బాలీవుడ్‌లో.. సమంత క్రేజీ ప్రాజెక్ట్
ABN, Publish Date - Mar 10 , 2026 | 12:57 PM
స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా సినిమాలకు విరామం ఇచ్చి కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తుంది.
దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సమంత (Samantha Ruth Prabhu) కొంతకాలంగా సినిమాలకు విరామం ఇచ్చి కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తుంది. ఇటీవలే మా ఇంటి బంగారం అనే తెలుగు సినిమాతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చేందుకు రెడీ అవుతోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను స్వయంగా సమంతే నిర్మించగా ఓ బేబీ ఫేం నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. ఈ వేసవిలో థియేటర్లలో రిలీజ్ అవనుంది.
అయితే.. ఇదిలాఉండగానే సమంతకు బాలీవుడ్ నుంచి ఓ భారీ అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ( Salman Khan) నటించనున్న ఓ పెద్ద యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం సమంత పేరును పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రముఖ దర్శక ద్వయం రాజ్ నిడిమోరు (Raj Nidimoru) డీకే (DK) దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. స్వయంగా భర్త రాజ్ నిడిమోరు ఈ సినిమాకు ఓ దర్శకుడు కావడం, కథలో పవర్‌ఫుల్ క్యారెక్టర్ అవడంతో సమంత సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అర్థమవుతోంది.
మరోవైపు.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తెలంగాణ యుద్ద వీరుడు కల్నల్ బీకుమళ్ల సంతోష్ బాబు స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న గాల్వాన్ చిత్రంలో నటిస్తుండగా, అది విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా అనంతరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఓ చిత్రం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా అనంతరం సల్మాన్ , రాజ్ డీకే సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో షూటింగ్ మొదలయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోండగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri Movie Makers) నిర్మించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.