Spirit : ప్రభాస్ ఫ్యాన్స్ లో నయా జోష్ తెచ్చిన 'స్పిరిట్' పోస్టర్
ABN, Publish Date - Jan 01 , 2026 | 05:24 AM
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన లేటెస్ట్ మూవీ 'స్పిరిట్' నుండి నయా పోస్టర్ ను రిలీజ్ చేశాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు త్రిప్తి డిమ్రీ సైతం ఇందులో కనిపిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), మేవరిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్పిరిట్' (Spirit) మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ముందు చెప్పినట్టుగానే 2026 న్యూ ఇయర్ ప్రారంభ క్షణాల్లో సందీప్ రెడ్డి 'స్పిరిట్'లోని ప్రభాస్ లుక్ ను రివీల్ చేశాడు. విశేషం ఏమంటే... ఇందులో హీరోయిన్ త్రిప్తి డిమ్రీ (Triptii Dimri) కూడా ఉంది. సో... డార్లింగ్ ఫ్యాన్స్ కు ఇది డబుల్ థమాకా అన్నమాట.
ఇక 'స్పిరిట్' పోస్టర్ ను గమనిస్తే... మూవీలో యాక్షన్ పార్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో సందీప్ రెడ్డి వంగా చెప్పకనే చెప్పినట్టుగా ఉంది. ఫుల్ ఫిట్ నెస్ తో ఉన్న ప్రభాస్ బాడీ మీది అనేక గాయాలు కాగా వాటికి కట్టు కట్టి ఉంది. ఆఫ్ బేర్ బాడీతో ఉన్న అతని కుడి చేతిలో మందు బాటిల్ ఉంటే... పెదాల మీద ఉన్న సిగరెట్ ను అందాల భామ తృప్తీ డిమ్రీ లైటర్ తో వెలిగిస్తోంది. ప్రభాస్ ను ఇంత స్టైలిష్ లుక్ లో అతని అభిమానులు కూడా ఎప్పుడూ చూసి ఉండరు. ఈ పోస్టర్ తో ఒక్కసారిగా 'స్పిరిట్' మీద అంచనాలు పెరిగిపోయాయి. ఓ రకంగా ఈ లుక్ ప్రభాస్ నిలుచున్న తీరు 'యానిమల్' (Animal)లో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ను పోలి ఉందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏదేమైనా ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు తగ్గకుండా సందీప్ వంగా ఈ పోస్టర్ ను చక్కగా డిజైన్ చేశాడు. ఈ పోస్టర్ తో పాటు 'ఇండియన్ సినిమా... విట్ నెస్ యువర్ ఆజానుబాహుడు / ఆజాను బాహు, హ్యాపీ న్యూ ఇయర్ 2026' అంటూ సినీ ప్రేక్షకులకు సందీప్ శుభాకాంక్షలు తెలిపాడు. అలానే స్పిరిట్ టీమ్ 'ఇప్పటి వరకూ ఉన్నదాన్ని మీరు ప్రేమించారు... ఇక మీదట మీకు తెలియని కొత్త దాని ప్రేమలో పడండి' అని పేర్కొంది.
ఇప్పటికే 'స్పిరిట్' మూవీ నుండి 'సౌండ్ స్టోరీ' పేరుతో ఓ ఆడియో గ్లింప్స్ వచ్చింది. అందులో జైలర్ అయిన ప్రకాశ్ రాజ్ వాయిస్ వినిపించగా, అదే జైలుకు రిమాండ్ ఖైదీగా వెళ్ళిన ఐపీఎస్ టాపర్ ప్రభాస్ వాయిస్ కూడా ఉంది. నాకు చిన్నప్పటి నుండీ ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉంది అని ప్రభాస్ చెప్పడంతో ఆ గ్లింప్స్ ముగిసింది. అయితే బ్యాడ్ హ్యాబిట్ ఏమిటనేది సందీప్ రెడ్డి రివీల్ చేయలేదు. అదే ఈ సినిమాలో అత్యంత కీలకం అని అర్థమౌతోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తో పాటు నటి కాంచన కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. 'స్పిరిట్' చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కిషన్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.