సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chandrayaan Review: చంద్రయాన్‌.. మూవీ ఎలా ఉందంటే..

ABN, Publish Date - Nov 14 , 2026 | 12:16 PM

నీది నాది ఒకే కథ’, ‘విరాటపర్వం’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న వేణు ఉడుగుల సమర్పణలో ‘చంద్రయాన్‌’ చిత్రం తెరకెక్కింది. శ్రీనాథ్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించారు. ప్రవీణ్‌ మొలక నిర్మాత. శివకుమార్‌ ఢీకొండ, స్వప్న ప్రియాంక జంటగా నటించారు.

సినిమా రివ్యూ: చంద్రయాన్‌

‘నీది నాది ఒకే కథ’, ‘విరాటపర్వం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న వేణు ఉడుగుల ఈ మధ్య నిర్మాతగా మారి 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాను మిత్రులతో కలిసి నిర్మించారు. తాజాగా ఆయన సమర్పణలో ‘చంద్రయాన్‌’ చిత్రం సైతం నిర్మితమైంది. దీనికి శ్రీనాథ్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించారు. ప్రవీణ్‌ మొలక నిర్మాత. మందమర్రి గ్రామంలో నలుగురు కుర్రాళ్లు చేసిన అంతరిక్ష ప్రయోగం నేపథ్యంలో 'చంద్రయాన్‌' తెరకెక్కింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి గ్రామంలో శివ, రవి, రాజు, చిన్నా మధ్య మంచి స్నేహం ఉంటుంది. ఈ నలుగురూ పనీపాట లేకుండా ఊళ్లో తిరుగుతుంటారు. వీరిలో శివ ఏ పని చేయాలన్నా ‘పీకినవ్‌ తీయ్‌’ అంటూ కాలం గడిపేస్తుంటాడు. రెండోవాడు తుమ్ము వచ్చినా ముహూర్తం చూస్తాడు. మూడోవాడు ప్రతి విషయానికి గూగుల్‌ మీద ఆధారపడతాడు. ఇక నాలుగోవాడు చిన్నా కాస్త తెలివిగా వ్యవహరిస్తుంటాడు. అయితే ఆ ఊరి వారంతా ఈ నలుగురిని ఊరికి పట్టిన శనిగ్రహంలా చూస్తారు. వీరిలో శివ అదే గ్రామానికి చెందిన బిందు అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఊళ్లో ఆవారాగా తిరిగే అతన్ని బిందు అసలు లెక్కచేయదు. ‘ఏం సాధించావని నిన్ను ప్రేమించాల'ని అంటుంది. దాంతో శివ ఆలోచనలో పడతాడు. స్నేహితులతో కలిసి ఏదొకటి చేసి, ఊళ్ల్లో గొప్పోడిగా నిరూపించుకుని, బిందూని సొంతం చేసుకోవాలనుకుంటాడు. అందులో భాగంగా రాకెట్‌ తయారు చేసి.. చందమామ మీదకి వెళ్లానుకుంటారు. ఆ ఊళ్లో ఉన్న సదుపాయాలతో రాకెట్‌ను ఎలా తయారు చేశారు? వాళ్ల ప్రయోగం ఫలించిందా? బిందూ శివ సొంతమైందా? అసలు ‘చంద్రయాన్‌’కు ఈ యువకుల ప్రయోగానికి సంబంధం ఏమిటీ? అన్నది కథ.


విశ్లేషణ:

పల్లెటూరిలోని నలుగురు కుర్రాళ్ళు రాకెట్‌ తయారు చేసి చంద్రమండలానికి వెళ్లాలని చేసే ప్రయత్నమే 'చంద్రయాన్'. ఫస్టాఫ్‌ అంతా నలుగురు కుర్రాళ్లు చేసే అల్లరి, ఊళ్లో జనాల తిట్లు, భవిష్యత్తులో ఎదగాలంటే ఏం చేయాలనే ఆలోచనతో సాగిపోతుంది. ఇంటర్‌వెల్‌ సమయానికి సమాజంలో గౌరవం ఉండాలంటే ఏదో ఒకటి సాధించాలని గ్రహించి ప్రయోగం మొదలుపెడతారు. చంద్రుడిపైకి వెళ్లాలనే గ్రామీణ యువకుల కలను వినోదాత్మకంగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. అయితే రాకెట్‌ తయారీ, చంద్రుడి మీదకు వెళ్లడం అంటే అంత సులభమైన పని కాదు. సైంటిఫికల్‌గా చాలా లాజిక్కులు ఉంటాయి. అవన్నీ పాటించాలి. కానీ ఇక్కడ దర్శకుడు అవేమీ పట్టించుకోలేదు. ఒక మెకానిక్‌ షెడ్డు, ఆ పరిసర ప్రాంతాల్లో దొరికే సామాగ్రితో రాకెట్‌ చేసేయడం అనేది యాక్సెప్టబుల్‌గా అనిపించదు. అయితే దీని వెనకాల ఆలోచన, పడ్డ కష్టం మెచ్చుకోదగ్గది. ఒక ప్రయత్నం ఫెయిల్‌ అయితే.. దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఇంకో ఆలోచన రావడం, దానిని ఎగ్జిక్యూట్‌ చేసి సక్సెస్‌ కావడం.. ఈ ప్రాసెస్‌ అంతా చూడటానికి బావుంది. రాకెట్‌ లాంచ్‌ చేసే ప్రాసెస్‌ మాత్రం ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. కథ విషయంలో కొత్తగా ఆలోచించిన దర్శకుడు దానిని విజువల్‌గా ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. రాకెట్‌ తయారు చేయడం.. దానిని అంతరిక్షంలోకి పంపడం... ఈ ప్రాసెస్‌ అంతా నవ్వుల పువ్వులు పూయించింది. హీరో పాత్ర ‘పీకినవ్‌ తీయ్‌’ అని సినిమా మొత్తంలో ఓ పాతిక సార్లు అనడం, ఈ నలుగురు యువకులకు ఉన్న సిగ్నేచర్‌ డాన్స్‌ స్టెప్‌ ఒకటి తెరపై మాటిమాటికి కనిపించడంతో బోర్‌ ఫీల్‌ కలిగించింది. స్నేహితుల తోడు ఉంటే అనుకున్నది సాధించవచ్చని, నిజమైన స్నేహితుల మధ్య బాండింగ్‌ ఎంత బలంగా ఉంటుందో బాగా చూపించారు. ఏదైనా పని అనుకుంటే అది సక్సెస్‌ అయినా ఫెయిల్‌ అయినా.. ప్రయత్న లోపం ఉండకూడదని దర్శకుడు చెప్పాడు. ఈ విషయాలను మాత్రం ప్రేక్షకుల్ని కన్విన్స్‌ చేసేలా చూపించారు. శివ బృందం తయారు చేసి ఆకాశంలోకి వదిలిన రాకెట్‌ను.. చంద్రయాన్‌తో పోల్చడం కాస్త హాస్యస్పదంగా అనిపిస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే...

శివకుమార్‌ ఢీకొండ, హీరోగా శివకుమార్‌ ధీకొండ బాగానే చేశాడు. కానీ పీకినవ్‌ తీయ్‌ అనే పదంతో విసుగు పుట్టించాడు. రవి శివతేజ, వంశీధర్‌ గ్రామీణ యువకులుగా మెప్పించారు. తెలంగాణ అమ్మాయిగా స్వప్న ప్రియాంక బాగా చేసింది. నటనకు పెద్ద స్కోప్‌ లేకపోయినా ఉన్నంతలో పాత్రకు న్యాయం చేసింది. 'బలగం' సత్యనారాయణతోపాటు గ్రామస్తులుగా నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు. శ్రీనివాస్‌ బి కెమెరా వర్క్‌ బావుంది. పల్లె అందాలను నేచురల్‌గా చూపించారు. హర్ష ప్రవీణ్‌ సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. నేపథ్య సంగీతం బాగా కుదిరింది. సెకెండాఫ్‌ బాగా ల్యాగ్‌ ఉంది. ఎడిటర్‌ పుల్లారావు ఇంకాస్త వర్క్‌ చేసుంటే సినిమా క్రిస్ప్‌గా ఉండేది. ముఖ్యంగా సెకెండాఫ్‌ వేగంగా సాగేది. నిర్మాణ విలువలు బావున్నాయి. మేకర్స్ చేసిన ప్రయత్నం మంచిందే కానీ మెప్పించే అంశాలు ఇందులో తక్కువ ఉన్నాయి.

ట్యాగ్‌లైన్‌: ప్రయత్నం మంచిదే కానీ...

రేటింగ్‌: 2.25/5

Updated Date - Nov 14 , 2026 | 02:06 PM