Balan Review: సినిమా రివ్యూ: ‘బాలన్: ది బాయ్’
ABN, Publish Date - Jun 20 , 2026 | 03:02 PM
మలయాళం నుంచి తాజాగా వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘బాలన్: ది బాయ్’. జీతూ మాధవన్ కథను అందించగా మంజుమల్‌బాయ్స్ ఫేం చిదంబరం దర్శకత్వం వహించిన చిత్రమిది. అదిశేషన్, ఫర్జానా ఫలతింగల్, టొవినో థామస్ కీలక పాత్రధారులు. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ విడుదల చేసింది. శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం.
సినిమా రివ్యూ: ‘బాలన్: ది బాయ్’ (Balan The Boy Review)
తేది: 20-6-2026
క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్‌గా మారింది మల్లూవుడ్. ఫీచర్ ఫిల్మ్ అయినా, వెబ్ సిరీస్‌లైనా ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టడం అక్కడి మేకర్స్‌కు కుదిరినంతగా మరేవరి వల్ల కావడం లేదు. ఈ మధ్యకాలంలో మలయాళంలో అలా వచ్చిన ఎన్నో చిత్రాలు చక్కని ఆదరణ పొందాయి. తాజాగా వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘బాలన్: ది బాయ్’ కూడా ఆ కోవకు చెందిందే. జీతూ మాధవన్ కథను అందించగా మంజుమల్ బాయ్స్ ఫేం చిదంబరం దర్శకత్వం వహించిన చిత్రమిది. కెవిఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ విడుదల చేసింది. శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం.
కథ: (Balan The Boy Review)
ఓ కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన మహిళ (ఫర్జానా) కథ ఇది. ఆమెకు ఓ కొడుకు (ఆదిశేషన్). భర్త లేని మహిళను సమాజం ఎలా చూస్తుందో తెలియనిది కాదు. అవన్నీ వద్దనుకుని తన కొడుకుకు అన్నీ తానే కావాలని, మరొకరు తన జీవితంలోకి రాకూడదని ఆమె భావిస్తుంది. దాంతో తల్లి కొడుకు, ఇద్దరూ రకరకాల పేర్లుతో ఐడెంటిటీని మార్చుకుంటూ వేర్వేరు ప్రాంతాల్లో తిరుగుతుంటారు. అలా కేరళలోని ఓ ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్న ఓ పెద్దావిడ చెంతకు చేరి ఆమెకు కేర్ టేకర్‌గా ఉంటుంది సదరు మహిళ. ఐడెంటిటీ మారుస్తూ, అబద్ధపు కథలు చెబుతూ ఎందుకు తామలా జీవిస్తున్నామో పిల్లాడికి అర్థం కాదు. మరో సందర్భంలో ఆ తల్లి బిడ్డ దూరమవుతారు. అలా జరగడానికి కారణం ఏంటి? పోలీసులకు దొరికిన ఆ పిల్లాడు ఏం చేశాడు? ఆ తల్లీ బిడ్డ మళ్లీ కలిశారా? లేదా? అన్నది కథ.
విశ్లేషణ:
మోసం చేసిన భర్తను చంపి జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన తల్లి, కొడుకు కథతో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత బతకడానికి రకరకాల పనులు చేస్తూ, తన గుర్తింపు ఏంటో తెలియకుండా ముందు కెళ్లడం సినిమాపై ఆసక్తి కలిగిస్తుంది. తన బిడ్డను తప్ప జీవితంలో ఎవరిని నమ్మకూడదని, కొడుకుకీ, తనకు మధ్య ఎవరూ ఉండకూడదని గీత గీసుకుని జీవించే మహిళ చుట్టూ కథ తిరిగడంతో ఫస్టాఫ్ అంతా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. అలా ఎందుకు చేస్తుందనేది క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ఏదో బలమైన కారణం ఉందని నమ్మకం కలగ చేశాడు దర్శకుడు. అదంతా సెకెండాఫ్‌లో చూపిస్తారనే ఫీలింగ్‌లో ప్రేక్షకుడు ఉంటాడు. దాంతో మరింత ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆమె ఆ ఐడెంటిటీ మార్చడానికి బలమైన కారణం చెప్పలేదు. తన బిడ్డను రక్షించుకోవడం ఆమె అంతిమ లక్ష్యం అని అర్థం చేసుకోవాలి. అయితే సెకండ్ హాఫ్‌లో పిల్లాడు తప్పిపోవడం, తల్లిని వెతుక్కుంటూ పాత ప్రాంతానికి వెళ్లడం అంతా ఇంట్రెస్ట్‌గా సాగుతుంది. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాస్త కన్‌ప్యూజ్ చేస్తుంది. టొవినో థామస్ తెరపైకి వచ్చాక కథ గాడి తప్పిందనిపిస్తుంది. కానీ పది నిమిషాల్లో మళ్లీ ట్రాక్‌లోకి వస్తుంది.అయితే క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం ‘వావ్’ అనేలా చేస్తుంది. కథను ముగించిన తీరు కూడా బాగుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు పనితీరు...
తల్లిపాత్ర పోషించిన ఫర్జానా నటన సినిమాకు పెద్ద ఎసెట్. సైకలాజికల్ థ్రిల్లర్‌కు ఈ తరహా నటన కావాలని ఆమె నిరూపించారు. అనుమానం, భయం, మానసిక ఒత్తిడికి గురి కావడం... ఇలా రకరకాల తగ్గ హావాభావాలతో ఫర్జానా ఆకట్టుకుంది. ఇక బాలన్‌గా నటించిన ఆదిశేషన్ ఈ సినిమాకు మరో ఎసెట్ అని చెప్పొచ్చు. పాత్రకు తగ్గట్టుగా అమాయకత్వంతో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో అతని అమాయకత్వపు నటన చూస్తే తెలియకుండానే కళ్లల్లో నీళ్లు వస్తాయి. తల్లి కొడుకు మధ్య సాగే ప్రతి సన్నివేశం హృద్యంగా సాగుతాయి. సెకెండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చిన టొవినో థామస్ పాత్ర కూడా బాగానే కుదిరింది. స్టార్ ఇమేజ్‌ను పక్కనపెట్టి గెస్ట్ రోల్‌లో ఆకట్టుకున్నాడు. ఎదిగిన పిల్లాడి పాత్ర చేసిన నటుడు కూడా బాగా చేశాడు. సినిమాలో గ్రాండ్ మదర్‌గా నటించిన ఆర్టిస్ట్ నవ్వులు పూయించారు. పోలీస్ స్టేషన్‌లో కనిపించిన ఆర్టిస్ట్‌లంతా ఫర్వాలేదనిపించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. సుశీన్ శ్యామ్ చక్కని నేపథ్య సంగీతం అందించారు. పాటలు ఓకే అనేలా ఉన్నాయి. అలాగే సన్నివేశానికి తగ్గట్టు సిజ్జూ ఖలీవ్ కెమెరా వర్క్, లైటింగ్ కూడా బాగా కుదిరింది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ సెకెండాఫ్‌లో ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే సినిమా మరింత వేగంగా ముందుకు సాగేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు ట్రైలర్ డబ్బింగ్ విషయంలో చాలా నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. సినిమా విషయానికొచ్చేసరికి మేకర్స్ కాస్త జాగ్రత్త తీసుకున్నట్లు కనిపించింది. కానీ టైటిల్స్ విషయంలో మళ్ళీ అదే నిర్లక్ష్యం ప్రదర్శించారు.
'ఆవేశం' ఫేమ్ జీతూ ఇచ్చిన కథకు దర్శకుడు చిదంబరం సరైన న్యాయం చేశారు. సినిమా ఫ్లో అక్కడక్కడా డ్రాప్ కావడం ఒకటే మైనస్. థ్రిల్లర్స్ చూసేవారితోపాటు భావోద్వేగాలకు కనెక్ట్ అయ్యేవారికి 'బాలన్' చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది. కథ కనెక్ట్ కాకపోతే.. పాత్రలు, వాటిని తీర్చిదిద్దిన విధానం కట్టిపడేస్తుంది. ఊహకు అందని విధంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం ఈ సినిమాకు ప్రధాన బలం.
ట్యాగ్‌లైన్: ఎంగేజింగ్ థ్రిల్లర్!
రేటింగ్: 2.75/5