కార్మికుడి మృతి.. సంజ‌య్ లీలా భన్సాలీపై కేసు పెట్టాల్సిందే!

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:28 PM

బాలీవుడ్ సంచలన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చిక్కుల్లో పడ్డారు. ఆయన రూపొందిస్తోన్న ‘లవ్ అండ్ వార్’ సెట్స్‌లో కార్మికుడి మరణం ఇప్పుడాయన మెడకు చుట్టుకుంటోంది.

Sanjay Leela Bhansali

బాలీవుడ్ సంచలన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) చిక్కుల్లో పడ్డారు. ఆయన రూపొందిస్తోన్న ‘లవ్ అండ్ వార్’ (Love and War) సెట్స్‌లో కార్మికుడి మరణం ఇప్పుడాయన మెడకు చుట్టుకుంటోంది. కార్మికుడి కుటుంబానికి ఈ దర్శకుడు 40 లక్షల పరిహారం చెల్లించినప్పటికీ.. కార్మిక సంఘాలు మాత్రం సంజయ్ లీలా భన్సాలీపై కేసు పెట్టి, విచారణ జరిపించాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయి. కార్మిక సంఘాల పోరాటంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా.. కోర్టు మెట్ల వరకు వెళ్లబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే..


ఇటీవల ఈ సినిమా సెట్స్‌లో కార్పెంటర్‌గా పనిచేస్తున్న 42 ఏళ్ల చంద్రధారి సింగ్ యాదవ్ మృతి చెందారు. ఆయన మరణానికి సంబంధించి స్పష్టమైన కారణం ఇప్పటి వరకు తెలియక పోవడంతో.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ రంగంలోకి దిగి, అసలు ఈ మరణం వెనుక కారణం ఏంటనేది తెలిసే వరకు పోరాటం చేసేందుకు సిద్ధమైంది. ఈ సంఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించాలని, అలాగే దర్శకుడు భన్సాలీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఈ అసోసియేషన్ ఓ లేఖను కూడా పంపించింది. ఇదిలా ఉంటే, కార్మికుడి మృతిపై మరో అసోసియేషన్ అయినటువంటి ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్.. భిన్నమైన వాదనను వినిపిస్తోంది.


కార్మికుడు విద్యుత్ ఘాతానికి గురై మరణించాడని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ చెబుతోంది. అది అవాస్తవమని, సెట్ నిర్మాణం పైకప్పు కూలడంతో చంద్రధారి సింగ్ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. చంద్రధారి సింగ్ యాదవ్ కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో పాటు.. ఆయన భార్య, ఇద్దరు మైనర్ కుమార్తెల భవిష్యత్తు కోసం కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఈ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. అలాగే, ప్రమాదం జరిగిన లొకేషన్‌లో భద్రతా తనిఖీలన్నీ పూర్తి చేసే వరకు, షూటింగ్ చేయకూడదని ప్రభుత్వానికి ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఇలా ఈ రెండు అసోసియేషన్‌ల వాదనలతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ వాదనలలో ఏది నిజం అనేది? త్వరలోనే తెలుస్తుందని అంతా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో సంగీత్ శోభన్.. దర్శకుడెవరంటే

లీగల్ వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?

పీఆర్ స్టంట్స్.. పిక్చర్స్‌కు పనికొచ్చేనా..!

‘పెద్ది’ సక్సెస్ చూసి నాకు ‘ఠాగూర్’‌లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్

Updated Date - Jun 24 , 2026 | 04:28 PM