‘సట్లజ్’ స్ట్రీమింగ్ ఆగిపోవడానికి కారణం ఇదేనా..

ABN , Publish Date - Jul 06 , 2026 | 07:39 PM

‘సట్లజ్’ అనే హిందీ సినిమా జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో అలా వచ్చి, ఇలా రెండు రోజులకే వెళ్ళిపోయింది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్‌లోనూ సినిమాలు అలా వచ్చి, ఇలా పోతాయా అన్న అనుమానం రాకపోదు.

Sutlej Streaming Halted

‘సట్లజ్’ అనే హిందీ సినిమా జీ5 ఓటీటీ (Zee5 OTT) ప్లాట్ ఫామ్‌లో అలా వచ్చి, ఇలా రెండు రోజులకే వెళ్ళిపోయింది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్‌లోనూ సినిమాలు అలా వచ్చి, ఇలా పోతాయా అన్న అనుమానం రాకపోదు. హనీ ట్రెహాన్ దర్శకత్వంలో రూపొందిన ‘సట్లజ్’ (Sutlej Movie)ను ఆర్.ఎస్.వి.పి. మూవీస్, మెక్ గఫిన్ పిక్చర్స్, స్కై వాక్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఆరంభంలో ‘ఘల్లుఘర’ అనే టైటిల్‌తో మొదలైంది. ఆ తర్వాత ‘పంజాబ్ 95’గా పేరు మార్చారు. చివరకు ‘సట్లజ్’ పేరుతో జనం ముందు నిలచింది. ఇందులో దిల్ జిత్ దోసాంజ్, అర్జున్ రామ్ పాల్, గీతికా విద్యా ఓహ్లియాన్, కన్వల్ జీత్ సింగ్ ముఖ్యపాత్రధారులు.


అసలు ‘సట్లజ్’ చిత్రం జీ 5 ప్లాట్ ఫామ్‌లో కేవలం 48 గంటల వ్యవధిలో ఎత్తివేయడానికి కారణమేంటి? ఈ సినిమా 2022లో పూర్తయింది. సెన్సార్ సర్టిఫికెట్ కోసం వెళితే 120 కట్స్ ప్రతిపాదించారు.. లేదా రీషూట్ చేసుకురమ్మన్నారు. దాంతో సెన్సార్ పోరాటం సాగింది. దాదాపు మూడేళ్ళు సెన్సార్ పై నిర్మాతలు పోరు సాగించారు. డాక్యుమెంటరీ స్టైల్‌లో రూపొందిన ‘సట్లజ్’ చిత్రానికి.. థియేటర్స్ లభించవని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేయాలని భావించారు. జూలై 3వ తేదీన జీ 5 (Zee5)లో ‘సట్లజ్’ స్ట్రీమింగ్ ఆరంభమైంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రాన్ని ప్లాట్ ఫామ్ నుంచి తీసివేయవలసి వచ్చింది. మూడేళ్ళకు పైగా సెన్సార్ పై పోరాటం చేసి వచ్చిన ‘సట్లజ్’ సినిమాను వీక్షించాలని పలువురు సినీ ఫ్యాన్స్ ఆశించారు. అయితే ఉన్నట్టుండి జీ5లో ‘సట్లజ్’ కనిపించకపోవడంతో సబ్‌స్క్రైబర్స్ ఆందోళన చేశారు. అందుకు జీ5 సంస్థ ‘కరెంట్ డెవలప్‌మెంట్స్’ కారణంగా ఆ చిత్ర ప్రదర్శన నిలిపివేశామని తెలిపింది. ‘భారతీయ ప్రేక్షకుల కోసం సరైన టైటిల్‌తో ఈ సినిమా త్వరలో వస్తుంది’ అని జీ5 ఓ లేఖను విడుదల చేసింది. అయితే అందులో అసలైన కారణమేదో పేర్కొనలేదు. కానీ, ఇదే చిత్రం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో జీ5లోనే స్ట్రీమింగ్ కావడం గమనార్హం! విదేశాల్లో స్ట్రీమింగ్ అవుతూ భారతదేశం కథతోనే రూపొందిన ‘సట్లజ్’ స్వదేశంలో ప్రదర్శితం కాకపోవడంపై సినీ ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ‘సట్లజ్’ టైటిల్, అందులోని కొన్ని వాస్తవిక సంఘటనలు మన దేశంలో ఓ వర్గానికి నచ్చని విధంగా ఉన్న కారణంగానే ఇక్కడ స్ట్రీమింగ్ కావడం లేదన్నది బహిరంగ రహస్యం. ‘కరెంట్ డెవలప్‌మెంట్స్’ ఏవో పేర్కొనకుండా జీ 5 సంస్థ ‘సట్లజ్’ చిత్రాన్ని విదేశాల్లో ప్రదర్శిస్తూ, ఇక్కడ స్ట్రీమింగ్ చేయనంత వరకూ ఈ మూవీ గురించి హెడ్‌లైన్స్ వస్తూనే ఉంటాయని పరిశీలకులు అంటున్నారు.


కేవలం 48 గంటల్లో ‘సట్లజ్’ సినిమా స్ట్రీమింగ్‌ను మన దేశంలో ఆపు చేయడం వల్ల ఎవరికి లాభం? ఎటూ ‘సట్లజ్’కు థియేట్రికల్ క్రేజ్ లేదు కాబట్టి, ఇలా ఆపేయడం వల్ల సదరు చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్న తర్వాత స్ట్రీమింగ్‌కు రెడీ చేస్తే అప్పుడు విశేషాదరణ లభిస్తుందని మేకర్స్ ఇలా చేశారని కొందరి మాట! ఏది ఏమైనా స్వదేశంలోనే ‘సట్లజ్’ స్ట్రీమింగ్ కాకపోవడం మాత్రం సినీ ఫ్యాన్స్‌కు ఆవేదన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి:

అంతా అతడిని ‘చింటు అన్నా’ అని పిలుస్తారట కదా..: నాగార్జున

‘లెనిన్’ కోసం గర్జించిన యంగ్ టైగర్.. ఫ్యాన్స్‌కు పండగే!

Madhavan: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవడమే నా గోల్

రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు: ప్రకాష్ రాజ్‌పై బండ్ల ఫైర్

Updated Date - Jul 06 , 2026 | 07:39 PM