సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సినిమా రివ్యూ: ధర్మస్థల నియోజకవర్గం

ABN, Publish Date - Sep 04 , 2026 | 10:22 AM

‘ధర్మస్థల నియోజకవర్గం’.. ఈ టైటిల్ చూస్తుంటేనే ఇదొక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ అనే విషయం అర్థమవుతోంది. గత వారం, పది రోజులుగా ఈ సినిమా పేరు బాగా వైరల్ అవుతోంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రివ్యూ.

Dharmasthala Niyojakavargam Review

‘ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam).. ఈ టైటిల్ చూస్తుంటేనే ఇదొక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ అనే విషయం అర్థమవుతోంది. గత వారం, పది రోజులుగా ఈ సినిమా పేరు బాగా వైరల్ అవుతోంది. అందుకు కారణం ఆస్కార్ విజేత చంద్రబోస్ చెప్పిన మాటలే. తను అందించిన సాహిత్యం పరంగా.. ‘రంగస్థలం’ తర్వాత అంతటి సంతృప్తిని ఇచ్చిన చిత్రమిదని ఆయన చెప్పడంతో.. నార్మల్‌గానే సినిమాపై క్రేజ్ ఏర్పడింది. ఆయన నుంచి వచ్చిన పాటలు, ఇందులోని తారాగణం, టీజర్, ట్రైలర్.. వంటివన్నీ సినిమాను చూడాలనిపించే ఆసక్తిని పెంచాయి. సీనియర్ నటులు సాయి కుమార్, సుమన్, కస్తూరి వంటి వారంతా నటించిన ఈ సినిమాలో ఉన్న అసలు విషయం ఏంటో రివ్యూలో తెలుసుకుందాం.

కథ: (Dharmasthala Niyojakavargam Story)

తను లెక్చరర్‌గా పని చేస్తున్న కాలేజ్ యాజమాన్యమే మాదక ద్రవ్యాలతో స్టూడెంట్స్ జీవితాన్ని నాశనం చేస్తున్నారని తెలిసి.. యాజమాన్యానికి వ్యతిరేకంగా అరుంధతి (వితికా షేరు) పోరాటం చేస్తుంటుంది. ఈ పోరాటంలో తన స్టూడెంట్స్ బద్రి (నటరాజ్), ఈషా (రాయంచ కొక్కుర) సపోర్ట్‌తో మార్పు కోసం ప్రయత్నిస్తుంటుంది. కాలేజ్‌లో స్టూడెంట్స్ ఎంత మంది పెరిగితే అంత బిజినెస్ పెరుగుతుందని భావించే యాజమాన్యం వాసుదేవ్ (రాజీవ్ కనకాల), అతని భార్య (కస్తూరి) ఆగడాలను పోలీసులకు, ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే బైర్రాజు (సాయి కుమార్) దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం ఉండదు. అంతా వాసుదేవ్ మనుషులే కావడంతో అరుంధతి పోరాటాన్ని ఎవరూ పట్టించుకోకపోగా, తిరిగి వార్నింగ్ ఇస్తారు. అయినా అరుంధతి తన పోరాటాన్ని ఆపదు. ఈ క్రమంలో బద్రి దారుణమైన హత్యకు గురవుతాడు. అసలు బద్రిని చంపింది ఎవరు? బద్రి చావుకు అతని తండ్రి టీ కొట్టు నడుపుకునే ఈశ్వరయ్య (సుమన్) ఎలా పగ తీర్చుకున్నాడు? ధర్మస్థల నియోజకవర్గానికి బంగ్లాదేశ్, శ్రీలంక అల్లర్లకు ఉన్న లింకేంటి? అసలు ధర్మస్థల నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? చివరికి అరుంధతి, తన పోరాటంలో విజయం సాధించిందా? అమెరికాలో ఉండే అరుణ్ (వరుణ్ సందేశ్)కు, ధర్మస్థల నియోజకవర్గానికి ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం.


విశ్లేషణ:

రాజవంశానికి చెందిన బైర్రాజు.. రాజరికం పోయి రాజకీయాలు వచ్చిన తర్వాత వరుసగా 7 సార్లు ధర్మస్థల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఆ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా, దానికి అడ్డుపడుతూ.. పేదవాళ్ల పొట్టను కొట్టి కోట్లు సంపాదించినట్లుగా బైర్రాజు పాత్రతో ఆ నియోజకవర్గపు పరిస్థితిని ఫస్ట్ సీన్‌తో దర్శకుడు రివీల్ చేయడం బాగుంది. బైర్రాజు అండతో వాసుదేవ్, అతని భార్య విశ్వ(శివ)ని అడ్డుపెట్టుకుని కాలేజ్‌లో నడిపే మాదకద్రవ్యాల బిజినెస్‌తో స్టూడెంట్స్ జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనేది చూపించి, బర్నింగ్ టాపిక్‌ని దర్శకుడు టచ్ చేశాడు.. అక్కడి నుంచి ఎలా ముందుకు తీసుకెళతాడో అనే ఉత్కంఠని ప్రేక్షకులలో కలిగించాడు. దర్శకుడు జై జ్ఞాన ప్రభ తీసుకున్న ఈ రెండు పాయింట్స్ (మాదక ద్రవ్యాలు, పాలిటిక్స్) హిట్ ఎలిమెంట్సే. కానీ, తొలి చిత్రం కావడంతో అనుభవలేమీ.. హిట్‌కు అడుగడుగునా అడ్డుపడిందనే చెప్పాలి. (Dharmasthala Niyojakavargam Review)

సాయి కుమార్‌ను హీరోగా చూపించాలంటే ‘పోలీస్ స్టోరీ’ని, విలన్‌గా చూపించాలంటే ‘ప్రస్థానం’ చిత్రాన్ని బీట్ చేసేలా పాత్ర ఉండాలి. డైలాగ్ కింగ్ కదా అని.. ఆయన కనిపించిన ప్రతిసారి డైలాగ్స్ చెప్పించడంపైనే దృష్టి పెట్టారు. ఇక సుమన్ పాత్రకు ఇంకాస్త ఎమోషన్ జోడించవచ్చు. తండ్రీకొడుకులుగా సరైన సన్నివేశాలు కూడా వారికి పడలేదు. కస్తూరి వంటి నటి ఫస్ట్ టైమ్ విలన్‌గా చేస్తుందంటే.. అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఆమె ప్రీ రిలీజ్ వేడుకలో ఇచ్చిన స్పీచ్‌కి, ఆమె పాత్రకి అసలు పొంతనే లేదు. ఆమె పాత్రను ఇంకాస్త వైవిధ్యంగా చూపించాల్సింది. రాజీవ్ కనకాల, పాత్రకు చాలా భారంగా కనిపించాడు. హీరోగా చేసిన నటుడు సత్య ప్రకాశ్ తనయుడు నటరాజ్ పాత్రలో సహజత్వం కొరవడింది. ఉన్నంతలో వితికా, వరుణ్ సందేశ్, హీరోయిన్ రాయంచ పాత్రలు పర్లేదు. ఫస్టాఫ్ అంతా కాలేజ్‌లో మాదకద్రవ్యాలు, సెకండాఫ్ అంతా సుమన్ రాజకీయం అన్నట్లుగా కథని నడిపించారు. దర్శకుడు జ్ఞాన ప్రభ తీసుకున్న, రాసుకున్న పాయింట్స్‌ చాలా బలమైనవి. ఈ కాన్సెప్ట్స్‌తో చాలా సినిమాలు వచ్చాయి. వాటిని అందుకునే రేంజ్, లేదంటే.. వాటిని మించే రేంజ్‌లో సినిమా తీస్తేనే.. ఇలాంటి సినిమాలకు జనాలు క్యూ కడతారు. దర్శకుడు చెప్పాలనుకున్న విషయం చాలా పదునైనది.. చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన సబ్జెక్ట్. కానీ, తెరపై సీనియర్ నటీనటులు ఎక్కువగా ఉండటంతో సీన్లు సీన్లుగా వారిని హైలెట్ చేయడంతో.. చెప్పాల్సిన సబ్జెక్ట్ మిగిలే ఉందని అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో చూపించిన సమస్యకు సెకండాఫ్‌లో చోటే లేదు. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల్లో అల్లర్లు సృష్టించిన సంస్థ.. ధర్మస్థల నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఏంటో అర్థం కాదు. అసలు ఆ పాయింట్‌తో ఏం చెప్పదలుచుకున్నారో కూడా క్లారిటీ లేదు. మొత్తంగా అయితే.. వితికా షేరు కనిపించే కొన్ని సీన్లు, వరుణ్ సందేశ్ కనిపించే రెండు సీన్లు, డైలాగ్స్, పాటలు మినహా.. ఈ సినిమాలో కొత్తదనం అంటూ ఏమీ లేదు. వేరే ఆప్షన్ ఏదీ లేకుంటే ఓసారి ట్రై చేయవచ్చు అంతే.


కాలేజ్ కుర్రాడిగా నటరాజ్‌కు మంచి పాత్రే లభించింది. నటరాజ్ విషయంలో ఇంటర్వెల్ సీన్ షాకింగ్‌గా అనిపిస్తుంది. రాయంచకు చేయడానికి పెద్దగా ఏమీ లేదు. వితికా షేరు ఫస్ట్ టైమ్ ఒక బాధ్యతాయుతమైన పాత్రలో నటించింది. ఆమె, తన పాత్రకు న్యాయం చేసింది. వరుణ్ సందేశ్ కనిపించే రెండు సీన్లలో.. తన నటనతో ఆకట్టుకున్నారు. సాయి కుమార్, సుమన్‌లకు ఇలాంటి పాత్రలు కొత్తేం కాదు. వారి పాత్రల నుంచి ఇంకా కొత్తదనం ఆశించేవారికి మాత్రం నిరాశ తప్పదు. తనకు దర్శకుడు ఇచ్చిన పాత్రకు కస్తూరి న్యాయం చేసింది.. కానీ చాలా రొటీన్‌ పాత్ర అది. యంగ్ విలన్‌గా విశ్వ పాత్రలో శివ మెప్పిస్తాడు. ఇంకా రాజీవ్ కనకాల, షఫీ, రాజా రవీంద్ర, పృథ్వీ, ప్రభాకర్ వంటి వారంతా సీన్ రాగానే వచ్చి హాజరు వేయించుకున్నట్లుగా కనిపిస్తారు. టెక్నికల్‌గా చంద్రబోస్ సాహిత్యం ఈ సినిమాకు ప్లస్. మ్యూజిక్, ఎడిటింగ్, నిర్మాణ విలువలు, ఇంకా ఇతర సాంకేతిక నిపుణుల పనితీరు ఓకే అంటే ఓకే. ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని దర్శకుడు చేసిన ఈ ప్రయత్నం రొటీన్‌గానే సాగింది.

ట్యాగ్‌లైన్: అభివృద్ధిలేని ‘ధర్మస్థల నియోజకవర్గం’

రేటింగ్: 2.5/5

Updated Date - Sep 04 , 2026 | 10:26 AM