సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చిన్న సినిమాలను చంపేస్తున్నారు.

ABN, Publish Date - May 07 , 2026 | 09:26 PM

తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కుతున్నారని నటుడు–నిర్మాత షెరాజ్ మెహదీ ఆరోపించారు.

తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న సినిమాల పరిస్థితిపై నటుడు–నిర్మాత షెరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చిన్న సినిమాలను వ్యవస్థీకృతంగా అణగదొక్కుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా తన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రాన్ని ఉద్దేశపూర్వకంగానే థియేటర్లకు దూరం చేశారని ఆయన అన్నారు. రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని వాపోయారు.

“మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు అవకాశాలు ఇవ్వడం లేదు. ఇండస్ట్రీలో కొందరు కలిసి చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు. నైజాం ఏరియాలో ఒక్క థియేటర్ కూడా దొరకలేదు. ఇది యాదృచ్ఛికం కాదు, ప్లాన్ ప్రకారం జరుగుతోంది” అని షెరాజ్ మెహదీ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఇప్పటికే లీగల్ ఫైట్ ప్రారంభించామని, పరిశ్రమ పెద్దలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా నోటీసులు పంపినట్లు తెలిపారు.

చిన్న నిర్మాతలపై సెన్సార్ నిబంధనలు, అదనపు చార్జీలు తీవ్ర భారం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. “బాలీవుడ్‌లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవు. కానీ మన దగ్గర చిన్న సినిమా తీసిన నిర్మాత బతకడమే కష్టంగా మారింది” అని అన్నారు.

నటుడు, నిర్మాత లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ చిన్న సినిమాలపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. “చిన్న సినిమాలే వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కానీ వాటినే నాశనం చేస్తున్నారు. అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేస్తాం” అని స్పష్టం చేశారు.

నటి మధు మాట్లాడుతూ చిన్న సినిమాలకు మీడియా ప్రోత్సాహం చాలా అవసరమని పేర్కొన్నారు. “చిన్న సినిమాలు బతికితేనే కొత్త నటీనటులకు అవకాశాలు వస్తాయి” అని అన్నారు.

నటుడు, దర్శకుడు కాళీ చరణ్ మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ సిండికేట్లు, బ్రోకర్ల వ్యవస్థ చిన్న సినిమాలకు పెద్ద అడ్డంకిగా మారిందన్నారు. విడుదల నుంచి ప్రమోషన్ వరకు ప్రతిచోటా చిన్న నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

నటుడు–నిర్మాత ఉప్పు రమేష్ కూడా అవార్డుల వ్యవస్థలో చిన్న సినిమాలకు ప్రాధాన్యం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “మా సినిమాను అవార్డులకు పంపి ఫీజులు చెల్లించినా, కనీస ఆహ్వానం కూడా రాలేదు” అని అన్నారు.

చిన్న సినిమాలకు థియేటర్లు, సమాన అవకాశాలు, ప్రోత్సాహం కల్పించకపోతే కొత్త ప్రతిభ ఎదగడం కష్టమవుతుందని చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం, పరిశ్రమ పెద్దలు కలిసి చిన్న సినిమాలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 08 , 2026 | 05:32 AM