Ramayana Box Office: అనుమానాలతో మొదలై.. రూ.1400 కోట్లతో 'రామాయణం' సంచలనం

ABN , Publish Date - Nov 18 , 2026 | 10:03 AM

రణబీర్ కపూర్ నటించిన రామాయణం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా గ్రాస్‌తో పాటు సౌత్‌లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

Ramayana

ఇతిహాస గాధ‌ రామాయణాన్ని (Ramayana) రెండు భాగాలుగా తీస్తున్నారనీ, బడ్జెట్ రూ. నాలుగు వేల కోట్లు అనే ప్రకటన రాగానే అందరూ షాక్‌కు గురైన మాట వాస్తవం. ఇది నిజమేనా, అంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అనే సందేహం చాలా మందిలో మెదిలింది. అలాగే శ్రీరాముడి పాత్రను రణబీర్ కపూర్ (Ranbir Kapoor) పోషిస్తారని చెప్పగానే అందరికీ మరో షాక్.

ఎందుకంటే అప్పుడే 'యానిమల్' చిత్రంలో వయొలెంట్‌గా కనిపించిన ఆయన.. సాత్వికత.. దైవత్వం ఉట్టిపడే రాముడి పాత్రకు సరిపోడని, తెరపై అతన్ని చూడలేమని విమర్శలు మొదలయ్యాయి. అలాగే సీత పాత్రకు సాయి పల్లవి (Sai Pallavi) ని తీసుకోవడం, రావణుడిగా యష్‌ను ఎన్నుకోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అవన్నీ పట్టించు కోకుండా సైలెంట్‌గా షూటింగ్ చేసుకుంటూ వెళ్లాడు దర్శకుడు నితీశ్ తివారి (Nitesh Tiwari).

ఆ తర్వాత సినిమాలో పాత్రధారుల గెటప్స్, టీజర్, ట్రైలర్.. వదిలారు. అప్పటికీ ప్రేక్షకుల్లో అనుమానమే. ఎందుకంటే దర్శకుడు ఓం రౌత్ 'ఆదిపురుష్' అంటూ రామాయణ గాథతో భయపెట్టారు కదా! ఇలా ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాల నడుమ 'రామాయణం' మొదటి భాగం విడుదలైంది. సందేహిస్తూనే థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు తెరపై విజువల్స్ చూసి థ్రిల్ అయ్యారు. సినిమా స్లోగా ఉంది కానీ బాగుంది. అనే టాక్ మెల్లిగా స్ప్రెడ్ అయి, థియేటర్లకు జనం పెద్ద సంఖ్యలో రావడం మొదలైంది.

కట్ చేస్తే.. 'రామాయణం' విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అతి కొద్ది కాలంలోనే రూ.వెయ్యి కోట్ల మార్క్ అందుకున్న మూడో భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.1400 కోట్ల పై చిలుకు గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో ఓవర్సీస్ కలెక్షన్లే దాదాపు రూ.500 కోట్లు.

విజన్ కనెక్ట్ అయ్యింది

'రామాయణం'కు మూలస్తంభాలైన దర్శకుడు నితీశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా (Namit Malhotra) పట్టుదల, అంకిత భావం, విజన్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ప్రాజెక్ట్ కోసం వారు చేసిన కృషి, నమ్మకం వృథా కాలేదు. అబాలగోపాలాన్ని మెప్పించిన 'రావణుడు- జటాయువు' ఎపిసోడ్ కోసం దర్శకుడు దాదాపు ఆరేళ్లు శ్రమించడం అనేది వారు పడిన కష్టానికి ఓ ఉదాహరణ.

సౌత్ లో అలా..

హిందీ చిత్రాలు దక్షిణాదిలో వసూళ్ల వర్షం కురిపించడం అరుదు. కానీ 'రామాయణం' రికార్డే వేరు. విడుదలైన వారం రోజుల్లోనే దక్షిణాదిలో అత్యధిక కలెక్షన్లు సాధించిన డబ్బింగ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు 'ధురంధర్ 2' దాదాపు రూ. 70 కోట్ల వసూళ్లతో టాప్ పొజిషన్లో ఉండగా.. కేవలం పది రోజుల్లోపే ఆ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసి సరికొత్త రికార్డుల దిశగా సాగుతోంది 'రామాయణం'. ఇప్పటివరకు కేవలం దక్షిణాదిలోనే రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం నిజంగా విశేషమే!

కష్టం ఫలించింది!

మేకర్స్ ఈ సినిమా కోసం పడిన కష్టాలు ప్రతిఫలాన్నిచ్చాయని చెప్పాలి. 'ఇది కదా మన పురాణాల్ని వెండితెరపై తీయాల్సిన విధానం' అంటూ 'రామాయణం' చిత్రం చూసి ప్రేక్షకులు పొంగి పోతున్నారు.

నార్త్ లో ఇలా..

'రామాయణం' హిందీ మార్కెట్లో ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఊపు ఇలాగే కొనసాగితే త్వరలోనే నార్త్‌లోనే రూ. వెయ్యి కోట్ల ఫిగర్ ను దాటేయడం ఖాయం. రెండో వారాంతంలో కూడా పోటీ చిత్రాలు లేకపోవడం ఈ సినిమాకు మరింత కలిసొచ్చే విషయం. ఈ నెలాఖరులో ఇమ్రాన్ హష్మీ గన్ మాస్టర్ జీ9, వచ్చే నెల మొదటి వారంలో సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' వచ్చే వరకు 'రామాయణం' కలెక్షన్ల హవా కొనసాగేటట్లు కనిపిస్తోంది.

ఇంతటితో సరిపోతుందా?

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సూపర్ అనిపించే ప్రదర్శన చేస్తున్నా.. 'రామాయణం' సాధించాల్సిన కలెక్షన్ల టార్గెట్ చాలా పెద్దది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రూ.2000 కోట్ల పైనే కలెక్షన్లు సాధించాలి. ఎందుకంటే ఫస్ట్ పార్టు దాదాపు ఆ రేంజ్లో బిజినెస్ జరిగింది. ఇప్పటికే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ నుంచి భారీ మొత్తం నిర్మాతలకు అందినా. వారు సేఫ్ జోన్లోకి ఆడుగుపెట్టాలంటే సినిమా కచ్చితంగా అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించాలి. ఇదే ఇప్పుడు 'రామాయణం' ముందు ఉన్న అతి పెద్ద సవాల్. ప్రస్తుతం ఈ సినిమా స్పీడ్‌ను చూస్తుంటే అతి త్వరలోనే ఆ టార్గెట్‌ను అందుకునేలా కనిపిస్తోంది.

Updated Date - Nov 18 , 2026 | 10:03 AM