Hrudayam murali Review: ‘హృదయం మురళీ’ సినిమా ఎలా ఉందంటే
ABN, Publish Date - Jul 11 , 2026 | 01:30 PM
అథర్వా మురళి కథానాయకుడిగా ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ‘ఇదయం మురళీ’ చిత్రం తెలుగులో ‘హృదయం మురళీ’ పేరుతో రిలీజ్ చేశారు. ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ కథానాయికలు. తమన్, ఎన్ ఎం నిహారిక ఇతర ముఖ్య పాత్రధారులు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని తెలుగులో విడుదల చేసింది. మరి ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.
సినిమా రివ్యూ: ‘హృదయం మురళీ’ ( Hridayam Murali review)
గతంలో పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు అథర్వా మురళి(Atharvaa Murali). తెలుగులో కూడా 'గద్దలకొండ గణేశ్' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించింది లేదు. తాజాగా ‘ఇదయం మురళీ’ తమిళ డబ్బింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘హృదయం మురళీ’ పేరుతో రిలీజ్ చేశారు. ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ కథానాయికలు. తమన్, ఎన్ ఎం నిహారిక ఇతర ముఖ్య పాత్రధారులు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని తెలుగులో విడుదల చేసింది. మరి ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.
కథ:
హృదయ (అథర్వ మురళి) చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో మేనమామ (నట్టి) సంరక్షణలో పెరుగుతాడు. అతనొక ఇంట్రావర్ట్. ఏదీ త్వరగా చెప్పలేడు. కాలేజ్ చదువుతున్న రోజుల్లో సమంత (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం ఆలస్యం కావడంతో ఆమె దూరమవుతుంది. మరో స్టేజ్ లో ఫ్రెండ్ సచిన్ (తమన్) ప్రియురాలు లాడో (ఎన్ఎం నిహారిక) ఫ్రెండ్ అముద (కాయదు లోహర్)తో పరిచయం ఏర్పడుతుంది. మళ్లీ అదే స్టోరీ... ప్రేమలో పడటం.. చెప్పలేకపోవడం… ఆ అమ్మాయి కూడా వృత్తిరీత్యా వేరే చోటుకి వెళ్లిపోవడంతో దూరమవుతారు. ఇక లైఫ్లో సెటిల్ అవడానికి మావయ్యతో కలిసి తమ డ్రీమ్ ప్రాజక్ట్ అయిన న్యూస్ ఛానల్ ప్రారంభిస్తారు. లైఫ్ అంతా బావుంది అనుకుంటున్న తరుణంలో పాత ప్రియురాలు సమంత (ప్రీతిముకుందన్) మరోసారి తారసపడుతుంది. తన ప్రేమను వ్యక్త పరచడంలో మళ్లీ ఆలస్యం చేసి ఆ అమ్మాయిని మిస్ చేసుకుంటాడు. ఇవన్నీ పక్కనపెట్టి తన మామ మినిస్టర్ కూతురు అదితి (మాళవిక మోహనన్)తో పెళ్లి కుదుర్చుతాడు. ఆ తర్వాత ఏమైంది? ప్రేమించి కూడా ఇద్దరు అమ్మాయిలతో ఆ ప్రేమను ఎందుకు వ్యక్తం చేయలేకపోయాడు? అతని సమస్య ఏంటి? అన్నదే కథ.
విశ్లేషణ:
ప్రేమను వ్యక్త పరచలేని ఓ యువకుడి వన్ సైడ్ లవ్ స్టోరీ ఇది. ఈ ప్రేమకథకు 90ల సమయంలో స్కూల్, కాలేజ్, స్నేహాన్ని జోడించి తెరకెక్కించారు. ఫస్టాఫ్ లో సమంతతో ప్రేమ, స్కూల్లో సందడితో పాత జ్ఞాపకాలు నెమరువేసుకునేలా చేశారు. హృదయ, సమంత లవ్ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. కాలేజ్ డేస్ లో హృదయ, అముదల లవ్ స్టోరీ, మరో పక్క తమన్, నిహారికల ట్రాక్తో సరదాగా సాగుతుంది. అముద ప్రేమను వ్యక్తపరిచే సమయానికి విరామం. ఆ తర్వాత తమన్ పెళ్లి తంతుతో సెకెండాఫ్ మొదలవుతుంది. హీరో లవర్స్ అంతా మళ్లీ అతని జీవితంలోకి రావడంతో సినిమా రన్ కాస్త స్లో అవుతుంది. చూసిన సీన్ నే మళ్లీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కథలో కొత్తదనం లేకపోయినా స్నేహితుల మధ్య సాగే సరదా సన్నివేశాలను మాత్రం బాగా రాసుకున్నాడు దర్శకుడు. ఎయిర్పోర్ట్కి వెళ్లే సీన్, సీఎస్కే క్రికెట్ మ్యాచ్ రిఫరెన్సులు యువతను ఆకట్టుకుంటాయి. సింపుల్ గా చెప్పాల్సిన ప్రేమకథను రెండు, మూడు ట్రాక్ లుగా చేసి సాగదీసినట్లు చూపించారు. క్లైమాక్స్ ఓవర్ సినిమాటిక్గా ఉంటుంది. కానీ ఫహాద్ ఫాజిల్ లాస్ట్ లో ఇచ్చే ట్విస్ట్ సూపర్ అనిపిస్తుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
హృదయం పాత్రలో అథర్వ చక్కగా ఒదిగిపోయాడు. గతంలోనూ ఆయన ఈ తరహా పాత్రలు చేశారు. డ్యూయల్ రోల్లో ప్రీతి ముకుందన్ ఆకట్టుకుంది. అందచందాలతోపాటు చక్కని నటన కనబర్చింది. డాక్టర్ పాత్రలో కయాదు లోహర్ ఆకట్టుకుంది. నిహారిక పాత్ర నవ్వులు పూయించింది. సంగీత దర్శకుడు తమన్ చాలాకాలం తర్వాత తెరపై కనిపించారు. సచిన్ పాత్రకు న్యాయం చేశాడు. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పుకుని ఉంటే పాత్ర మరింత పండేది. హీరోకి మావయ్య పాత్రలో నట్టి సుబ్రమణియన్ ఆకట్టుకున్నారు. ఇతర ప్రత్యేక పాత్రలలో ఫహాద్ ఫాజిల్, సింగర్ జోనితా గాంధీ మెరిశారు. ఇద్దరి పాత్రలు కథకు కీలకం గానే ఉన్నాయి. ఆడుకాలమ్ నరేన్, రాంకీ తదితరులు పరిధి మేరకు నటించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫీ బావుంది. ఇందులో తమన్ నటించడమే కాకుండా సంగీతం కూడా అందించారు. నేపథ్య సంగీతం పరంగా ఫర్వాలేదు. కానీ పాటలు మాత్రం గుర్తు పెట్టుకునేలా లేవు. సినిమా నిడివి మాత్రం ఎక్కువ. ఇంకాస్త క్రిస్ప్ చేసుంటే ల్యాగ్ అనే భావన కలగకుండా రిజల్ట్ మరోలా ఉండేది. యువతను మెప్పించే వన్ సైడ్ లవ్ స్టోరీ ఇది.
ట్యాగ్ లైన్: యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘హృదయం మురళి’
రేటింగ్: 2.5/5