With Love Review: అనస్వర రాజన్.. 'విత్ లవ్’ సినిమా రివ్యూ
ABN, Publish Date - Feb 06 , 2026 | 07:40 AM
అభిషన్ జీవింత్ హీరోగా నటించిన చిత్రం 'విత్ లవ్’. మదన్ దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. తెలుగులో సురేశ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రానా దగ్గుబాటి విడుదల చేశారు. మరీ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
సినిమా రివ్యూ: 'విత్ లవ్'
విడుదల తేది: 6–2–2026
దర్శకులు హీరోలుగా మారడం కొత్తేమీ కాదు. ఎంతో మంది అటు డైరెక్టర్స్ గా ఇటు నటులుగా మెప్పించారు. 'టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అభిషన్ జీవింత్. 7 కోట్ల బడ్జెట్తో తీసిన ఆ చిత్రం దాదాపు 90 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అభిషన్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా అందులో నటుడిగానూ కనిపించి ఆకట్టుకున్నారు. తాజాగా అభిషన్ హీరోగా నటించిన 'విత్ లవ్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో సురేశ్ ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రానా దగ్గుబాటి విడుదల చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.
కథ:
మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో తెరకెక్కిన ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించారు. సౌందర్య రజనీకాంత్ తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ ‘నిర్మించారు. ట్రైలర్ రిలీజ్ వరకూ ఈ సినిమాపై అంత బజ్ ఏర్పడలేదు. తెలుగు ట్రైలర్ వచ్చాక ప్రేక్షకులు ఈ సినిమా ప్రేమలో పడిపోయారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే… సత్య (అభిషన్ జీవింత్) ఆర్టిటెక్ట్. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఓ పట్టాన తనకు ఏ అమ్మాయి నచ్చదు. అక్క ఒత్తిడితో కాఫీ షాప్ లో ఓ అమ్మాయిని చూడటానికి వెళ్తాడు. ఆ అమ్మాయే మోనీషా (అనస్వర రాజన్). మాటల సందర్భంలో ఇద్దరూ చిన్నతనంలో ఒకే స్కూల్లో చదివామనీ, ఇద్దరూ సీనియర్ – జూనియర్స్ అని తెలుస్తోంది. ఆ మీట్ లోనే చిన్నప్పటి విషయాలు, స్నేహితులు, అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. ఆ తర్వాత తాము చదువుకున్న స్కూల్ ను సందర్శించి, స్నేహితులను, చిన్నప్పుడు ఇష్టపడిన వారిని కలవాలనుకుంటారు. ముఖ్యంగా సత్య అనీషాను, మోనీషా బాలాజీ (సచిన్)ని ఎందుకు కలవాలనుకున్నారు? ఆ తర్వాత ఏమైంది? సత్య, మోనీషా ఒకటయ్యారా? లేదా? అన్నదే కథ.
విశ్లేషణ:
ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. దానిని ప్రేక్షకుడి మనసుకు తాకేలా తెరకెక్కిస్తే ఆ సినిమాను ఎవరు తీశారు? ఎవరు నటించారు? అన్నది కూడా పట్టించుకోరు. అలాంటి సినిమానే ఇది. స్కూల్ డేస్ క్రష్, అప్పటి జ్ఞాఫకాలు, లవ్ స్టోరీస్, లవ్ ని ఎక్స్ ప్రెస్ చేయలేకపోవడం, బ్రేకప్స్.. ఆ తర్వాత జాబ్, కొత్త జీవితం నేపథ్యంలో సాగే క్యూట్ లవ్ స్టోరీ ఇది. హీరోహీరోయిన్ పెళ్లి చూపులతో మొదలై ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్... స్కూల్ కి షిఫ్ట్ అయిన ఎపిసోడ్ హిలేరియస్ గా ఉంది. స్టూడెంట్స్ మధ్య సన్నివేశాలలో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. స్కూల్లో హీరోకి ఓ షాక్ తగలడంతో కథ ప్రజెంట్ కి షిప్ట్ అవుతుంది. అక్కడి నుంచి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరో కథ .. ఆపై ఇంటర్వెల్.
ప్రథమార్ధం అంతా చిన్నప్పటి సంగతులతో అంతా రోలర్ కోస్టర్ రైడ్ లా సాగిపోయిందనే చెప్పాలి. పెళ్లంటే ఇష్టపడని ఓ కుర్రాడు.. ఎలా ప్రేమలో పడ్డాడు.. పెళ్లికి ఎలా సిద్ధమయ్యాడు అన్న దానికి స్కూల్ డేస్ ని లింక్ చేసి దర్శకుడు తెరకెక్కించిన తీరు హృద్యంగా ఉంది. సెకండాఫ్ కాస్త సీరియస్ మోడ్ లో నడుస్తుంది. ప్రస్తుత లవ్ స్టోరీ, దానిని ఎలా ముందుకు తీసుకెళ్లారు? ఈ మధ్యలో ఎదురైన సవాళ్లు… నేపథ్యంలో భావోద్వేగంతో నడుస్తుంది. కాలంతో పాటు మనుషుల్లో ఎలాంటి మార్పు వచ్చింది... బంధాలు, బాధ్యతలు ఎలా ఉండాలి? అన్నది మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు.
నటీనటుల గురించి...
అబిషన్ జీవింత్ సత్య పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. సహజసిద్ధమైన నటనతో ఆకటక్టుకున్నాడు. రొమాంటిక్, ఎమోషనల్ సీన్స్లో మెప్పించాడు. హీరోయిన్ గా అనస్వర రాజన్ ఈ కథకు పర్ఫెక్ట్ యాప్ట్. క్యూట్ లుక్స్ తో చక్కని నటన, హావభావాలతో మెస్మరైజ్ చేసింది. స్కూల్ డేస్ క్యారెక్టర్ కి, ప్రజెంట్ క్యారెక్టర్ కి మధ్య వ్యత్యాసాన్ని అద్బుతంగా ప్రదర్శించింది. అనీషా పాత్రలో కావ్యా అనిల్, బాలాజీ పాత్రలో సచిన్ నాచప్పన్ మెప్పించారు. మిగిలిన పాత్రధారులు కూడా తమ పరిధి మేరకు నటించారు. సినిమాకు కథతోపాటు పాటలు, మాటలు ఎసెట్ గా నిలిచాయి. ప్రతి పాటను సందర్భానుసారంగా ఆకట్టుకునేలా చిత్రీకరించారు. సియన్ రోల్డన్ నేపథ్య సంగీతం పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో రీ రికార్డింగ్ బాగా ఎలివేట్ చేసింది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ కూడా బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. తెలుగు అనువాదం విషయంలో కూడా మేకర్స్ తగు జాగ్రత్త తీసుకున్నారు.
ఎవరి జీవితంలో అయినా స్కూల్ డేస్, ఫస్ట్ లవ్ అనేది ఓ మధుర జ్ఞాపకమే. ఇదే ఇతివృత్తంతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ కథను, దానిలో ఉన్న థీమ్ ఎక్కడా డ్రాప్ అవకుండా తెరకెక్కించడంలోనే ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు మదన్ కి నూటికి నూరు మార్కులు వేయవచ్చు. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ తమ చిన్నప్పటి జ్ఞాపకాలు జ్ఞప్తికి రావటం ఖాయం. ఈ సినిమాలోని కొన్ని పాత్రలు నిజజీవితంలో ఎక్కడో ఓ చోట మనకు తారసపడుతూనే ఉంటాయి. దర్శకుడు అంత కనెక్టింగ్ గా సినిమాను తీర్చిదిద్దాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ గా ఈ సినిమా గుర్తుండిపోతుంది. యూత్ మాత్రమే కాదు కుటుంబ సమేతంగా చూసి ఆనందించే సినిమా ఇది.
ట్యాగ్ లైన్: ప్రేమలో పడతారు..
రేటింగ్: 3 / 5