రామాయణం మొదట చూసేది ఆయనేనట..

ABN , Publish Date - Aug 07 , 2026 | 06:39 PM

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం రామాయణం.

Ramayana

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం రామాయణం (Ramayana). నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ (శ్రీరాముడిగా), సాయి పల్లవి (సీతగా), యష్ (రావణుడిగా) ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రంపై అంతర్జాతీయంగా ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2026 దీపావళి కానుకగా ఈ సినిమా మొదటి భాగాన్ని విడుదల చేసేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ఇది ఇతిహాస ఆధారిత చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ, సామాజిక వర్గాల్లో భారీ చర్చ నడుస్తోంది.


ఇప్పటికే అంతకు ముందు వచ్చిన కొన్ని పౌరాణిక చిత్రాలు వివాదాల్లో చిక్కుకోవడం, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే తీవ్ర విమర్శలు రావడం వంటి చేదు అనుభవాలను మేకర్స్ ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు ఆ వివాదాలను దృష్టిలో ఉంచుకుని రామాయణం చిత్రబృందం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం. అందులో భాగంగానే దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సినిమాను చూపించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. హిందూ సంఘాల నుంచి హెచ్చరికలు, లీగల్ నోటీసుల తాకిడి రాకముందే, అధికారిక సెన్సార్ బోర్డు తనిఖీకి ముందే ప్రధాని వీక్షించి, గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సినిమాకు అత్యున్నత విశ్వసనీయత దక్కుతుందని మేకర్స్ భావిస్తున్నారట.


ఒకవేళ ఇదే నిజమైతే రామాయణం సినిమా హైప్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మోదీ రివ్యూ వచ్చాక ఈ సినిమా రేంజ్ మారిపోతుంది. ఇక కేవలం కేంద్ర స్థాయిలోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం గళం విప్పుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి నాయకులకు కూడా ఈ చిత్రాన్ని చూపించి, సాంస్కృతిక విలువలు, పాత్రల చిత్రణలో ఎలాంటి పొరపాట్లు లేవని నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తున్నారని టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Aug 07 , 2026 | 06:40 PM