Dacoit Review: అడివి శేష్.. డెకాయిట్ మూవీ రివ్యూ
ABN, Publish Date - Apr 10 , 2026 | 09:49 AM
అడివి శేష్ తాజా చిత్రం 'డెకాయిట్' శుక్రవారం జనం ముందుకొచ్చింది.
అడివి శేష్ (Adivi Sesh) తాజా చిత్రం 'డెకాయిట్' (Dacoit) శుక్రవారం జనం ముందుకొచ్చింది. నాలుగేళ్ళ క్రితం 2022లో విడుదలై విజయవంతమైన 'మేజర్, హిట్: ది సెకండ్ కేస్' తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన సినిమా ఇది. లాస్ట్ ఇయర్ 'హిట్ 3'లో జస్ట్ గెస్ట్ అప్పీయరెన్స్ మాత్రం ఇచ్చాడు. నాలుగేళ్ళ తర్వాత అతని సినిమా వస్తోందంటే అభిమానులు సహజంగానే ఆశలు పెట్టుకున్నారు. పైగా మూవీ మేకింగ్ సమయంలోనూ, రిలీజ్‌కు ముందు క్రియేట్ చేసిన హైప్ సామాన్యమైంది కాదు! మరి అలా అలా పెరిగిపోయిన అంచనాలను 'డెకాయిట్' అందుకున్నాడో లేదో తెలుసుకుందాం.
హరి (అడివి శేష్) ఓ అనాథ. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన మెడికో జూలియట్ ఉరఫ్ సరస్వతిని లవ్ చేస్తాడు. అతని జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుని, అత్యాచారం, హత్య కేసులో జైలు పాలవుతాడు. సరస్వతి గతాన్ని మనసులోంచి చెరిపేసి మూవ్ ఆన్ అవుతుంది. పెళ్ళి చేసుకున్ని ఓ పాపను కంటుంది. ప్రేమ పేరుతో తనని బలిపశువును చేసిన సరస్వతి మీద కక్ష తీర్చుకోవాలని హరి జైలు నుండి తప్పించుకుని బయటకు వస్తాడు. తన పగ తీర్చుకోవాలని అనుకునే సమయంలో సరస్వతి పీకల్లోతూ కష్టాలల్లో మునిగి ఉందని తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో హరి ఆమెపై కక్షను తీర్చుకున్నాడా? లేక క్షమించి వదిలేశాడా? మరోసారి ప్రేమ పుట్టి ఆమెను కష్టాల ఊబి నుండి బయటకు తీశాడా? ఈ క్రమంలో జైలు నుండి తప్పించుకున్న అతని కోసం వేటాడుతున్న పోలీసుల నుండి ఎలా తప్పించుకున్నాడు? ఇదంతా మిగతా కథ. Dacoit Review
ప్రేమ, మోసం, త్యాగం ఈ అంశాల మధ్యే 'డెకాయిట్' కథంతా తిరుగుతుంది. ఆవేశ పరుడైన హీరో, సమాజంలోని అట్టడుగు వర్గాలకు జరిగే అవమానం, కార్పొరేట్ హాస్పిటల్స్ చేసే దందా, హీరోయిన్ కనిపించని త్యాగం, దానికి బదులుగా హీరో ప్రాణత్యాగం... ఇవన్నీ కొన్నేళ్ళుగా తెలుగు సినిమాల్లో మనం చూస్తున్నవే. కాకపోతే పాత కథనే కొత్తగా చెప్పాలని అడివి శేష్ అండ్ కో ప్రయత్నించింది. అందుకోసం స్క్రీన్ ప్లేపై భారీ కసరత్తులే చేసింది. ఆశించిన స్థాయిలో రాని సన్నివేశాలను రీ-షూట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. పైగా ముందు అనుకున్న హీరోయిన్ శ్రుతీహాసన్ తప్పుకోవడం వల్ల కూడా రీ-షూట్స్ పడ్డాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ తీయడం వల్ల... అక్కడి ఆర్టిస్టులనూ తీసుకుని, ప్రాజెక్ట్ కు హైప్ తీసుకు రావడానికి ప్రయత్నించారు. ఏతావాతా చూస్తుండగానే మూడేళ్ళు గడిచిపోయాయి. సినిమాలో అత్యంత కీలకమైన కరోనా కాలం, కార్పొరేట్ హాస్పిటల్స్ దందా అనేది అవుట్ డేటెడ్ అయిపోయింది. సో... నిన్నటి వంటను ఇవాళ వేడి చేసి వడ్డించినట్టు అయ్యింది.
నిజానికి ఇలాంటి లోతైన ప్రేమకథలను ఎంత బలంగా చెబితే అంతగా జనాలను ఆకట్టుకుంటుంది. కానీ ఫాస్ట్ ఫుడ్ ను సర్వ్ చేసినట్టుగా టకటకా జనాలకు ఇచ్చేయాలని దర్శకుడు షానీల్ డియో చూశాడు. అదే బెడిసి కొట్టింది. ఇందుకు కథ, స్క్రీన్ ప్లే అందించిన అడివి శేష్ కూడా బాధ్యుడే. అతనికి పెట్టిన మదనపల్లి యాస థియేటర్లోని జనాలకు అర్థం కావడానికే అరగంట పట్టింది. ఇక కార్పొరేట్ హాస్పిటల్ నుండి అంబులెన్స్ లో పంపే డబ్బును కొట్టేసే ప్రక్రియ చూస్తుంటే... హీరోహీరోయిన్లకు ఒక్కో బ్రాంచ్ ఒక్కో ఏటీఎం సెంటర్ లా అనిపించింది. పోలీసులు ఇటు హరిని, అటు కార్పొరేట్ హాస్పిటల్ అధినేత సాల్మాన్ రెడ్డి (ప్రకాశ్ రాజ్)ని వెంటాడటం తమాషాగా అనిపిస్తుంది. అలానే హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ మొదలు కావడానికి కారణాలు కూడా బలంగా లేవు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే... అయ్యప్పమాలలో ఉన్న సీఐ రాంబాబు (అనురాగ్ కశ్యప్)ను రంగంలోకి దించడం, తనవల్ల జరిగిన తప్పును ఎలాగైనా సరిచేయాలని మరో పోలీస్ ఆధికారిణి జానకి (జైన్ మారీ ఖాన్) భావించడం, జోనితా గాంధీతో ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేయించడం, కన్నెపిట్టరో సాంగ్ రీమిక్స్ చేయడం... ఇవన్నీ 'డెకాయిట్'కు అదనపు హంగులని బహుశా మేకర్స్ భావించారు. కానీ ఇవేవీ సినిమాను ఒడ్డున వేయలేకపోయాయి. దీనిని హిందీలోనూ తీశారు కాబట్టే అనురాగ్ కశ్యప్, జైన్ మారీ ఖాన్ ను తీసుకున్నారేమో అనిపించింది. ఇక జోనితా గాంధీపై చిత్రీకరించిన సాంగ్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. భోజ్‌పూరి నటుడు పవన్ సింగ్ స్పెషల్ ఎప్పీయరెన్స్ కూడా క్లిక్ కాలేదు. నాగార్జున మూవీలోని 'కన్నెపిట్టరో...' రీమిక్స్ సాంగ్‌ను సీన్‌లో కాకుండా పాటగానే వాడుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఏతావాతా ఈ సినిమా కోసం చేసిన ప్రయోగాలన్నీ బెడిసి కొట్టాయి.
నటీనటుల విషయానికి వస్తే అందరూ బాగా కష్టపడ్డారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అయితే నూరు శాతం ఎఫర్ట్ పెట్టారు. తమ భుజాలకెత్తుకుని ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళారు. ఓ రకంగా శ్రుతి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని మృణాల్ రావడం మంచిదే అయ్యింది. చక్కని హావభావాలను ఆమె ప్రదర్శించింది. కాకపోతే 'హాయ్ నాన్న'లో మాదిరి మరోసారి ఐదేళ్ళ అమ్మాయికి తల్లిగా ఇందులోనూ నటించాల్సి వచ్చింది. అడివి శేష్ పడిన కష్టమంతా తెర మీద కనిపిస్తోంది. అనురాగ్ కశ్యప్ తెలుగులో ఎంట్రీ అంటే ఏదేదో ఊహించుకునే వాళ్ళకు కాస్తంత నిరాశ కలుగుతుంది. 'ఖయామత్ సే ఖయామత్ తక్, జో జీతా వహీ సికందర్, జోష్' వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన మన్సూర్ ఖాన్ కుమార్తె జైన్ మారి ఖాన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అమీర్ ఖాన్ మేనకోడలు కూడా అయిన జైన్ ఈ సినిమా మొత్తంలో పోలీస్ డ్రస్ వేసుకుని సఫకేషన్ కు గురైనట్టుగా ఉంది. అందుకే ఆ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందాలను ఆరబెట్టి సోషల్ మీడియాలో సెగలు రేపింది. ఆమె పాత్ర కూడా చెప్పుకోదగ్గదిగా లేదు. సునీల్, అతుల్ కులకర్ణి, ఝాన్సీ, జరీనా వహేబ్ (ఈ యేడాది ఆమె తెలుగులో నటించిన మూడో సినిమా ఇది) ఇతర ప్రధానపాత్రలు పోషించారు. మరో కీలక పాత్రను కామాక్షి భాస్కర్ల చేసింది. అన్నట్టు రచయిత అబ్బూరి రవి కూడా ఈ సినిమాలో తెర మీద కనిపించాడు. వీళ్ళంతా తమ పాత్రలకు న్యాయం చేయడానికి కృషి చేశారు. సాంకేతిక నిపుణుల పనితనం కూడా గొప్పగా ఉంది. జ్ఞానీ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మూవీని నిలబెట్టాడు. 'పొలిమేర' సీరిస్‌తో పాటు ఆ మధ్య వచ్చిన 'రహస్యం ఇదం జగత్'కు అతనే సంగీత దర్శకుడు. భీమ్స్ అందించిన స్వరాలు ఓకే! ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. ప్రొడక్షన్ పరంగా ఎలాంటి వంకా పెట్టడానికి వీల్లేదు. సుప్రియా యార్లగడ్డ ఈ సినిమాకోసం భారీగా ఖర్చుపెట్టారు. సునీల్ నారంగ్ ఈ మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించారు. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లేను కొత్తగా చెప్పాలనుకుని తడబడటం వల్ల 'డెకాయిట్' కొంత నిరాశకు గురి చేస్తుంది. భారీ అంచనాలు పెట్టుకోకుండా థియేటర్‌కు వెళితే... ఓకే!
రేటింగ్: 2.75/5
ట్యాగ్‌లైన్: డెకాయిట్... ఓన్లీ టెక్నికల్ బ్రిలియన్స్!