Epic Review: ‘ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌’

ABN , Publish Date - Sep 11 , 2026 | 10:27 AM

‘బేబీ’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌ జోడీ అనిపించుకున్నారు ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ‘ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌’ సినిమాతో  మరోసారి ప్రేక్షకుల  ముందుకొచ్చారు. ఆదిత్యా హాసన్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

‘బేబీ’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌ జోడీ అనిపించుకున్నారు ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ‘ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల  ముందుకొచ్చారు. ‘90’s  వెబ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరహా కథలకు క్రేజ్‌ తీసుకొచ్చిన ఆదిత్యా హాసన్‌ ఈ చిత్రంతో ఫీచర్‌ సినిమాను డైరెక్ట్‌ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం!

కథ:
ఆదిత్య వనపర్తిలో ఓ మిడిల్‌ క్లాస్‌ కుర్రాడు. ఫిల్మ్‌ డైరెక్టర్‌ కావాలని కలలు కంటుంటాడు. తల్లిదండ్రులు మాత్రం మంచి ఉద్యోగం చేయాలని ఆశపడతారు. బాగా సంపాదించాలంటే అబ్రాడ్‌ వెళ్లాలని, అప్పుడే కట్నం కూడా ఎక్కువ వస్తుందని తలచి లండన్‌ ఫ్లైట్‌ ఎక్కించేస్తారు. ఇష్టం లేకపోయినా ఆదిత్యా లండన్‌లో దిగుతాడు. ఉండటానికి స్నేహితుల సాయంతో ఓ షేరింగ్‌ రూమ్‌ తీసుకుంటాడు. క్యాంపస్‌లోకి అడుగుపెట్టగానే.. కడలి (వైష్ణవి చైతన్య) పరిచయమవుతుంది. ఆమె ఇండిపెండెంట్‌ అమ్మాయి. ప్రతి విషయాన్ని ప్రాక్టికల్‌గా ఆలోచిస్తుంది. మొదటిరోజు పరిచయంతోనే ఆదిత్యతో కలిసి ఒకే గదిలో ఉండేంత దగ్గరవుతుంది. పరిచయం కాస్త లివింగ్‌ రిలేషన్‌ వరకూ వెళ్తుంది. ఆ రిలేషన్‌లో ముద్దులు, హగ్గులు, సెక్స్‌ ఉన్నా.. దానికి  ‘ప్రేమ’ అనే పేరు పెట్టకూడదనేది కడలి కండీషన్‌. నిబంధనతో మొదలైన ఈ బంధం 10 నెలల సమయంలో ఎంతవరకూ కొనసాగింది? దర్శకుడు కావాలనుకున్న ఆదిత్య చివరికి ఏం చేశాడు అన్నది కథ.


విశ్లేషణ:
ఓటీటీలో ఎంతో పాపులర్‌ అయిన  ‘90’s  వెబ్‌ సిరీస్‌ నుంచి చిన్న కుమారుడు ఆదిత్య క్యారెక్టర్‌ను తీసుకుని దానికి కొనసాగింపుగా దర్శకుడు ఆదిత్యాహాసన్‌ ‘ఎపిక్‌’ చిత్రాన్ని తెరకెక్కించాడు. చదువు కోసం విదేశాలకు వెళ్లిన 24 ఏళ్ల ఓ అబ్బాయి, అమ్మాయి కథ ఇది. చదువు, శారీరక ఆకర్షణ, లివింగ్‌ రిలేషన్‌, బ్రేకప్‌, హ్యాపీ లేదా శాడ్‌ ఎండింగ్‌.. ఈ నేపథ్యంలో చాలా కథలే చూశాం. ఇలాంటి కథల్ని కన్‌ఫ్యూజ్‌ కాకుండా తెరపై ఎలా అవిష్కరించాం అన్నది చాలా ముఖ్యం. కానీ దర్శకుడు తను రాసుకున్న సన్నివేశాలను తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడు. కథగా చెప్పుకోవాలంటే ఇందులో ఏమీ లేదు. కొన్ని సీన్లు మాత్రం బాగా రాసుకున్నాడు.

కుటుంబ సభ్యుల్లో ప్రేమ ఉన్నా పిల్లల అభిప్రాయాలు తెలుసుకోకపోవడం, బయటకు నవ్వుతూ కనిపించే ప్రతి మనిషి సంతోషంగా ఉండకపోవడం వంటి అంశాలపై వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటాయి. అలాగే ప్రతి మనిషికి సొంత నిర్ణయం ఎంతో ముఖ్యమని, 24 ఏళ్లు వచ్చిన అమ్మాయి జీవితం, అబ్బాయి జీవితం ఒకటి కాదని, వారిని సమాజం ఒకేలా చూడదని చెప్పే సన్నివేశం, క్లైమాక్స్‌లో తండ్రితో ఎమోషన్‌ ఇలా కొన్ని సన్నివేశాలు మాత్రం అలరిస్తాయి.. ఆలోచింపజేస్తాయి. కడలి పాత్రలోనూ కన్‌ఫ్యూజన్‌ ఉంటుంది. మొదట ఇండిపెండెంట్‌గా ఉండి.. తన నిర్ణయాల్లో స్పష్టంగా ఉన్న అమ్మాయి తీరు క్రమేణా మారిపోతుంది. కండీషన్లు పెట్టిన ఆ అమ్మాయే బ్రేక్‌ చేస్తుంది. చివర్లో ఆమెలోని ఎమోషన్‌ కూడా బలవంతంగా అనిపిస్తుంది తప్ప ఆకట్టుకోదు. మనిషికి ఓన్‌ ఐడెంటిటీ ముఖ్యమని ఆదిత్యా గమనించే సన్నివేశం బావుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
ఆదిత్య పాత్రకు ఆనంద్‌ పూర్తి న్యాయం చేశాడు. అమాయకత్వంతో కూడిన లుక్స్‌తో ఒదిగిపోయాడు. ఆయన మాత్రమే ఈ పాత్రను చేయగలడనే భావన కలిగించారు. మోడ్రన్‌, ఇండిపెండెంట్‌ అమ్మాయిగా వైష్ణవి చైతన్య చక్కని నటన కనబర్చింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. ఇంతకుముందు ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయడం అందుకు కారణం కావచ్చు. ఆదిత్యా తల్లిదండ్రులుగా శివాజీ, వాసుకి కనిపించినంత సేపు బాగానే అలరించారు. కడలికి ఫ్యామిలీ ఉన్నట్లు చెప్పారు కానీ చూపించలేదు. ఫ్రెండ్స్‌గా నటించినవారంతా పరిధి మేరకు నటించారు. గవిరెడ్డితో మంచి కామెడీ చేసే అవకాశం ఉన్నా పూర్తిగా ఉపయోగించుకోలేక పోయారు. సినిమాకు అజీమ్‌ మహ్మద్‌ సినిమాటోగ్రఫీ ఎసెట్‌. ఫొటోగ్రఫీ గ్రాండ్‌గా ఉంది. హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ నేపథ్య సంగీతం కూడా సినిమాకు బలం. ఫ్రెష్‌ మ్యూజిక్‌ అందించారు. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బావుండేది. ఒకే గదిలో ఆదిత్యా, కడలి సంభాషణలు, అలాగే ఊళ్లో ఉన్న స్నేహితుడితో ఫోన్‌ సంభాషణ బావున్నప్పటికీ చూసిన సన్నివేశమే మళ్లీ మళ్లీ చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఆ సన్నివేశాలకు అక్కడక్కడ కత్తెర వేసుంటే  బాగుండేది. నిర్మాణ విలువు సితారా సంస్థకు తగ్గట్టు గ్రాండ్‌గా ఉన్నాయి. లండన్‌ నేపథ్యం ఉన్నప్పటికీ పెద్దగా వాడుకోలేదు. సింపుల్‌గా ఒకే లోకేషన్‌లో కానిచ్చేశారు. హీరోహీరోయిన్ల తొమ్మిది నెలల జర్నీకి సరైన ముగింపు ఇవ్వలేదనిపిస్తుంది. ఎండింగ్‌ పాయింట్‌ బలంగా లేదు. ఇంకేదో చెప్పాలి.. చెప్పలేకపోయాం అన్నట్లుగా అసంతృప్తిగా ఎండింగ్‌ ఇచ్చారు. మేబీ కన్‌క్లూజన్‌గా ఫైనల్‌ ఛాప్టర్‌ ఉంది కదా.. దాన్లో చూసుకుందాం అనుకున్నారో ఏమో.. మరి. సినిమాలో యూత్‌ఫుల్‌ మూమెంట్స్‌ ఎన్నో ఉన్నప్పటికీ.. వాటిని కలిపి బలమైన కథగా మార్చడంతో దర్శకుడు ఫెయిల్‌ అయ్యాడనే చెప్పాలి.  ‘90’s లాంటి సిరీస్‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకుని ఓ క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడి సినిమా అంటే డెఫినెట్‌గా అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు దర్శకుడు చేరుకోలేకపోయారు. ఈ సినిమా విషయంలో ఆయన రాత.. తీత అంచనాలకు అనుగుణంగా లేవు.  ‘90’s   సిరీస్‌ కుటుంబం మొత్తం చూసేలా ఉంటుంది. ఈ సినిమా కొందరు మాత్రమే చూసేలా ఉంటుంది.

ట్యాగ్‌లైన్‌: ‘ఎపిక్‌’ అసంతృప్తికరం..
రేటింగ్‌: 2/5

Updated Date - Sep 11 , 2026 | 11:30 AM