మే 29న థియేటర్లకు.. శ్రద్ధాదాస్ ‘త్రికాల’
ABN, Publish Date - May 17 , 2026 | 07:28 PM
భారతీయ సనాతన ధర్మంలోని ఆధ్యాత్మిక రహస్యాలను ఆధునిక థ్రిల్లింగ్ కథనంతో మేళవిస్తూ రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’
భారతీయ సనాతన ధర్మంలోని ఆధ్యాత్మిక రహస్యాలను ఆధునిక థ్రిల్లింగ్ కథనంతో మేళవిస్తూ రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలి కాలంలో మైథలాజికల్ అంశాలతో వచ్చిన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘త్రికాల’పై కూడా ఆసక్తి పెరుగుతోంది.
ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కథ అందించి దర్శకత్వం వహించిన మణి తెల్లగూటి, ఈ సినిమాను థ్రిల్‌తో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. రాధిక–శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్ LLP ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా హైక్వాలిటీ VFX, మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సన్నివేశాలు, అజయ్ పవర్‌ఫుల్ పాత్ర, శ్రద్ధాదాస్ భిన్నమైన లుక్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ.. “ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే ఒక శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ తిరుగుతుంది. సనాతన ధర్మంలో దాగి ఉన్న కొన్ని ఆసక్తికరమైన రహస్యాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని ప్రయత్నించాం” అని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. “సంస్కృతి, ఆధ్యాత్మికత, ఉత్కంఠ.. ఈ మూడు అంశాలు కలిసిన కథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా రూపొందింది” అని చెప్పారు. సినిమాకు సంగీతం అందిస్తున్న హర్షవర్ధన్ రమేశ్వర్, ఇప్పటికే అర్జున్ రెడ్డి, అనిమల్, స్పిరిట్ వంటి ప్రాజెక్టులతో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘త్రికాల’కు కూడా ఆయన అందించిన సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఇప్పటికే ఈ చిత్రానికి నార్త్ ఇండియాలో మంచి బిజినెస్ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా హిందీ శాటిలైట్ హక్కులు, డబ్బింగ్ రైట్స్ మంచి ధరకు అమ్ముడైనట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్‌లో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రద్ధాదాస్, ఆర్య 2, గుంటూరు టాకీస్, ఏక్ మినీ కథ, డిక్టేటర్, నాగవల్లి వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు ‘త్రికాల’లో మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.