సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tatvam Movie Review: న్యూ ఏజ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్.. 'త‌త్వం' మూవీ రివ్యూ

ABN, Publish Date - Oct 02 , 2026 | 09:43 AM

ఈవారం పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో పదికి పైగా చిన్న సినిమాలు థియేటర్స్‌లో క్యూ కట్టాయి. అందులో ఒకటి 'తత్వం’ (Tatvam Movie).

Tatvam Movie Review

సినిమా రివ్యూ: తత్వం

విడుదల తేది: 02.10.2026

ఈవారం పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో పదికి పైగా చిన్న సినిమాలు థియేటర్స్‌లో క్యూ కట్టాయి. అందులో ఒకటి 'తత్వం’ (Tatvam Movie). నూతన నటీనటులు దినేష్‌ తేజ్ (Dinesh Tej), దష్విక (Dhasvika Kinthalli) జంటగా నటించారు. అర్జున్‌ కోలా (Arjun Kola) దర్శకత్వం వహించారు. వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటి నిర్మాతలు. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాను చూసిన ప్రేక్షకులకు 'తత్వం' బోధపడిందో లేదో తెలుసుకుందాం.

కథ

కానిస్టేబుల్‌ కళ్యాణ్‌ (దినేశ్‌ తేజ్‌) ఎస్సై ఉద్యోగం సాధించాలనే లక్ష్యంగా పని చేస్తుంటాడు. పరీక్షా ఫలితాలకై ఎదురుచూస్తున్న సమయంలో పెళ్లి చూపుల కోసం రామాపురం వెళ్తాడు. అక్కడ సౌమ్య (దష్విక)ను చూసి తొలి చూపులోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో ఆ గ్రామంలోనే మూర్తి, నాగమణి అనే దంపతులు హత్యకు గురవుతారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగుతుంది. మానసిక సమస్యతో బాధపడుతున్న వారి కుమారుడు సుధానే తల్లిదండ్రులను చంపాడని గ్రామస్తులు భావిస్తారు. ఆ కేసును ఛేదించే పని కల్యాణ్‌ చేతికి వస్తుంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ హత్యల వెనుక అనేక అనుమానాలు, ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తుంటాయి. అసలు ఈ హత్యల వెనకున్నది ఎవరు? సుధానే తల్లిదండ్రులను చంపాడా? ఈ కేసును కల్యాణ్‌ ఎలా ఛేదించాడు? సౌమ్యతో అతని పెళ్లి జరిగిందా? లేదా? అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ ఇది. కానిస్టేబుల్‌ పెళ్లి చూపులతో మొదలైన కథ.. రామాపురం అనే గ్రామంలో హత్య కేసు వైపు టర్న్‌ అవుతుంది. హత్య కేసును ఛేదించే పోలీస్‌ దర్యాప్తు, మరోవైపు మనిషి అంతర్గత ఆలోచనలను ప్రశ్నించే తాత్విక అంశాలు మిళితం చేసి దర్శకుడు కథను నడిపాడు. అయితే కథలోని ఇన్వెస్టిగేషన్‌ రిలేటెడ్‌ సన్నివేశాలన్నీ సో సోగా సాగుతాయి. ఫలానా సీన్‌ ఆసక్తికరంగా ఉందని చెప్పలేం. సెకెండాఫ్‌ మాత్రం కాస్త వేగంగా ముందుకెళ్తుంది. మూర్తి మర్డర్‌ కేసు నుంచి మరో క్రైమ్‌ వైపు కథ మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి కథ ముందుకు నడిచి ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించే ట్రాక్‌లోకి వస్తుంది. రిజిస్టర్‌ ఆఫీస్‌ సీన్‌, ఆవులను అక్రమ రవాణ చేసే సన్నివేశాలతో గ్రిప్పింగ్‌గా ముందుకు సాగుతుంది. మధ్య మధ్యలో ప్రేమ సన్నివేశాలు మాత్రం బాగానే ఆకట్టుకుంటాయి. రొటీన్‌ మర్డర్‌ మిస్టరీ కథే అయినా  ఉన్నంతలో ఆసక్తిగా మలచడానికి దర్శకుడు ప్రయత్నం చేశాడు. అందులో కొంతమేర సఫలం అయ్యాడు. క్లైమాక్స్‌లో క్రైమ్‌, మర్డర్‌ను ఛేదించే సన్నివేశాలను బాగానే ప్లాన్‌ చేసినా... ప్రతి సీన్‌ ఎక్కడో చూసినట్లుగానే అనిపిస్తుంది. దాంతో క్లైమాక్స్‌ తేలిపోయిన భావన కలుగుతుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు, లొకేషన్స్‌ చూస్తే మలయాళ సినిమాల మాదిరిగా అనిపిస్తుంది. 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..

కానిస్టేబుల్‌గా కళ్యాణ్‌ పాత్రలో దినేష్‌ ఒదిగిపోయాడు. నటనకు మంచి స్కోప్‌ ఉంది కానీ ఎక్స్‌ ప్రెషన్స్‌ విషయంలో కాస్త డల్‌ అనే చెప్పాలి. పల్లెటూరి అమ్మాయిగా సౌమ్య పాత్రలో దష్విక   చక్కగా కుదిరింది. ఇతర పాత్రధారులంతా పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. సినిమాటోగ్రాఫర్‌   భరత్‌ పట్టి ఫొటోగ్రఫీ సినిమాకు ఎసెట్‌. పల్లె అందాలను చక్కగా చూపించారు. చేతన్‌ భరద్వాజ్‌ సంగీతానికి మంచి పేరుంది. ఈ సినిమా విషయంలో ఆ మార్క్‌ ఎక్కడా కనిపించలేదు. సౌండ్‌ మిక్సింగ్‌ సరిగ్గా లేదు. విప్లవ్‌ నైషదం ఎడిటింగ్‌ కూడా అంతే. చాలా  సన్నివేశాలు ల్యాగ్‌ అనిపించాయి. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. మర్డర్‌ మిస్టరీ వెనుక నిజాలు, అబద్దాలు ఉంటాయి. ఏది నిజమో, ఏది అబద్దమో తెలిసినప్పుడు మనిషి అసలు తత్వం బయటపడుతుంది అన్న కాన్సెప్ట్‌ను దర్శకుడు ఆసక్తిగానే తెరకెక్కించాడు. కానీ.. మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్స్‌ ఎంగేజింగ్‌గా ఉండాలంటే స్టోరీ రన్నింగ్‌ గ్రిపింగ్‌గా ఉండాలి. ఇందులో అదే మిస్‌ అయింది. అయితే దర్శకుడి ప్రయత్నాన్ని అభినందించవచ్చు. ఏ అంచనాలు లేకుండా వెళ్తే.. కొన్ని సీన్స్‌ థియేటర్‌లో కూర్చోబెడతాయి.

ట్యాగ్‌లైన్‌: తత్వం.. ఇంకాస్త బోధపడాలి

రేటింగ్‌: 2.25/5

Updated Date - Oct 02 , 2026 | 09:46 AM