సినిమా రివ్యూ: 'బ్యాండ్ మేళం'
ABN, Publish Date - Mar 26 , 2026 | 11:09 AM
'కోర్ట్' మూవీతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మరో చిత్రం 'బ్యాండ్ మేళం'. బావమరదళ్ళ ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ జంట మళ్లీ మ్యాజిక్ చేశారా?
సినిమా రివ్యూ: బ్యాండ్ మేళం
‘కోర్ట్’ చిత్రంతో పాపులర్ అయిన హర్ష్ రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా రచయిత కోన వెంకట్ కోనా ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ పై తీసిన సినిమా ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నచ్చకుంటే తను రచయితగా పని చేస్తున్న చిరంజీవి సినిమా చూడవద్దన్న కోన స్టేట్ మెంట్ ను ఆడియన్స్ ఎంత వరకూ సీరియస్ గా తీసుకున్నారో చూద్దాం.
కథ:
తెలంగాణలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బావా మరదళ్ళుగా ఒకే రోజున పుట్టిన జంట యాదగిరి (హర్ష్ రోషన్), రాజీ (శ్రీదేవి). చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగిన వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. పెద్దయ్యాక పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ గిరికి చదువు ఎక్కదు. ఓ మ్యూజిక్ బ్యాండ్ క్రియేట్ చేసి కాలం గడుపుతూ ఉంటాడు. రాజీ బాగా చదివి టెన్త్ క్లాస్ లో జిల్లాకే ఫస్ట్ వస్తుంది. పైచదువు కోసం రాజీ సిటీకి వెళ్ళడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. గిరి ఊళ్లోనే స్నేహితులతో బ్యాండ్ కొడుతూ ఓ మ్యూజిక్ సంస్థ నుంచి ఆల్బమ్ చేయమని ఆఫర్ రావడంతో నానా తిప్పలు పడి స్టూడియో పెడతాడు. అయితే కొబ్బరికాయ కొట్టిన రోజే స్టూడియో కాలిపోతుంది. అంతలోనే మరదలు రాజీకి పెళ్లి ఏర్పాటు చేస్తాడు తండ్రి సాయన్న (సాయికుమార్). పెళ్లి టైమ్ కి రాజీ మిస్ అవుతుంది. దాంతో ఆమె లేచిపోయిందనే టాక్ మొదలవుతుంది. అసలు రాజీ పారిపోవడానికి కారణం ఏంటి? గిరి, రాజీ కథ కంచికి చేరిందా? లేదా? గిరి కెరీర్ బాగుపడిందా? అన్నదే కథ.
విశ్లేషణ..
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ తర్వాత నిర్మాణానికి కొంత గ్యాప్ ఇచ్చారు కోన వెంకట్. రచయితగా పలు కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన కోన ‘బ్యాండ్ మేళం’తో మరోసారి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో బావ మరదళ్ల మధ్య సాగే ఈ ప్రేమ కథ గిరి, రాజీ చిన్నప్పటి నేపథ్యంతో ఆరంభమై ఇద్దరి ఫ్యామిలీ ఆస్తులు తారుమారై ఓ 20 నిమిషాలు సాగి ఆ తర్వాత గిరి, రాజీ లవ్ ట్రాక్ వైపు తిరుగుతుంది. ఇద్దరి మధ్య కెరీర్ ఛాలెంజ్, దూరం పెరగడం ఇదంతా పరమ రొటీన్ గా సాగుతుంది. రాజీ పెళ్లి కుదరడం, ఆపై లేచిపోవడం.. తర్వాత ఏం జరుగుతుందనేది కూడా ఆడియన్స్ ఊహకు తగ్గట్లే ఉంటుంది. క్లైమాక్స్ లో రాజీ ఇచ్చే ట్విస్ట్ కూడా ముందే గ్రహించవచ్చు. ఫ్యామిలీ సీన్స్ నుంచి అన్ని సన్నివేశాలు ఎప్పుడో పాత చింతకాయ పచ్చడిలా సాగటంతో ఆడియన్స్ బాగా బోర్ ఫీలవుతారు. ఇక మ్యూజిక్ స్టూడియో కట్టడం… అక్కడ హీరో చేసే వీరంగం, బ్యాంక్ వాళ్లు ఇంటిమీదకు వచ్చే సీన్స్, కవిత లేచిపోవడం… ఇవన్నీ ప్రేక్షకుడి సహనానికి పెద్ద పరీక్ష. బావా మరదళ్ల లవ్ ట్రాక్ నుంచి ఏ సీన్ లోనూ ఫీల్, ఎమోషన్ లేకపోవడం పెద్ద మైనస్. సినిమా ఆసాంతం బలవంతంగా కామెడీని ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. ట్రెండింగ్ లో ఉన్న ‘తిప్పుకుంటున్నావ్’ పాటను చివర్లో పెట్టి నిరాశపరిచారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
యాదగిరిగా హర్ష్ రోహన్ నటన అక్కడక్కడా కాస్త అతి అనిపించినా ఓవరాల్ గా ఓకె. రాజీ పాత్రలో శ్రీదేవి ఒదిగిపోయింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే కుదిరింది.. ఫ్రెండ్స్ గా నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు. సాయన్నగా సాయికుమార్, హీరో తండ్రిగా గోపరాజు విజయ్ చక్కగా నటించారు. హీరో ఫ్రెండ్స్ గ్రూప్ లో రాణి పాత్ర పోషించిన నటి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ సతీష్ ముత్యాల విలేజ్ అందాలను బాగా క్యాప్చర్ చేశారు. విజయ్ బుల్గానిన్ సంగీతం ఓకె. మూవీకి ‘తిప్పుకుంటున్నావ్’ పాట హైలైట్. మిగతావి సోసోగా ఉన్నాయి. ఎంతో అనుభవం ఉన్న రచయిత కోన వెంకట్ నిర్మాణ పరంగా రాజీ పడకున్నా… ఇలాంటి పేలవమైన కథతో ఈ కాలం ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకోవాలనున్నారో ఆయనకే తెలియాలి. ఫక్తు పాత చింతకాయ పచ్చడి కథ ఇది. కనీసం టేకింగ్ లో కొత్తదనం కూడా లేకుండా పోయింది. ‘కోర్టు’ జంట సినిమా కదా… అని ఆశపడి వచ్చిన వారికి పూర్తి నిరాశను కలిగిస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ట్యాగ్ లైన్: బోర్ ‘బ్యాండ్’
రేటింగ్: 2/5