Batwara 1947: సన్నీతో రాజ్ కుమార్ సంతోషీ మరో సినిమా!
ABN, Publish Date - Aug 19 , 2026 | 12:37 PM
సన్నీ డియోల్, రాజ్ కుమార్ సంతోషీ కాంబినేషన్ లో వచ్చిన 'బట్వారా 1947' చిత్రం కమర్షయల్ సక్సెస్ ను సాధించలేక పోయింది. అయినా ఈ యేడాది అక్టోబర్ లో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాను ప్రకటించబోతున్నారట.
సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్, ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషీ తాజా చిత్రం 'బట్వారా 1947' స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 14న విడుదలైంది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఆమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించిన 'బట్వారా 1947' కథ బాగున్నా... దానిని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారని చాలామంది వ్యాఖ్యానించారు. పైగా ఇటీవల వచ్చిన 'మై వాసప్ ఆవూంగా' కథాంశం కూడా దాదాపు ఇలాంటిదే కావడంతో కొత్తదానాన్ని మిస్ అయి భావనను వ్యక్తం చేశారు. దేశ విభజన నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలూ తెరకెక్కాయి. 'మై వాపస్ ఆవూంగా'లో సీనియర్ నటుడు నజీరుద్దీన్ షా కీలక పాత్ర పోషిస్తే, 'బట్వారా 1947'లో సీనియర్ నటీమణి షబానా ఆజ్మీ నటించారు. వీరిద్దరి పాత్రలకు మంచి పేరొచ్చింది. కానీ ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఘన విజయాన్ని మాత్రం సాధించలేకపోయాయి.
గతంలో సన్నీ డియోల్ హీరోగా రాజ్ కుమార్ సంతోషీ తెరకెక్కించిన 'ఘాయల్, దామినీ, ఘాతక్' చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే మూడు దశాబ్దాల కాలం నాటి ఆ మ్యాజిక్ ను తాజా చిత్రం రీ క్రియేట్ చేయలేకపోయింది. 'బట్వారా' సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కాకపోయినా తగ్గేదే లే అంటున్నారు సన్నీ డియోల్ అండ్ రాజ్ కుమార్ సంతోషీ. ఈ యేడాది అక్టోబర్ లో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ కొత్త సినిమాను ప్రకటించే ఆస్కారం ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తమ కాంబినేషన్ లో ప్రేక్షకులు ఎలాంటి సినిమాను కోరుకుంటారో అలాంటి యాక్షన్ మూవీని ఈ సారి వీరు చేయబోతున్నారట. మరి ఈ సినిమా అయినా సన్నీ అభిమానుల విజయదాహార్తిని తీర్చుతుందేమో చూడాలి.
ఇవీ చదవండి:
తప్పు ఒప్పుకున్న లోకేష్.. శభాష్ అన్న బన్నీ
చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ.. ఇదెక్కడి కాంబోరా మావా
ఎన్టీఆర్- త్రివిక్రమ్ టైటిల్ మారిందిరో..