The Odyssey Review: క్రిష్టోపర్ నోలన్.. ది ఒడిస్సీ మూవీ రివ్యూ
ABN , Publish Date - Jul 17 , 2026 | 02:48 PM
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ది ఒడిస్సీ థియేటర్లకు వచ్చేసింది.
రెండేళ్ళ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ది ఒడిస్సీ (The Odyssey). అవతార్, అవెంజర్స్, స్పైడర్ మ్యాన్, డ్యూన్ వంటి సినిమాలను మించి రిలీజ్‌కు ఏడాది ముందు నుంచే విపరీతమైన హైప్ క్రియేట్ చేసుకుంది. అంతేగాక ఏడాది ముందుగానే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారంటే ప్రేక్షకులు ఈ సినిమా విషయంలో ఎంత ఆసక్తితో ఉన్నారో అర్థం అవుతుంది. దీనంతటికి కారణం ఈ చిత్ర కథ. ఇది అందరికీ తెలిసిన గ్రీకు పురాణ గాధ కాగా అన్నింటికీ మించి క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) దర్శకత్వం వహించడమే. అలాంటి ఈ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్‌గా థియేటర్లకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది, సినీ లవర్స్‌ను అంచనాలను అందుకుందా లేదా అనేది తెలుసుకుందాం.
కథ విషయానికి వస్తే:
ఇథికా రాజ్యాన్ని పరిపాలించే ఒడిసీస్ తన భార్య పెనలోప్, ఏడాది వయసున్న కుమారుడు టెలి మాకస్ ని రాజ్యంలోని ఉంచి మరి కొన్ని రాజ్యాలకు సంబంధించిన రాజులతో కలిసి తమపై నిరంకుశ పాలన సాగిస్తున్న ట్రాయ్ రాజ్యంపై దండెత్తుతాడు. ఏళ్లు గడుస్తున్నా రాజ్యం లోపలకు వెళ్ళలేక పోతారు. ఆ యుద్ధం కూడా ఓ కొలిక్కి రాదు. దీంతో ఒడియాసిస్ అక్కడి నుంచి వెళ్లి పోయినట్లు నమ్మించి అప్పటికే ప్రత్యేకంగా తయారు చేయించిన ఓ భారీ సైజు గుర్రం ప్రతిమ (ట్రోజన్)ను సముద్రం తీరంలో వదిలేస్తారు. కొన్ని రోజులకు ఇదేదో వింతగా ఉందని భావించిన ట్రాయ్ రాజ్యం వారు ఆ ట్రోజన్ ప్రతిమను లోపలకు తీసుకు వస్తారు. అందులోనే సైనికులతో కలిసి దాక్కుని ఉన్న ఒడియాసిస్ ఓ రోజు రాత్రి దానిని నుంచి బయటకు వచ్చి ఆ రాజ్యాన్ని జయిస్తాడు.
ఇదిలాఉంటే.. ట్రాయ్ యుద్దంలో గెలిచిన ఓడిసీస్ తిరిగి తన రాజ్యానికి సముద్ర మార్గంలో బయలు దేరుతాడు. కానీ మధ్యలోనే ఆహారం అయిపోవడంతో ఓ దీవిలోకి వెళతారు. అనుకోకుండా సముద్ర దేవుడు కుమారుడు ఒంటి కన్ను రాక్షసుడి గుహలో చిక్కుకుపోతారు. అక్కడి నుంచి బయట పడే క్రమంలో ఒడిసీస్ ఆ రాక్షసుడి కన్ను పోగొడతారు. దీంతో ఒడిసిస్, ఆయన సైన్యం సముద్ర దేవుడి శాపానికి గురవుతారు. అందువల్ల వారి ప్రయాణం సజావుగా సాగగా అనేక మార్లు అవాంతరాలు ఎదురై దారి తప్పుతారు. ఓ మారు మంత్రెగత్తె చెరలో చిక్కుకుని ఒడిసీస్ మినహా అంతా పందుల లాగా మారుతారు. ముందే పసిగట్టిన ఒడిసిస్ మంత్రగత్తెను మెప్పించి తన వారిని రక్షించి రాజ్యానికి వెళ్ళడానికి మార్గం తెలుసుకుంటాడు. అయితే మధ్యలో ఒక్కడే ఓ ఐస్‌ల్యాండ్‌లో కాలిప్సో తో ఉండి పోతాడు. అలా.. కొన్నేళ్ళు గడిచాక ఒడిసీస్‌కు గతం కొద్దికొద్దిగా గుర్తుకు వచ్చి, చివరకు తనకు ఓ కుటుంబం ఉందని తెలుసుకుని తిరిగి తన రాజ్యానికి వెళతాడు.
మరోవైపు... ఓడిసీస్ తన ఇథికా రాజ్యాన్ని విడిచి వెళ్లి ఇరవై ఏండ్లు గడుస్తున్నప్పటికీ ఆయన భార్య ఫినలోప్, కుమారుడు టెలి మాకస్ ఓడిసస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అక్కడి జూస్ మత ఆచారాల ప్రకారం భర్త లేని రాణి సమంత రాజులలో సమర్థవంతమైన వారిని పెళ్లి చేసుకోవాలసి ఉంటుంది. కానీ రాణి మరో వివాహానికి ఒప్పుకోక పోవడం, ఆమెను ఎలాగైనా వివాహం చేసుకుని ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని ఆంటినోస్ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఓడిసీస్ తన రాజ్యానికి ఇరవై యేళ్ళ తర్వాత వచ్చి, అక్కడి పరిస్థితులను గ్రహించి, ఎలా భార్య, పుత్రుడిని దక్కించుకుని, తిరిగి రాజ్యాధికారాన్ని చేపడతాడు అనేదే కథ.

విశ్లేషణ:
ఒడిస్సీ.. కథ దాదాపు అందరికీ తెలిసిందే కావడంతో విజువల్‌గా ఏ స్థాయిలో ఉంటుందో అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఎక్కడా డీవియేషన్ లేకుండా సినిమా సాగింది. అంతేగాక నోలన్ ప్రతి సినిమాలో మాదిరిగానే ఇందులోను టైం, ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేశాయి. అదేవిధంగా స్క్రీన్ ప్లే అరటిపండు తోలు తీసి పిల్లలకు తినిపించిన విధంగా అందరికీ అర్థమయ్యేలా సాగింది. ఒడీసియస్ తన గతం మరిచిపోయి కాలిప్సోతో కలిసి జీవించడం, మధ్యలో తన గతాన్ని గుర్తు చేసుకుంటూ జరిగిన కథను, ఎదుర్కొన్న సవాళ్ళను, వాటిని అధిగమించిన విధానాన్ని ఒక్కొక్కటిగా వివరించిన తీరు ఆకట్టుకుంటుంది. మరోవైపు తన రాజ్యంలో జరిగే పరిణామాలు, అక్కడ భార్య, కుమారుడు ఎదుర్కొనే సవాళ్లను చూపిస్తూ రక్తి కట్టించారు. ట్రోజన్ వార్, సముద్రంలో జరిగే సన్నివేశాలు మైండ్‌బ్లోయింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా రాజ్యానికి మార్గం కనిపెట్టే క్రమంలో అప్పటి వరకూ యుద్దంలో చనిపోయిన వారి ఆత్మలను కలవడం అక్కడ వచ్చే ట్విస్టు, చెప్పే మాటలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అయితే హిస్టారికల్ సినిమా కాబట్టి యుద్దాలు, విజువల్స్, అడ్వెంచర్స్ అదిరిపోతాయని అశించి ఈ మూవీకి వస్తే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు. సినిమా 75 శాతం డ్రామా తరహాలోనే సాగుతూ హీరో మానసికంగా ఎలా స్ట్రగుల్ అయ్యాడు, ట్రోజన్ వార్ ఎలాంటి మార్పు తీసుకు వచ్చింది అనే నేపథ్యంలోనే సాగుతుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
ఇక సినిమా నటీనటుల విషయానికి వస్తే ఒడిస్సీస్ పాత్రలో మ్యాట్ డామన్, భార్యగా ఫెనలోప్ పాత్రలో అన్నా హాత్‌వే, కుమారుడిగా 'స్పైడర్ మ్యాన్' ఫేమ్ టామ్ హాలెండ్ జీవించేశారు. ఆపై దేవతలు కాలిప్సోగా ఛార్లెస్ థెరాన్, అథీనాగా జెండయా ఎలాగైనా రాణిని పెళ్లి చేసుకోవాలని కుట్రలు పన్నే ఆంటినోస్‌గా రాబర్ట్ పాటినస్ లు తమ పాత్రలతో మెప్పించారు. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా లుడ్విగ్ గోరాన్సన్ అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ఇంకా చెప్పాలంటే మరో లెవల్‌కు తీసుకెళ్లిందని అనడంలో సందేం లేదు. అంతేకాదు రియాలిటీ కోసం పురాతన కాలంలో అధికంగా ఉపయోగించిన బ్రోంజ్ ఇన్‌స్ట్రూమెంట్లను ఈ సినిమా కోసం వాడినట్లు సమాచారం. ఇక డీవోపీ హోయ్ట్ వాన్ హోయ్టెమా పనితనం ప్రతి ఫ్రేమ్‌లో కనిపించి అబ్బుర పరుస్తుంది. ఇన్ స్టా స్టెల్లార్ నుంచి నోలన్‌తో కలిసి పని చేస్తున్న హోయ్ట్ వాన్ తాను ఎంత ప్రత్యేకమో మరో సారి రుజువు చేశాడు. ఇక చివరగా దర్శకుడు నోలన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. తన చిరకాల కాంక్షకు తెర రూపం ఇస్తూ ఆయన రాసుకున్న స్క్రిప్టు, డైరెక్షన్ అన్నీ అంతకుమించి అనేలా ఉన్నాయి. తన గత చిత్రాల మాదిరిగానే ఇందులోనూ ఫ్యామిలీ ఎమోషన్స్‌కే పెద్ద పీట వేయడం ముచ్చటేస్తుంది.
ట్యాగ్ లైన్: నోలన్ మామ మళ్లీ మాయ చేశాడు!
రేటింగ్: 3/5