ధురంధర్: ది రివేంజ్ మూవీ రివ్యూ
ABN, Publish Date - Mar 19 , 2026 | 06:57 AM
మోస్ట్ అవైటెడ్ మూవీ 'ధురంధర్: ది రివేంజ్' ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం.
ఎలాంటి అంచనాలు లేకుండా జనం ముందుకు వచ్చి, ఊహించని ఘన విజయాన్ని సాధించిన 'ధురంధర్' ఒక ఎత్తు అయితే... భారీ అంచనాలతో విడుదలైన 'ధురంధర్: ది రివేంజ్' మరో ఎత్తు. సహజంగా మొదటి భాగానికి దక్కిన విజయం రెండో భాగానికి చాలా రేర్‌గా దక్కుతూ ఉంటుంది. అయితే 'బాహుబలి', 'పుష్ఫ' సినిమాల సీక్వెల్స్ ఆ సెంటిమెంట్ ను త్రోసి పుచ్చి వరల్డ్ వైడ్ మొదటి భాగం కంటే రెండో భాగమే బెటర్ అనిపించుకున్నాయి. ఇప్పుడు 'ధురంధర్: ది రివేంజ్' సైతం అదే బాటలో సాగింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే మొదటి రోజు దాదాపు రూ. 150 కోట్లను కొల్లగొట్టిన ఈ సినిమా, ఖచ్చితంగా మొదటి భాగాన్ని మించి, రూ. 1500 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉగాది, గుడి పడ్వా, ఈద్ కానుకగా మార్చి 19న జనం ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోస్ బుధవారం రాత్రే పడ్డాయి. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకుందామా!?
భారతదేశానికి కంటి మీద కనుకు లేకుండా చేస్తున్న ఉగ్రవాదులకు నెలవైన పాకిస్తాన్‌కు అండర్ కవర్ ఆపరేషన్ నిమిత్తం వెళ్ళిన హమ్జా అలీ (రణవీర్ సింగ్) అక్కడి కీలక పట్టణం ల్యారీని తన హస్తగతం చేసుకోవడంతో 'ధురంధర్' సినిమా ముగుస్తుంది. రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) హత్యతో ల్యారీ పీఠంపై ఎవరు ఎక్కుతారనే ఆసక్తికరమైన ప్రశ్నతో ఆ భాగాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ ముగించాడు. అయితే ఈ రెండో భాగంలో కథను అక్కడ నుండి చెప్పకుండా ఆర్మీ కుటుంబానికి చెందిన జస్కిరాత్ సింగ్ ఎలా హత్యకేసులో ఇరుక్కుని జైలు పాలయ్యాడు? అతని మనసు మార్చి తిరిగి దేశం కోసం గూఢచారిగా పనిచేసేలా అజయ్ సన్యాల్ ఎలా అతన్ని తీర్చిదిద్దాడు అనే అంశంతో మొదలు పెట్టారు. ఆ తర్వాత కథ పాకిస్తాన్‌లో మొదటి భాగం ముగిసిన దగ్గరకు వెళుతుంది. తన అన్న చావుకు కారణమైన అర్షద్ పప్పుపై ఉజెయిర్ బలోచ్ పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అదే సమయంలో అతని వెనకే ఉంటూ ఉజెయిర్ ల్యారీ పీఠం ఎక్కకుండా హమ్జా ఎత్తులు వేస్తుంటాడు. మరో పక్క భారత్‌ను బలహీన పర్చడం కోసం బడే సాబ్ ఉరఫ్ దావూద్ ఇబ్రహీం ఉగ్రదాడులకు పథక రచన చేస్తుంటాడు. తన దేశంపై ద్రోహులు చేస్తున్న కుట్రలను మౌనంగా భరిస్తూనే, అవకాశం వచ్చినప్పుడు వాటిని నిలువరించే ప్రయత్నం హమ్జా చేస్తూ ఉంటాడు. అయితే ఈ ఉపద్రవాలను ఎదుర్కోవాల్సి వచ్చిన ప్రతిసారి అతను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాటన్నింటినీ తట్టుకుని ల్యారీ నుంచి కరాచీని, ఆపైన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి హమ్జా చేరతాడు. ఇదే సమయంలో హమ్జా భారతీయ ఏజెంట్ అని తెలిసిన తర్వాత స్టోరీ హిటేక్కుతుంది. ముసుగు తొలగిన నేపథ్యంలో హమ్జా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? శత్రుదేశంలో ఉంటూనే, తన దేశాన్ని కాపాడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? భారత్‌లోని రాజకీయ, సామాజిక అంశాలను అక్కడ నుండి ఎలా ప్రభావితం చేశాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కేంద్రంలో పార్టీ మారిన తర్వాత జరిగిన సంఘటనలు, అందుకు అతను పాకిస్తాన్ నుంచి ఎలాంటి సహకారం అందించాడు అనేవి ఉత్కంఠను కలిగిస్తాయి. విశేషం ఏమంటే... అండర్ కవర్ ఆపరేషన్ నిమిత్తం శత్రుదేశానికి వెళ్ళిన ఓ ఏజెంట్... కొన్ని సందర్భాలలో ఎలా నిస్సహాయుడిగా ఉండాల్సి వస్తుంది? తన వాళ్ళు కళ్ల ముందే హతమౌతుంటే ఎలా భావోద్వేగాలను దాచిపెట్టుకోవాల్సి ఉంటుందనేది కథానాయకుడి ద్వారా తెలియచేయడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అదే డ్రామాను ఈ ద్వితీయభాగంలో ఆదిత్య ధర్ సమర్ధవంతంగా ప్లే చేశాడు. ఆ రకంగా ఈ సీక్వెల్‌లో సెంటిమెంట్‌కు పెద్ద పీట వేశాడు. పైగా ఒకసారి హమ్జా గతం తెలిసిన తర్వాత అతను చేసే హింసకు జస్టిఫికేషన్ ఇచ్చినట్టు అయిపోయింది.
గత యేడాది డిసెంబర్‌లో 'ధురంధర్' మూవీ విడుదలైనప్పుడు కొందరు దాన్ని ప్రాపగాండ మూవీ అని ప్రచారం చేశారు. మరికొందరు మనచుట్టూ ఉన్న వాస్తవాలను ఆదిత్యధర్ ధైర్యంగా తెరకెక్కించాడని కితాబిచ్చారు. అయితే విమర్శకుల నోళ్ళను మూయిస్తూ సాధారణ సినీ జనం 'ధురంధర్'ను విశేషంగా ఆదరించారు. దాంతో ఆదిత్య ధర్‌కు తాను ఎంచుకున్న పంథా సరైనదేననే భావన కలిగింది. అందువల్ల మరింత బలంగా తాను చెప్పాలనుకున్న కథను ఈ సీక్వెల్‌లో చెప్పారు. అది ప్రతి సన్నివేశంలో కనిపిస్తోంది. కేంద్రంలో బలమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఆటలను మన సీకెట్ర్ ఏజెంట్లు ఎలా కట్టించ గలిగారు? దెబ్బకు దెబ్బ ఎలా తీశారు? తీవ్రవాదులు చేసిన దాడులకు కొన్ని సందర్భాలలో కుదేలైనా... తిరిగి ఎలా పగ తీర్చుకున్నారు? అకస్మాత్తుగా తీసుకున్న నోట్ల రద్దువల్ల నిజానికి ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లింది? ఉత్తర ప్రదేశ్ లాంటి చోట్ల ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి విదేశాల్లోని మన ఏజెంట్ల ద్వారా ఎలాంటి పథక రచన చేశారు? అనే అంశాలను ఆసక్తికరంగా చూపించారు. ఉగ్రవాదులకు భారత్‌లో గత పదేళ్ళుగా జరుగుతున్న సంఘటనలు పీడకలలుగా ఎలా పరిణమించాయనే అంశాలను తెర మీద చూపించినప్పుడు సహజంగానే థియేటర్లు విజిల్స్‌తో మారు మ్రోగుతాయి. ఆ రకంగా ప్రేక్షకుల పల్స్ పట్టుకుని ఆదిత్యధర్ అలాంటి సన్నివేశాలను రూపకల్పన చేశారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలలో అతిశయోక్తి చోటుచేసుకుంది. అలానే హింసా మోతాదుకు మించి ఉంది. ఇక క్లయిమాక్స్ అయితే మరో రేంజ్‌లో సాగింది. ప్రేక్షకులు ఎలాంటి ముగింపును కోరుకుంటారో అదే ఆదిత్య ధర్ అందించాడు.
చిత్రం ఏమంటే.. అందరూ అనుకుంటున్నట్టుగా దీనికి మరో సీక్వెల్ ను ప్రకటించలేదు. ప్రథమార్థం కాస్తంత నిదానంగా సాగినా... ద్వితీయార్థం నుండి సినిమా ఊపందుకుంది. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్న ఈ సినిమాను కొంత మేరకు ట్రిమ్ చేసి ఉంటే మరింత బాగుండేది. 'ధురంధర్' మాదిరిగానే ఈ సీక్వెల్‌నూ ఎపిసోడ్స్ గా చూపించారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ రెండు సార్లు కనిపిస్తారు. 2014లో ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత డీమోనిటైజేషన్ ప్రకటన సందర్భంలోనూ ఆయన్ని చూపించారు. అందుకు ఒరిజినల్ ఫుటేజ్‌నే వాడారు. మోదీ అధికారంలోకి తర్వాత జరిగిన కొన్ని కీలక సంఘటనలు ఉగ్రవాదుల కలలను ఎలా ఛిద్రం చేశాయో చూపించిన వైనం ఆసక్తికరంగా ఉంది.
నటీనటుల విషయానికి వస్తే... 'ధురంధర్'లో రణవీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నాకూ మంచి పేరు వచ్చింది. కానీ ఈ సీక్వెల్ మొత్తాన్ని రణవీర్ సింగ్ తన భుజానికి ఎత్తుకుని నడిపించాడు. మరికొన్ని కీలక పాత్రలు ఉన్నా... ఇదంతా వన్ మ్యాన్ షోనే తలపించింది. యాక్షన్ సన్నివేశాల్లోనే కాకుండా సెంటిమెంట్ సీన్స్ లోనూ రణవీర్ అద్భుత నటన కనబర్చాడు. అతని భార్యగా నటించిన సారా అర్జున్ కు ఈ సినిమాలో పెద్దంత స్కోప్ లేదు. అయితే ఆమె కనిపించే మూడు నాలుగు సన్నివేశాలలో తన మార్క్ వేసింది. అర్జున్ రాంపాల్ నటన ఆకట్టుకుంటుంది. మొదటి సినిమాలో మాదిరి గానే సంజయ్ దత్ కాస్తంత వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాడు. అయితే అసలైన వినోదం ప్రేక్షకులకు జమీల్ జమాలీ పాత్ర పోషించిన రాకేశ్ బేడీ నుండి లభించింది. మాధవన్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులంతా పాత్రల పరిధిమేరకు నటించారు. ఈ సినిమాకు మెయిన్ ఎసెట్ శాశ్వత్ సచిదేవ్ అందించిన సంగీతం. సన్నివేశాలను అతని నేపథ్య సంగీతంతో బాగా ఎలివేట్ చేశాడు. కథను లోతుగా చెప్పడంతో కాకుండా... విజువల్స్ ను స్టైల్ గానూ, యాక్షన్ ను గ్లోరిఫై చేయడం ద్వారాను ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆదిత్య ధర్ చూశారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. దాంతో 'ధురంధర్ : ది రివేంజ్' మూవీ మస్ట్ వాచ్ కేటగిరిలోకి చేరిపోయింది.
రేటింగ్: 3.25/5
ట్యాగ్ లైన్: పైసా వసూల్ స్పై డ్రామా