సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సినిమా రివ్యూ: చకోర

ABN, Publish Date - Oct 09 , 2026 | 09:07 AM

అక్టోబర్ రెండో వారంలో పెద్ద చిత్రాల సందడి లేకపోవడంతో చిన్న చిత్రాలు క్యూ కట్టాయి. అందులో పూరి జగన్నాథ్ శిష్యుడు మంగా శ్రీనివాస్ (Manga Srinivas) దర్శకత్వం వహించిన ‘చకోర’ (Chakora)ఒకటి.

సినిమా రివ్యూ: చకోర (Chakora)
విడుదల తేది:
9-10-2026


అక్టోబర్ రెండో వారంలో పెద్ద చిత్రాల సందడి లేకపోవడంతో చిన్న చిత్రాలు క్యూ కట్టాయి. అందులో పూరి జగన్నాథ్ శిష్యుడు మంగా శ్రీనివాస్ (Manga Srinivas) దర్శకత్వం వహించిన ‘చకోర’ (Chakora)ఒకటి. శ్రవణ్, మలైకా టి వాసుపల్, అనుష్క లూహార్ నటీనటులు. యామిని, ఎల్ బి శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, సుదర్శన్ కీలక పాత్రధారులు. చింతాడ హేమారావు నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ:
రావణ బ్రహ్మ (శ్రవణ్) రాజమండ్రిలో చదువు పూర్తి చేసి ఫైనాన్స్ చేస్తూ లైఫ్ ను  జాలీగా ఎంజాయ్ చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి తల్లి తనను చందమామ కథలు చెబుతూ పెంచుతుంది. దాంతో ఎలాగైనా జాబిల్లి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటాడు. డాక్టర్ చదివే జూలీ అలియాస్ జాబిలి (మలైక వాసుపల్) అతనికి తారసపడుతుంది. ఆమెలో అమ్మ చెప్పిన చందమామ కథల్లోని జాబిలి తారసపడటంతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఓ సందర్భంలో ఇద్దరి మధ్య మాట కలిసి దగ్గరవుతారు. రావణ తన ప్రేమను వ్యక్తపరిచే సమయానికి జాబిలి ఓ మెలిక పెడుతుంది. 24 గంటలపాటు తనకు దూరం ఉండాలని, మాట్లాడకూడదన్నది ఆ కండీషన్. ఆ తర్వాత ఏం జరిగింది. రావణ్ చకోర పక్షిలా ఆమె కోసం గోవా తదితర ప్రాంతాలలో ఎందుకు గాలించాడు. ఈ వెతుకులాటలో జాబిలి రావణకు కనిపించకుండానే అతని ప్రతి అడుగు గమనించడానికి కారణమేంటి? అసలు ఆమెకు ఏమైంది? వారిద్దరూ ఒకటయ్యారా? అనుష్క లుహార్ కు, రావణ్ కు మధ్య సంబంధం ఏంటి? అన్నదే ఈ ‘చోకోర’ కథ.


విశ్లేషణ:
చకోర పక్షికి, జాబిలికి ఉన్న సంబంధం గురించి అమ్మ చెప్పే చిన్న ప్రేమ కథ ఇది. దానిని ఈతరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఫస్టాఫ్ అంతా హీరోహీరోయిన్ల పరిచయం, జాబిలి లాంటి అమ్మాయిని ప్రేమలో దింపడం కోసం హీరో ప్రయత్నాలు… అమ్మాయి దార్లోకి రాకపోవడం వంటి సీన్స్ తో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇదంతా కథని అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ కు ముందు హీరోయిన్ పెట్టే కండీషన్, హీరోకి కనిపించకుండా అదృశ్యం కావడంతో సెకండాఫ్ పై  ఆసక్తి కలుగుతుంది. అక్కడి నుంచీ హీరో, హీరోయిన్ ని వెతికే క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? వాటి నుంచి ఏం నేర్చుకున్నాడు అన్నది ఆసక్తికరంగా సాగుతుంది. కంటికి కనిపించకుండా ఫోన్లోనే మాట్లాడుతూ జాబిలి ఎందుకు హీరో ఎమోషన్స్ తో  ఎందుకు ఆడుకుందన్నది దర్శకుడు ఎంతో పట్టుగా తెరకెక్కించాడు. అయితే ఆమె ఏదో సమస్యలో ఉందన్నది మాత్రం ఊహకు అందేలా ఉండటం పెద్ద మైనస్. ఆ సస్పెన్స్ దర్శకుడు మెయిన్టైన్ చేయలేకపోయాడు. ఇక రిపీటెడ్ సీన్స్ కాస్త విసుగు తెప్పిస్తాయి. ఫైనల్ గా మరో హీరోయిన్ అనుష్క లూహార్తో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది. చకోర పక్షికి దాహం వేస్తే ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగకుండా వర్షపు నీళ్లతోనే దాహం తీర్చుకుంటుంది. అలాగే జీవితంలో స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎంత కాలమైనా వేచి చూడాలని, దాని కోసం అలుపెరగని ప్రయత్నం చేయాలనే విషయాన్ని దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పాడు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..

హీరోగా శ్రవణ్ కు ఇది తొలి సినిమా. అయినా అనుభవం ఉన్న నటుడిలా పాత్రకు న్యాయం చేశాడు. లవ్ స్టోరీ కావడం, అతని వయసుకు తగ్గ పాత్ర కావడంతో ఈజ్ తో  చేసుకెళ్లిపోయాడు. హీరోయిన్ గా  మలైకా టి వాసుపల్ ఉన్నంతలో బాగానే చేసింది. సినిమా ప్రారంభం నుంచి స్టోరీ టెల్లర్ గా రావణ కథ మొత్తం చెప్పిన అనుష్క లుహార్ మెప్పించింది. చిన్నతనంలో తాను ఏ కలలు కన్నదో వాటిని నెరవేర్చుకునే దిశగా పయనించే పాత్రలో డీసెంట్ గా  కనిపించింది. చివరకు ఆమె ద్వారా వచ్చే ట్విస్ట్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. హీరో తల్లిదండ్రుల పాత్రల్లో బ్రహ్మాజీ, ఇంద్రజ తమ అనుభవాన్ని ఉపయోగించి నటించారు. హీరోయిన్ తండ్రిగా సుమన్ కాసేపు తళుక్కుమన్నారు. మిగతా ఆర్టిస్టుల పాత్రలన్నీ సోసోగా సాగాయి. సినిమాటోగ్రాఫర్ రుప్ప గోపీకృష్ణ పనితనం బావుంది. రాజమండ్రి, వైజాగ్, గోవా ప్రాంతాల అందాలను చక్కగా చూపించారు. ప్రిన్స్ హెన్రీ పాటలు, నేపథ్య సంగీతానికి పేరు పెట్టక్కర్లేదు. సంగీత దర్శకుడిగా కథకు న్యాయం చేశాడు. ఎడిటింగ్ ఓకె. నిర్మాణ విలువలకు పేరు పట్టక్కర్లేదు. తక్కువ లొకేషన్ లో తీసినా క్వాలిటీగా తీర్చిదిద్దారు. లవ్ సీన్స్ బాగా రాసుకున్న దర్శకుడు ప్రేమకథను బలంగా చెప్పాల్సిన సీన్స్ ల్లో మాత్రం పట్టు తప్పాడు. పూరి జగన్నాథ్ శిష్యుడు కాబట్టి హీరో పాత్రలో రఫ్నెస్ కనిపించింది. ఈ లవ్ స్టోరీ  జెన్జీ  ఆడియన్స్ కి  కొంత మేర నచ్చే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ అయిందనే విషయం ట్రేడ్ కే సరిగ్గా తెలియదు. సో చక్కని ప్రచారం చేసుకుని జనాల్లోకి బలంగా తీసుకుని వెళితే మంచి ఫలితం దక్కే ఛాన్స్ ఉంది.  

ట్యాగ్లైన్: ప్రచార లోపం...
రేటింగ్: 2.5/5

Updated Date - Oct 09 , 2026 | 11:59 AM