అప్పుడు 'అఖండ 2'... ఇప్పుడు 'టాక్సిక్'... 'ధురంధర్'కు బలే కలిసొచ్చిందిగా!
ABN, Publish Date - Mar 04 , 2026 | 03:49 PM
టాక్సిక్ సినిమా వాయిదా పడటం 'ధురంధర్ 2' సినిమాకు బాగా కలిసి వస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే రూ. 200 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర లేదని అంటున్నాయి.
దర్శక నిర్మాత ఆదిత్య ధర్ (Aditya Dhar) కు ఎక్కడో సుడి ఉందని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. డిసెంబర్ 5న 'ధురంధర్' (Dhurandhar) మూవీని విడుదల చేసిన సమయంలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన 'అఖండ 2' (Akhanda 2) అదే తేదీన విడుదల కావాల్సి ఉంది. అది బాలకృష్ణ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ. ఆ సినిమా కోసం ఉత్తరాదిన కూడా బాలకృష్ణ, బోయపాటి శ్రీను ప్రచారం చేశారు. 'అఖండ' సినిమాకు ఉత్తరాదిన లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని 'అఖండ -2'ను తెలుగుతో పాటే హిందీలోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో 'అఖండ -2' సినిమా వాయిదా పడింది. దాంతో 'ధురంధర్'కు ఎదురు లేకుండా పోయింది. ఆ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో 'అఖండ 2' సినిమా థియేటర్లలోనూ ఉత్తరాదిన 'ధురంధర్' సినిమానే ప్రదర్శించారు. ఆ రకంగా రణవీర్ సింగ్ సినిమాకు కావలసినన్ని థియేటర్లు దొరికాయి.
ఇప్పుడు 'ధురంధర్ 2' మార్చి 19న విడుదల అవుతుండగా, దీనితో పాటు రిలీజ్ కావాల్సి ఉన్న యశ్ నటించిన 'టాక్సిక్' (Toxic) వాయిదా పడింది. యశ్ (Yash) నటించిన 'కేజీఎఫ్' (KGF) ఫ్రాంచైజ్ చిత్రాలకు లభించిన విశేష ఆదరణ కారణంగా 'టాక్సిక్'కూ సూపర్ క్రేజ్ వచ్చింది. ఆ సినిమాను ఉత్తరాదిన భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి పంపిణీదారులు ప్లాన్ చేశారు. కానీ గల్ఫ్‌లో జరుగుతున్న వార్ కారణంగా 'టాక్సిక్' విడుదల ఇప్పుడు వాయిదా పడింది. అది 'ధురంధర్ 2'కు బాగా కలిసివస్తుందని అంటున్నారు. 'టాక్సిక్'ను ఇంగ్లీష్ భాషలో కూడా తీసిన కారణంగా, విదేశాలలోని అస్థిరతను దృష్టిలో పెట్టుకుని దానిని జూన్ 4కు వాయిదా వేశారు. అయితే... ఆ సమస్య 'ధురంధర్ 2' రాదనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. ఎందుకంటే... గతంలోనూ 'ధురంధర్' మూవీ అరబ్ కంట్రీస్ లో విడుదల కాలేదు. కాబట్టి.. ఇప్పుడు కొత్తగా అక్కడ రిలీజ్ కాకపోవడం వల్ల ఈ సినిమాకు వచ్చే కొత్త నష్టం ఏమీ ఉండదు. పైగా భారతదేశంలో ఈ సినిమా 'టాక్సిక్' లేకపోవడం వల్ల మరిన్ని థియేటర్లలో విడుదల చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వీకెండ్‌లోనే 'ధురంధర్ 2' మూవీ వరల్డ్ వైడ్ రూ. 200 గ్రాస్‌ను వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!