సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Gadar: 25 ఏళ్ల గదర్‌.. ఇప్పుడా న‌టులు ఎక్క‌డున్నారంటే?

ABN, Publish Date - Jun 16 , 2026 | 09:58 PM

సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ విడుదలై 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ సినిమాలో నటించిన ప్రముఖులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? తెలుసుకుందాం.

Gadar

బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ చరిత్రలో 2001 జూన్‌ 15... నిజంగా మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఆమీర్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘లగాన్‌’ (Lagaan), సన్నీ డియోల్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ‘గదర్‌ : ఏక్‌ ప్రేమ్‌ కథ’ (Gadar) చిత్రాలు రెండూ ఆ రోజే విడుదలయ్యాయి. ఇవి రెండూ దేశభక్తితో ముడిపడినవి కావడం మరో విశేషం. వీటిల్లో ఆమీర్‌ఖాన్ (Aamir Khan) నటించి, నిర్మించిన ‘లగాన్‌’ చిత్రం రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తయారై, అప్పట్లో అతి ఖరీదైన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక ‘గదర్‌.. ఏక్‌ ప్రేమ్‌ కథ’ చిత్రం 1947 దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కింది. రూ. 19 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంది. ఇందులో సన్నీ డియోల్ (Sunny Deol), అమీషా పటేల్ (Ameesha Patel) జంటగా నటించారు.

‘లగాన్‌’, ‘గదర్‌..ఏక్‌ ప్రేమ్‌ కథ’ చిత్రాలు విడుదలై 25 ఏళ్లు గడిచినా అందులోని నటీనటులు, వారి పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో అలాగే నిలిచిపోయాయి. జీవిత ప్రస్థానంలో 25 ఏళ్ల కాలం అంటే ఎంతో కీలకం. 25 ఏళ్ల క్రితం ‘లగాన్‌’, ‘గదర్‌’ చిత్రాల్లో నటించిన నటీనటులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారన్నది ఆసక్తికరమైన విషయమే. ‘గదర్‌’ చిత్రం విషయమే తీసుకుంటే ఆ సినిమాలో సన్నీ డియోల్‌, అమీషా పటేల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అమ్రిష్‌ పురి, వివేక్‌ సాక్‌, లిల్లెట్‌ దూబే, ముస్తాక్‌ ఖాన్‌, ఓంపురి, ఉత్కర్ష్‌ శర్మ కీలక పాత్రల్లో నటించారు. వీళ్లలో కొందరు ఇంకా చిత్ర పరిశ్రమలోనే కొనసాగుతుండగా, మరి కొందరు అకాల మరణం పొంది కీర్తిఽశేషులయ్యారు. ‘గదర్‌’లో నటించిన కొందరు 2023లో సీక్వెల్‌గా వచ్చిన ‘గదర్‌ 2’లో కూడా నటించడం విశేషం.

కథ ఏంటంటే?

దేశ విభజన నేపథ్యంలో చెలరేగిన మత ఘర్షణల్లో సకీనా కుటుంబం పాకిస్థాన్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆ గందరగోళంలో సకీనా తన కుటుంబానికి దూరమై అమృత్‌సర్‌ రైల్వే స్టేషన్‌లో ఒక అల్లరిమూక చేతిలో చిక్కుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన తారా సింగ్‌ సకీనాను కాపాడి తన ఇంట్లో ఆశ్రయమిస్తాడు. కొంతకాలం తర్వాత తారాసింగ్‌, సకీనా పెళ్లి చేసుకుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత తన తండ్రి పాకిస్థాన్‌లో ఉన్నాడని తెలుసుకున్న సకీనా అక్కడికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే దాని చుట్టూ కథ సాగుతుంది.

సన్నీ డియోల్‌(తారా సింగ్‌)

తన నలభై ఏళ్ల కెరీర్‌లో వందకు పైగా చిత్రాల్లో నటించిన సన్నీ డియోల్‌ ప్రస్తుతం 68 ఏళ్ల వయసులో కూడా చాలా చురుగ్గానే ఉన్నారు. ఈ ఇరవై ఐదేళ్ల కాలంలో నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కూడా రాణించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘బోర్డర్‌ 2’. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘బట్వారా 1947’, ‘ఇక్కా’, ‘రామాయణ’ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.

అమీషా పటేల్‌(సకీనా)

‘గదర్‌’ చిత్రం తర్వాత అమీషా కెరీర్‌లో అనేక ఒడుదొడుకులు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ‘హమ్‌రాజ్‌(2002)’, ‘హనీమూన్‌ ట్రావెల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(2007), భూల్‌ భులయ్యా(2007), ‘థోడా ప్యార్‌ థోడా మ్యాజిక్‌(2008)’ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత కొంత కాలం ఆమె నటనకు దూరమయ్యారు. మళ్లీ ‘గదర్‌ 2’లోనూ నటించారు. ఆమె చివరిగా 2024లో వచ్చిన ‘తౌబా తేరా జల్వా’ చిత్రంలో కనిపించారు.

అమ్రిష్‌ పురి (అష్రఫ్‌ అలీ)

ప్రతినాయకుడి పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అమ్రిష్‌ పురి. ‘గదర్‌’ సినిమా తర్వాత ఆయన ‘ముజె కుచ్‌ కెహ్నా హై(2001)’, ‘ముజె షాదీ కరోగీ(2004)’, ‘హల్‌చల్‌(2004)’ వంటి చిత్రాల్లో నటించారు. 2005 జూన్‌ 12న మరణించారు.

ఉత్కర్ష్‌ శర్మ(చరణ్‌జీత్‌)

చిత్ర దర్శకుడు అనిల్‌ శర్మ కుమారుడే ఉత్కర్ష్‌ శర్మ. ‘గదర్‌’లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా తొలిసారి స్ర్కీన్‌పై కనిపించారు. పెద్దయ్యాక ఆయన ‘జీనియస్‌(2018)’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘గదర్‌ 2(2023), ‘వన్‌వాస్‌(2024)’ చిత్రాల్లో నటించారు.

వివేక్‌ సాక్‌(ధర్మియాన్‌ సింగ్‌)

‘గదర్‌’ తర్వాత ‘వివేక్‌ ఢిల్లీ హైట్స్‌’, ‘ఐత్‌రాజ్‌’, ‘36 చైనా టౌన్‌’, ‘హమ్‌కో దీవానా కర్‌ గయే’ వంటి చిత్రాల్లో కనిపించారు. 2011 జనవరి 10న ముంబైలో గుండెపోటుతో మరణించారు.

లిల్లెట్‌ దూబె(షబానా)

2003లో విడుదలైన ‘చల్తే చలే’్త, ‘భగవాన్‌’, ‘కల్‌ హో నా హో’ వంటి చిత్రాల్లో కనిపించారు. ఆ తర్వాత ‘సాంగ్స్‌ ఆఫ్‌ పార్యడైజ్‌(2025)’, ‘గిన్నీ వెడ్స్‌ సన్నీ 2(2026)’ చిత్రాల్లో నటించారు.

ముస్తాక్‌ ఖాన్‌ (గుల్‌ ఖాన్‌)

‘గదర్‌’ తర్వాత ‘ముజే షాదీ కరోగీ’, ‘ద వెల్‌కమ్‌’ ఫ్రాంచైజీ, ‘ఓ మైగాడ్‌’, ‘వాంటెడ్‌’, ‘గదర్‌ 2’ చిత్రాల్లో ముస్తాక్‌ నటించారు. ఆయన చివరగా ‘కిస్‌ కిస్కో ప్యార్‌ కరూన్‌ 2(2025)’, ‘బాబీ జీ ఘర్‌ పర్‌ హై! ఫన్‌ ఆన్‌ ద రన్‌(2026)’ చిత్రాల్లో కనిపించారు.

నీ కెరీర్‌ ఖతం అన్నారు

గదర్‌లో మినీ స్కర్టులు, షార్టుల్లో కాకుండా సినిమా మొత్తం సంప్రదాయ వస్త్రధారణతో కనిపించాను. ఇలాంటి పాత్ర చేస్తే ఇక నీ కెరీర్‌ ఖతం అవుతుందని నన్ను చాలా మంది హెచ్చరించారు. ‘గదర్‌’ కంటే ఏడాది ముందు విడుదలైన ‘కహోనా ప్యార్‌ హై’ నా తొలి చిత్రం. ఆ సినిమాతో వరుస అవకాశాలు నా తలుపు తట్టాయి. అలాంటి సమయంలో ‘గదర్‌’లో సకీనా పాత్రను చేయడం కెరీర్‌ సూసైడ్‌ లాంటిదని, ఇక అవకాశాలు రావని కొందరు నిర్మాతలు నన్ను భయపెట్టారు. అయినా లెక్క చేయకుండా ఆ సినిమా చేశాను కాబట్టే 25 ఏళ్లు అయినా జనం నన్ను గుర్తుంచుకున్నారు.

మొదట యంగ్‌ ధర్మేంద్రను ఊహించా:

ఈ చిత్ర కథను రాస్తున్నప్పుడు తారా సింగ్‌ పాత్రలో యంగ్‌ ధర్మేంద్రను ఊహించుకున్నాను. అయితే ఈ పాత్రకు డ్యాన్స్‌, పాడటం, సంగీత వాయిద్యాలు వాయించడంతోపాటు మంచి హాస్యాన్ని పండించగల నటుడు కావాలి. తర్వాత బాగా ఆలోచించి సన్నీ డియోల్‌ను ఎంపిక చేశాం. సన్నీ డియోల్‌లా తారా సింగ్‌ పాత్రను మరే నటుడు చేసి ఉండేవారు కాదేమో! ఇక సకీనా పాత్రకు 400 నుంచి 500 మందికి ఆడిషన్స్‌ నిర్వహించి చివరకు అమీషా పటేల్‌ను ఎంపిక చేశాం.

Updated Date - Jun 16 , 2026 | 09:58 PM