళం నుండి డబ్ అయ్యింది. మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసఫ్ తెరకెక్కించిన 'దృశ్యం 3' ఎలా ఉందో తెలుసుకుందాం.
సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal), దర్శకుడు జీతూ జోసఫ్ (Jeethu Joseph) ది హిట్ కాంబినేషన్. అంతేకాదు... వీళ్ళ కాంబోలో వచ్చిన 'దృశ్యం' (Drishyam) రెండు భాగాలైతే సూపర్ హిట్. అందులోని యూనివర్సల్ పాయింట్ కారణంగా అవి వివిధ భాషల్లోనూ రీ-మేక్ అయ్యాయి. మోహన్ లాల్, మీనా (Meena) జంటగా నటించిన ఈ రెండు భాగాలను తెలుగులో వెంకటేశ్ (Venkatesh), మీనా చేశారు. అక్కడ మాదిరిగానే ఇక్కడా 'దృశ్యం, దృశ్యం 2' హిట్ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం 'దృశ్యం 3' (Drishyam 3)ని రీమేక్ చేయకుండా డబ్ చేసి తెలుగువారి ముందుకు తీసుకొచ్చారు. దానికి కారణం వెంకటేశ్ డేట్స్ లేకపోవడమే అనే సమాధానం వచ్చింది.
'దృశ్యం 3' కథ విషయానికి వస్తే... దీని ముందు భాగం ఎక్కడ పూర్తి అయ్యిందో అక్కడ నుంచే ప్రారంభించారు. తన జీవితంలో జరిగిన సంఘటనలను ఓ నవలగా రాయించి, ఆ తర్వాత దాన్ని కోర్టులో ప్రెజెంట్ చేయించి, తనకు, కుటుంబానికి శిక్ష పడకుండా జార్జి కుట్టి తప్పించుకోవడంతో ద్వితీయ భాగానికి శుభం కార్డు పడింది. ఇక మీదట ప్రభాకర్, అతని భార్య... జార్జి కుట్టి కుటుంబం మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదని కోర్టు సైతం ఆదేశిస్తుంది. 'దృశ్యం'లో కేబుల్ టీవీ ఆపరేటర్ గా ఉన్న జార్జి కుట్టి... ఇప్పుడు నిర్మాతగా మారతాడు. అతను నిర్మించిన తొలి నవలా చిత్రం ఘన విజయం సాధిస్తుంది. పెద్ద కుమార్తె అనూ ఆరోగ్యం కూడా కుదుటపడటంతో ఆమెకు ఓ మంచి పెళ్ళి సంబంధం చూసి దుబాయ్ కు పంపించేయాలని జార్జి కుట్టి భావిస్తాడు. అయితే... ఆమెకు వచ్చిన సంబంధాలను ఓ ఇద్దరు వ్యక్తులు చెడగొడుతున్నారనే విషయం జార్జి కుట్టికి తెలుస్తోంది. ఆ ఇద్దరూ ఎవరు? తమ జీవితంలోకి ఇక తొంగిచూడరని అనుకున్న ప్రభాకర్, అతని భార్యకు వారితో ఉన్న సంబంధం ఏమిటీ? కూతురును ఓ ఇంటిదాన్ని చేయాలని అనుకున్న జార్జి కుట్టి కోరిక నెరవేరిందా? పాత కేసులు తిరిగి వెలుగులోకి వస్తాయని గ్రహించిన జార్జి కుట్టి ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు? అనేదే 'దృశ్యం 3' కథ.
అయితే మొదటి రెండు భాగాలతో పోల్చితే... 'దృశ్యం 3' పేలవంగా సాగింది. ఫస్ట్ హాఫ్ అయితే మరీ దారుణం. ఆ స్లో నెరేషన్ ను తట్టుకోవడం కష్టమే. కథ ఎంతసేపు అక్కడక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది. మొదటి రెండు భాగాల్లో హత్య కేసు నుంచి కుటుంబాన్ని తప్పించడానికి జార్జి కుట్టి పడే తపనతో పోల్చితే... ఇందులో అతని మైండ్ గేమ్ పెద్దగా ఏమీ లేదు. కూతురుకు వచ్చే సంబంధాలను చెడగొట్టే వారి గురించి ఆరా తీయడం, వారి వెనుక ఉన్న వ్యక్తుల మోటివ్‌ను తెలుసుకోవడానికి చాలానే సమయం తీసుకున్నాడు. పైగా సన్నివేశాలన్నీ ఊహకు అందేవిగానే ఉన్నాయి. క్లయిమాక్స్ లో ఓ ఇరవై నిమిషాలు మాత్రం ఉత్సుకత కలిగిస్తుంది. కానీ దాని కోసం మిగిలిన సినిమాను భరించడం కష్టమే.
నటీనటుల విషయానికి వస్తే మోహన్ లాల్ తనదైన శైలిలో జార్జి కుట్టి పాత్రకు మరోసారి ప్రాణం పోశాడు. ముందు రెండు భాగాలతో పోల్చితే మీనాకు, చిన్నకూతురు పాత్ర పోషించిన ఎస్తేర్ అనిల్ (Esther Anil) కు పెద్దంత ప్రాధాన్యం ఇందులో లభించలేదు. కథంతా పెద్ద కూతురు అంజు జార్జ్ చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రకు అన్సిబా హసన్ న్యాయం చేసింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే ఉంది. ప్రతినాయక పాత్రలు పోషించిన సిద్ధిక్ (Siddique) కు ఉన్న ప్రాధాన్యత ఆయన భార్యగా చేసిన ఆశా శరత్ (Asha Sharath) కు ఈసారి దక్కలేదు. ఐపీఎస్ అధికారిగా మురళీ గోపీ, లాయర్‌గా శాంతి మాయాదేవి చక్కటి నటన కనబరిచారు.
'దృశ్యం' సీరిస్‌కు దర్శకుడు జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లేనే ప్రధాన బలం. మొదటి రెండు భాగాల్లో అది వర్కౌట్ అయ్యింది. ఆ సినిమాల విజయానికి కారణమైంది. మూడో భాగం దగ్గరకు వచ్చే సరికీ నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా... స్క్రీన్ ప్లే ఉత్కంఠను కలిగించలేదు. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం ఫర్వాలేదు. కానీ కథనం నత్తనడకలా సాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే వారికి ఓ మాదిరిగా అనిపించవచ్చు కానీ మిగిలిన వారిని 'దృశ్యం 3' ఆకట్టుకోవడం కష్టమే. 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలతో వరుస విజయాలను అందుకున్న వెంకటేశ్ 'దృశ్యం 3' రీమేక్ చేయకపోవడం బెటర్ అనిపించేలా ఇది ఉంది.
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: అంత దృశ్యం లేదు!