సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Salaman khan: ట్రోల్స్‌ను పట్టించుకోను.. సినిమా ఫలితమే ముఖ్యం

ABN, Publish Date - Nov 20 , 2026 | 08:40 PM

హైదరాబాద్‌తో నా అనుబంధం ఇప్పటిది కాదు.. తరతరాలుగా కొనసాగుతోంది. ‘మైనే ప్యార్‌ కియా’ నుంచి ఇప్పటివరకు ఇక్కడి ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు

‘‘హైదరాబాద్‌తో నా అనుబంధం ఇప్పటిది కాదు.. తరతరాలుగా కొనసాగుతోంది. ‘మైనే ప్యార్‌ కియా’ నుంచి ఇప్పటివరకు ఇక్కడి ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. అప్పట్లో మా సినిమాలు చూసిన వారి తాతలు, తండ్రుల నుంచి ఇప్పటి జనరేషన్‌ వరకు అందరూ నన్ను ఆదరిస్తున్నారు. మీరంతా నా అభిమానులు కాదు.. నా కుటుంబ సభ్యులు’’ అని బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మాతృభూమి’. అపూర్వ లాఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిత్రాంగదా సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. డిసెంబరు 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సల్మాన్‌ఖాన్‌ హైదరాబాద్‌లో సందడి చేశారు.

ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌పై వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ‘‘పుస్తకం ముఖచిత్రాన్ని చూసి అందులోని విషయాలను అంచనా వేయకూడదని అంటారు. అలాగే సినిమా ట్రైలర్‌ చూసి కూడా దాని గురించి ఓ నిర్ణయానికి రాకూడదు. సినిమా చూస్తేనే అందులో ఏముందో తెలుస్తుంది. మా సినిమా ట్రైలర్‌ ఐదు నిమిషాలు ఉందని కొందరు మాట్లాడుతున్నారు. దాని వెనుక కారణమేంటో సినిమా చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్‌ విడుదలైనప్పుడు ఎంత ప్రశంసలు వచ్చాయో.. అంతే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. చాలామంది రకరకాల వార్తలు రాశారు, కామెంట్లు చేశారు. వ్యూస్‌ సంపాదించుకున్నారు.. వాటితో డబ్బు కూడా సంపాదించారు. వారంతా బాగుండాలి. నా సినిమాలపై ఎలాంటి కామెంట్లు చేసినా, ట్రోల్‌ చేసినా నేను పట్టించుకోను. సినిమా చూసిన ప్రేక్షకుల స్పందన, ఫలితం మాత్రమే నాకు ముఖ్యం’’ అని స్పష్టం చేశారు.

‘మాతృభూమి’ ఒక దేశభక్తి చిత్రం అని, ఇది బయోపిక్‌ కాదని సల్మాన్‌ తెలిపారు. ‘‘దేశాన్ని రక్షించే ఓ సైనికుడు, అతని కుటుంబం చుట్టూ ఈ కథ సాగుతుంది. ప్రతి భారతీయుడిని ఆలోచింపజేసే అంశాలు ఇందులో ఉంటాయి. దేశం విషయంలోనైనా, కుటుంబం విషయంలోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండకూడదు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య విభేదాలు రాకూడదు. అలాగే గన్‌ కల్చర్‌ ఉండకూడదనే సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాం’’ అని వివరించారు. దిల్‌ రాజు బ్యానర్‌లో చేస్తున్న సినిమా గురించి ప్రశ్నించగా.. ‘‘ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే వంశీ పైడిపల్లి అద్భుతమైన దర్శకుడు’’ అని ఆయన ప్రశంసించారు.

Updated Date - Nov 20 , 2026 | 08:45 PM