సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రైతుల మధ్య సినిమా ప్రచారం.. కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'

ABN, Publish Date - Mar 11 , 2026 | 07:58 PM

ప్ర‌స్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీయడం కంటే దాన్ని ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్లడం పెద్ద సవాలుగా మారింది.

ప్ర‌స్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీయడం కంటే దాన్ని ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్లడం పెద్ద సవాలుగా మారింది. భారీ బడ్జెట్‌లతో ప్రమోషన్స్ చేసే పెద్ద సినిమాలకు అప్పుడ‌ప్పుడు ఈ సమస్యలు ఉండ‌క పోవు. కానీ.. చిన్న చిత్రాలు ఇంకా చెప్పాలంటే సందేశాత్మక అంశాలతో రూపొందే సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి స‌వాల‌క్ష మార్గాలు వెతకాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా వినూత్నంగా ఆలోచించి త‌మ చిత్రాల‌ను వీలైనంత వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తుంటారు మేక‌ర్స్‌

ఈ నేప‌థ్యంలోనే.. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే చిత్రంకు సంబంధించ మేక‌ర్స్ విభిన్న శైలిలో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ఔరా అనిపిస్తున్నారు. నిత్యం వినూత్న ప‌ద్ద‌తుల్లో ప్రమోషన్స్ చేస్తూ దూసుకు పోతున్నారు. అంతేగాక త‌మ చిత్ర‌ కథలో ఉన్న అంశాలకు అనుగుణంగా, చిత్రబృందం తమ ప్రచార కార్యక్రమాలను కూడా అదే దిశలో రూపొందించడం ఆసక్తికరంగా ఉన్నాయి.

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సినిమా అసాంతం వ్యవసాయం ప్రధాన అంశంగా ఉండటంతో, ఈ సినిమా ప్రమోషన్‌ను కూడా రైతుల మధ్యే ప్రారంభించారు మేక‌ర్స్‌. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఇటీవ‌ల జరిగిన రైతుబడి అగ్రి షోలో చిత్రబృందం ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేసి, అక్కడికి వచ్చిన రైతులకు సినిమా కథాంశాన్ని వివరించింది. సాధారణంగా ఇలాంటి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లలో వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, కంపెనీల స్టాళ్లు మాత్రమే కనిపిస్తాయి. అలాంటి వేదికలో ఒక సినిమాకు ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయడం చాలామందిని ఆకట్టుకుంది.

అంతేకాకుండా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో జరిగిన మెగా రైతు మేళాలో కూడా ఈ సినిమా టీమ్ స్టాల్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన మంత్రులు, అధికారులు, పరిశోధకులు, మహిళా కార్యకర్తలు, రైతులు సినిమా స్టాల్‌ను సందర్శించి చిత్రబృందం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు.

ఈ చిత్రంలో.. భవిష్యత్తులో వ్యవసాయం ఎలా ఉండవచ్చో కూడా చూపించచే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్ వంటి ఆధునిక సాంకేతికతలను సంప్రదాయ వ్యవసాయ జ్ఞానంతో కలిపితే రైతులకు ఎంత ఉపయోగం ఉంటుందో కథలో ప్రస్తావించారని చిత్రబృందం చెబుతోంది. వ్యవసాయం–సాంకేతికత మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలనే ఆలోచనతో ఈ సినిమా రూపొందిందని తెలిపారు.

ఇదే సమయంలో, నేటి సమాజంలో పెరుగుతున్న కుటుంబ సమస్యలు, విడాకుల అంశాన్ని కూడా కథలో భాగంగా చూపించామ‌ని,. పాత తరాలు కుటుంబ బంధాలను కాపాడటంలో ఎలా మార్గనిర్దేశం చేసేవో గుర్తుచేస్తూ, నేటి జ‌న్‌జీ క‌ల్చ‌ర్‌లో కుటుంబ విలువలను ఎలా కాపాడుకోవాలో ఈ చిత్రం చర్చిస్తుంది అన్నారు.

ఈ మూవీలో.. సందేశాత్మక అంశాలు ఉన్నప్పటికీ, సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని చిత్రబృందం తెల‌పింది. దాదాపు పది మంది ప్రముఖ కమెడియన్స్ నటించార‌ని, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందన్నారు. త్రిగుణ్‌, పాయ‌ల్ రాధ‌కృష్ణ హీరోహీరోయిన్లుగా న‌చించిన ఈ మూవీని త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌కు తీసుకు వ‌స్తామ‌న్నారు.

Updated Date - Mar 11 , 2026 | 08:16 PM