కళాత్మక విలువలకు బాక్సాఫీసు గండం
ABN, Publish Date - Apr 25 , 2026 | 04:50 PM
మంచి నటనకు ప్రశంసలు దక్కుతున్నా, బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాకపోవడం అనేది భారతీయ సినిమా పరిశ్రమను పట్టి పీడి స్తున్న ఒక దీర్ఘకాలిక సమస్య.
మంచి నటనకు ప్రశంసలు దక్కుతున్నా, బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాకపోవడం అనేది భారతీయ సినిమా పరిశ్రమను పట్టి పీడి స్తున్న ఒక దీర్ఘకాలిక సమస్య. అది సినిమా వ్యాపారంలోని ఒక ‘పారడాక్స్’ (వైరుద్యం). ‘మనోజ్ బాజ్‌పేయీ, నవాజుద్దీన్ సిద్దిఖీ, కేకే మీనన్ లాంటి గొప్ప నటులను చూడడానికి ఎంతమంది ప్రేక్షకులు థియేటర్లకు వెళుతున్నారు? వారిని మనం అత్యుత్తమ నటులుగా కీర్తిస్తున్నాం. అది నిజం కూడా. కానీ బాక్సాఫీసు దగ్గర వారు నటించిన సినిమాల పరిస్థితి ఏమిటి?’ అంటూ నటుడు అవినాష్ తివారీ (‘లైలా మజ్ను, బుల్బుల్, మడ్గావ్ ఎక్స్‌ప్రెస్’ ఫేం) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ప్రతిభకు, బాక్సాఫీసు వసూళ్లకు మధ్య ఉన్న అంతరాన్ని మరోసారి ఎత్తి చూపాయి. మంచి సినిమాలనూ, గొప్ప నటులను ఆదరిస్తున్నామనే ప్రేక్షకులు ఆ ఆదరణను కేవలం మాటల్లో కాకుండా, టికెట్ కొని సినిమా చూడడంలో చూపించాలని అవినాష్ పరోక్షంగా పేర్కొన్నారు. ‘థియేట్రికల్ ఫుట్‌ఫాల్స్’ (ప్రేక్షకుల రాక) పైనే పరిశ్రమ ఆధారపడి ఉంటుందనీ, ఆ విషయంలో ఈ అద్భుతమైన నటులు వెనుకబడిపోతున్నారనే చేదునిజాన్ని ఆయన నొక్కి చెప్పారు.
ప్రశంసలకే పరిమితమా?
చాలామంది ప్రేక్షకులు మనోజ్ బాజ్‌పేయీ, కేకే మీనన్, నవాజుద్దీన్ సిద్దిఖీ లాంటి నటులను ‘లెజెండ్స్’ అని సోషల్ మీడియాలో పొగుడుతుంటారు. కానీ వారి సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు మాత్రం వెళ్లడానికి వెనుకాడుతుంటారు. ప్రేక్షకులు నటుడి నటనను ప్రేమిస్తున్నారు. కానీ ఆ నటుడు ఇచ్చే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం టికెట్ కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా బాక్సాఫీసు వద్ద ఉత్తమ నటులు నటించిన సినిమాలు ఫ్లాప్ ముద్ర వేయించుకుంటున్నాయి. దీనివల్ల నిర్మాతలు ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారు.
శాపంలా మారిన వరం
మంచి నటుల సినిమాలకు ఓటీటీ గొప్ప వేదికగా మారింది. అయితే, ఇదే వారి థియేటర్ వసూళ్లను దెబ్బతీస్తోంది. ‘మనోజ్ బాజ్‌పేయీ సినిమానే కదా, థియేటర్‌కు వెళ్లి చూడడం ఎందుకు, నెల రోజుల్లో ఓటీటీలో వస్తుంది, అప్పుడు తీరిగ్గా ఇంట్లోనే చూద్దాం’ అనే ధోరణి ప్రేక్షకుల్లో పెరిగింది. అదే ఒక స్టార్ హీరో సినిమా అయితే స్పాయిలర్స్ వచ్చేస్తాయి. థియేటర్లలో ఆ మాస్ హంగామా చూడాలి అని ప్రేక్షకుడు పరుగెత్తుకెళతాడు. ఇక్కడ సినిమా కంటెంట్ కంటే ఈవెంట్ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. భారతీయ సినిమాలో ఇప్పటికీ నటుడు వేరు, స్టార్ వేరు. సల్మాన్‌ఖాన్, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ల సినిమాలకు కథతో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వస్తాయి. మొదటి రోజే థియేటర్లు నిండిపోతాయి. దీనివల్ల నిర్మాతలకు మార్కెట్ రిస్క్ తక్కువ. తర్వాత డిజిటల్ వ్యూయర్‌షిప్ కూడా బాగుంటుంది. ఎందుకంటే వారొక బ్రాండ్. ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ లాంటి వారు నటనలో దిగ్గజాలు. కానీ, వీరు జనాలను థియేటర్ వరకూ లాక్కురాగలరా అనేది ఎప్పుడూ సందేహాస్పదమే. అవినాష్ తివారీ అన్నట్లు... ఇర్ఫాన్‌ఖాన్‌ను అందరూ ఇష్టపడతారు కానీ ఆయన బతికున్నప్పుడు ఆయన సినిమాలకు వచ్చిన వసూళ్లు చాలా తక్కువ. ప్రతిభావంతులైన నటులు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే తప్ప జనాలు కదలరు. ఉత్తమ నటుల సినిమాల్లో ఎక్కువగా కథ, నటనపైనే భారం వేయడం వల్ల ప్రేక్షకులు కూడా నిశ్శబ్దంగా చూడాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి సినిమాలు ఎక్కువగా ఓటీటీలోనే అసలైన హిట్ అనిపించుకుంటున్నాయి.
ప్రేక్షక పాత్రేనా?
‘సినీరంగంలోని కొందరు నటులను మనం ‘అండర్ రేటెడ్’ (సరైన గుర్తింపు దక్కని) అని పిలుస్తుంటారు. కానీ వారి సినిమాలు చూడడానికి నిజంగా ఎంతమంది థియేటర్లకు వెళుతున్నారు?’ అని ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ సూటిగా ప్రశ్నించారు.
మార్పు ఎక్కడ రావాలి?
మంచి నటులు కేవలం ఓటీటీ స్టార్లుగా మిగిలిపోకుండా ఉండాలంటే, ప్రేక్షకుల మైండ్‌సెట్‌లో మార్పు రావాలి. ‘మంచి సినిమాను థియేటర్లలోనే ప్రోత్సహించాలి’ అనే బాధ్యత పెరగాలి. అవినాష్ తివారీ లేవనెత్తిన ప్రశ్న ఒక హెచ్చరిక లాంటిది. మనం కేవలం సోషల్ మీడియాలో ‘అండర్ రేటెడ్’ అని హ్యాష్‌ట్యాగ్‌లు పెడితే సరిపోదు, వారు నటించిన సినిమాలకు థియేటర్లలో ఆదరణ కల్పించినప్పుడే ఆ నటులకు నిజమైన గౌరవం దక్కుతుంది. లేదంటే భవిష్యత్తులో కేవలం భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు మాత్రమే మిగులుతాయి. గొప్ప నటనతో కూడిన కథలు కేవలం టీవీ స్క్రీన్ లకే పరిమితమైపోతాయి.