పాన్ ఇండియాగా.. ‘వనజీవి రామయ్య’ బయోపిక్
ABN, Publish Date - Mar 18 , 2026 | 05:48 PM
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ వెండితెరపైకి వచ్చింది.
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా పేరు గాంచిన దరిపల్లి రామయ్య జీవితం ఇప్పుడు వెండితెరపైకి వచ్చింది. పర్యావరణ పరిరక్షణపై సమాజానికి బలమైన సందేశం ఇచ్చిన ఈ మహనీయుడి కథ ఆధారంగా రూపొందిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డుల్లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగానికి ఎంపిక కావడం విశేషం.
నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో నిదిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, భూషం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీతాన్ని బల్లేపల్లి మోహన్ అందించారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్రానికి ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శన జరిగింది.
ఈ ప్రివ్యూ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల, ప్రొఫెసర్ కోదండరాం, రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్, తన్నేరు బాబు రావు, నాగ మహేష్, సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరై చిత్రాన్ని ప్రశంసించారు.
ఈ బయోపిక్‌ను పలు భారతీయ భాషల్లో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ, రామయ్య గారి జీవితం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలవాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ప్రకృతి కోసం కోటి మొక్కలు నాటిన ఆయన సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేర్చాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ కూడా ఈ చిత్రాన్ని రామయ్యకు నివాళిగా అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్తాం అని సినిమాలో టైటిల్ పాత్ర పోషించిన నటుడు బ్రహ్మాజీ అన్నారు.
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య పర్యావరణ పరిరక్షణలో అపూర్వ సేవలు చేశారు. “వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదాన్ని ప్రజల్లో విస్తరింపజేస్తూ గ్రామాలు తిరిగారు. శుభకార్యాల్లో మొక్కలను బహుమతిగా ఇవ్వడం అనే మంచి ఆచారాన్ని ప్రారంభించారు. చెట్ల గింజలను సేకరించి అడవుల్లో చల్లడం ఆయన రోజువారీ కృషిగా కొనసాగింది.